మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని
అమావాస్య మరణం
మనకు నిత్యం అనేక సందర్భాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు ఒక్కోసారి ఒక వస్తువు కోసం కానీ, మరే దాని కోసమైనా కానీ తీవ్రంగా ప్రయత్నిస్తుంటాం. కానీ, అది మనకు ఎంతకీ లభించదు. అలాగే ఒక్కోసారి కొందరు ఏ ప్రయత్నం చేయకుండానే, అనుకోకుండానే తాము కోరుకున్నవి పొందేయగలుగుతారు. అంటే, కొందరికి ఏమీ తెలియకపోయినా, ఏ వనరులు లేకపోయినా సమయానికి లబ్ధి పొందుతారు. మరికొందరికి అన్నీ తెలిసినా, అన్ని వనరులు అందుబాటులో ఉన్నా నష్టపోతుంటారు. ఇటువంటి సందర్భాల్లో ఉపయోగించే జాతీయం- ‘అమావాస్య మరణం’. ‘అన్నీ తెలిసి అమావాస్య మరణం అయ్యింది’ అనే పలుకుబడి తెలుగు నాట విరివిగా వాడుకలో ఉంది. ఏకాదశి రోజు చనిపోయిన వారు వైకుంఠానికి వెళతారని, అమావాస్య రోజు చనిపోయిన వారు నరకానికి వెళతారని ఒక న మ్మకం. అందుకే ‘అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు పోతే, ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోయాడట’ అని కూడా అంటుంటారు. దీనిలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే, అన్నీ తెలిసి దురదృష్టానికి గురైన సందర్భాన్ని ‘అమావాస్య మరణం’తో పోలుస్తారు.
కన్నాకు
మనం చాలా సందర్భాల్లో ఇతరుల గురించి కాస్త తక్కువగానే, కించపరిచినట్టుగానో మాట్లాడుతుంటాం. అటువంటి సందర్భాల్లో అవతలి వారు ఉపయోగించే జాతీయమే- ‘కన్నాకు’. ఉదాహరణకు మీరు మీ స్నేహితుడి వద్ద వేరే వ్యక్తి గురించి ‘అతను సమర్థుడు కాదు’ అన్నారనుకోండి. అప్పుడు మీ స్నేహితుడు మీతో- ‘అతనిని తక్కువ అంచనా వేయవద్దు. అతను అందరిలోకెల్లా కన్నాకు వంటి వాడు’ అన్నాడనుకోండి. అంటే, అతను చాలా ముఖ్యుడు అని చెప్పాడని అర్థం. ఇప్పటికీ తెలుగు పల్లెల్లో ‘ఆయన ఎవరనుకొన్నావు? ఈ ఊరికి కన్నాకు వంటి వాడు’ అనే మాట వినిపిస్తుంటుంది. ‘ముఖ్యమైన వ్యక్తి’, ‘కీలకమైన వ్యక్తి’ అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు. ఇంతకీ ‘కన్నాకు’ అంటే ఏమిటి? ‘కన్నాకు’ అంటే, చెట్టు, తీగలకు మొదటగా పుట్టిన ఆకు. చెట్టు ఆరోగ్యంగా ఉంది అని చెప్పడానికి ఆ చెట్టుకు మొలిచే తొలి ఆకే ఆధారం. ఈ నేపథ్యంలో నుంచి పుట్టిందే ‘కన్నాకు’ అనే పదం, జాతీయం.
పంచాగ్ని మధ్యంలో..
‘ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఏదో పంచాగ్ని మధ్యంలో బతుకుతున్నాను’ అన్నారని బదులివ్వడం మీ చెవిన పడిందనుకోండి. అదేమిటా అని ఆశ్చర్యపోకండి. అనేక రకాల సమస్యల మధ్య మనిషి కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అయిన వాళ్లందరూ దూరమై ఒఓంటరితనం మధ్య జీవిస్తున్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. అగ్నులను రకరకాలుగా పేర్కొంటారు. జ్నానాగ్ని, క్షుధాగ్ని, బడబాగ్ని, దావాగ్ని, వైదికాగ్ని.. ఇలా రకరకాల అగ్నులు ఉంటాయి. ఈ జాతీయంలో పంచాగ్ని అనే పదానికి అర్థం, వివరణ లేకపోయినా, ఇదీ అర్థమనే ఇతమిద్ధమైన అర్థం లేకున్నా.. రకరకాల అగ్నుల మధ్య (తీవ్రమైన కష్టాల్లో) ఉన్నానని చెప్పుకోవడానికి ఈ ‘పంచాగ్ని’ అనే పలుకుబడిని ఉపయోగిస్తుంటారు.
Review అన్ని తెలిసినవాడు….