అమ్మే సత్యం అమ్మ ప్రేమే స్వచ్ఛం

అక్షరమాలలో తొలి అక్షరమైన ‘అ’ అమ్మ అయ్యింది. అంటే ఆమెకు మన భాషా సంస్క•తిలో అంత పెద్దపీట దక్కింది. అమ్మే సత్యం. అమ్మ ప్రేమే స్వచ్ఛం. బంధాలెన్ని ఉన్నా బిడ్డకు అమ్మతోనే అనుబంధం. నా బిడ్డ బంగారమనే తల్లులు, మా అమ్మ దేవత అని చెప్పే పిల్లలు.. అనంత ప్రేమకు అదే ఆధారం. అందుకే మన కావ్యకర్తలు, కథకులు.. సాహిత్యంలో అమ్మకు అక్షరపూజ చేశారు. అమ్మ ప్రేమను అజరామర భావనలతో అక్షరీకరించారు. ‘మే 13 మదర్స్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.

తెలుగు సాహిత్యంలో నాటి నుంచి నేటి వరకు.. మరేనాటికైనా సరే వచ్చిన, వస్తున్న ఏ పక్రియ అయినా సరే అమ్మను స్మరించకుండా, అమ్మతనాన్ని స్ప•శించకుండా రాలేదు. రాదు. సృష్టిలో అమ్మకున్న అమృతస్థానం అటువంటిది. అమృతమే అమ్మగా అక్షరరూపం దాల్చి అందరినీ ఆశీర్వదిస్తుంటుంది. అందుకే కాబోలు కవిత్రయం, బమ్మెర పోతన ఇంకా ఎందరెందరో కవులు, కవయిత్రులు అమ్మతత్వాన్ని ఆవిష్కరిస్తూనే వస్తున్నారు.

13వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు ద్విపద ఛందస్సులో రచించిన ‘బసవ పురాణం’ తెలుగుతనానికి, అమ్మతనానికి సరిసమంగా పీట వేసింది. ఇందులోని బెజ్జ మహాదేవి కథలో అమ్మ గొప్పతనంతో పాటు అచ్చ తెలుగు అందాల సౌందర్యం కనిపిస్తుంది.
బెజ్జ మహాదేవి తెలుగు నేల మీద పుట్టిన అమ్మ. ఆమె బిడ్డల కోసం పడే తపనకు ఈ రచన అద్దం పడుతుంది. ‘శివుడికి అందరూ ఉన్నారు కానీ అమ్మ లేదేంటి?’ అని ఆమెకు సందేహం వచ్చింది. అలా ఆమెకు ఆ సందేహం కలగడానికి, అది బలపడటానికి ఆమె భావించుకున్న కారణాలు చదివితే అచ్చమైన తెలుగమ్మ మనస్సు ఎటువంటిదో తెలుస్తుంది.
‘తల్లి గల్గిన నేల తపసి గానిచ్చు
తల్లి కల్గిన నేల తలజడల్గట్టు?
తల్లి యున్న విషంబు త్రావ నేలిచ్చు?
తల్లియుండిన తోళ్లు దాల్ప నేలిచ్చు?’ అని శివుడికి తల్లే కనుక ఉంటే అలా ఉండనిస్తుందా? అనంటూ బెజ్జ మహాదేవి బాధపడిపోయింది. అలా అనుకుని తానే తల్లి అయ్యింది. అప్పటి నుంచి శివుడికి పసిపిల్లాడికి చేసిన సేవలన్నీ చేసింది. సమయానికి బిడ్డ తిండి తినకపోతే అమ్మ మనసెంత విలవిల్లాడుతుందో అంతగా శివుడికి ఒంట్లో బాగుండనప్పుడు ఆ తల్లి తల్లడిల్లింది.
‘తిండీ తిప్పలు లేకుండా ఆ ఇంటికీ ఈ ఇంటికీ ఆటాపాటా అంటూ తెగ తిరుగుతుంటావు.. జబ్బు చేయక ఏం చేస్తుంది? అక్కడక్కడ ఎవరెవరో ఏవి పెడితే అవి తింటుంటావు. పొట్టనొప్పి రాదా మరి?. నేను చెప్పినట్టు విని, పెట్టింది తింటే ఈ బాధలేవీ ఉండవు కదా?’ అని శివుణ్ణి కోప్పడటంలో అమ్మ మన
కనిపిస్తుంది. నా మాట వింటే ‘నిప్పున చెదలంటునే?’ అని అంటుంది. నిప్పునకు చెదలంటుతాయా అనేది తెలుగు నాట ఇప్పటికీ వినిపించే జాతీయం. అమ్మ మాట ప్రకారం నడుచుకుంటే ఎవరైనా సరే నిప్పులా ఉంటారని ఆ తల్లి భావన. ఇదీ పాల్కురికి సోమనాథుని బెజ్జమ్మ అమ్మతనం. పాల్కురికి తరువాత మరో 200 ఏళ్ల తర్వాత పోతన రాసిన చాలా ఘట్టాల్లో అమ్మతనంతో పాటు అచ్చ తెలుగు అక్షర సౌందర్యం, జాతీయాలు, నుడికారాల సొబగులు కనిపిస్తాయి. భాగవతం ప్రథమ స్కందంలో పోతన చదువుల తల్లిని స్తుతించే ‘అంబ నవాంబుజోజ్వల..’ పద్యంలో చదువులమ్మ చక్కదనమంతా రాసిపోసుకుంటుంది. ఆ తర్వాత ‘అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ’ పద్యంలో ‘కడుపాఱడి పుచ్చిన యమ్మ’ అని రాస్తాడు పోతన. ఇక, భాగవతం దశమ స్కంధంలో బాలకృష్ణుడిని రోలుకు కట్టడానికి యశోద చేసిన ప్రయత్నంలో చిన్నపిల్లలతో ఈనాటి అమ్మల ఇబ్బందులు కనిపిస్తాయి. చివరికి ఎలాగైతేనేం యశోదమ్మకు కృష్ణుడు చిక్కాడు. అప్పుడు పోతన అన్న మాటలు ‘జననీ బంధంబున గట్టువడియె..’ అంటే, యోగీశ్వరేశ్వరులకు ఇంకా అంతకంటే గొప్ప దేవతలకైనా సరే చిక్కని ఆ కృష్ణ పరమాత్ముడు కేవలం జననీ బంధం వల్ల యశోదమ్మకు చిక్కాడు. అమ్మంటే అంత గొప్పది అని పోతన సూటిగా చెప్పాడన్న మాట.
భాగవతం మొదటి స్కంధంలో ద్రౌపది చేత పోతన అనిపించిన మాటల్లో కూడా తెలుగింటి అమ్మ క్షమాగుణం కనిపిస్తుంది. తెలుగు జాతీయం వినిపిస్తుంది. ఆ సందర్భమేమిటంటే..
నిద్రిస్తున్న ఉప పాండవులను నిర్దాక్షిణ్యంగా అశ్వత్థామ హతమారుస్తాడు. అర్జునుడు అశ్వ త్థామను పట్టుకొచ్చి ద్రౌపది ముందు నిల్చోబెడతాడు. అప్పుడామె ‘పిన్నపాపలను చంప డానికి నీకు చేతులెలా వచ్చాయి?’ అంటుంది. నిజానికి ఉప పాండవులు చనిపోవడానికి వారు చిన్నపిల్లలేం కాదు. సాహితీ విమర్శకుల లెక్క ప్రకారం నాటికి వారి వయసు 40 ఏళ్ల వరకు ఉంటుంది. అయినా, వారిని ద్రౌపది పిన్న పాపలతో పోల్చడం వెనుక అమ్మ హృదయమే కనిపిస్తుంది. కన్నబిడ్డలు డెబ్బై, ఎనభై ఏళ్ల వయసులో ఉన్న వారైనా సరే అమ్మకు మాత్రం ఇంకా అడ్డాల్లోని బిడ్డల్లానే కనిపిస్తారు. తన పిల్లల గురించి ఇరుగుపొరుగు ఏదైనా అంటుంటే అమ్మ ఒప్పుకోదు. తన పిల్లలు చాలా అమాయకులని వెనకేసుకుని వస్తుంది. పై సందర్భంలో ద్రౌపదమ్మ కూడా అలాగే అంటుంది. ‘నీ చేతులెట్లాడనో’ అనేది ఇప్పుడు వినిపిస్తున్న ‘నీకు చేతులెలా వచ్చాయి’ అనే జాతీయానికి ప్రతిరూపమే.
విశ్వానికి ఆధారమైన సత్యానికి, అమ్మకు తేడా లేనేలేదు. అందుకే అమ్మ సత్యం అని చలం వంటి వాళ్లు నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. దేవు డికి కోపం వచ్చినా కాళ్లా వేళ్లా పడితే కరుణిస్తా మేమో కానీ, అమ్మకు కోపం వచ్చి శపిస్తే దానికి తిరుగే
ఉండదు. మహా భారతంలోని నాగమాత కద్రువ.. నాగులకు ఇచ్చిన శాపం, సర్పయాగం వంటివి దీనిని రుజువు చేస్తు న్నాయి.
అమ్మా అని పిలవని నోరు ‘కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంట’లాంటిదేనని బద్దెన అన్నాడు. అమ్మా అని పిలిపించుకోవడమే ఓ గొప్ప భాగ్యమని గృహిణులంతా భావించే మాటే.
తెలుగునాట అమ్మ మీద వచ్చినన్ని జాతీయాలు ఇంకెవరి మీదా రాలేదు. ‘అడగనిదే అమ్మైనా పెట్టదు’, ‘అమ్మ పెట్టే నాలుగూ పెడితే కానీ కుదరదు’, ‘అమ్మంటే మెరిసే మేఘం’, ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ’, ‘ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం’… ఇలాంటివన్నీ తల్లీబిడ్డల అనుబంధానికి ప్రతీకలు.
పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు.. ఇవన్నీ అయ్యాక ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో వచ్చిన భావ కవిత్వమూ అమ్మప్రేమలో తడిసి ముద్దయింది. భావ కవిత్వాన్ని నవ్య కవితా లక్షణాలతో రాసిన రాయప్రోలు వారు ప్రతీ పురుషుడినీ తీర్చిదిద్దేది తల్లే అని భావిస్తూ కవితలల్లారు. అమ్మను దేవతగా, మమతానురాగాల కొమ్మగా వర్ణించిన తీరు ఆయన పంక్తులలో కనిపిస్తుంది.
కష్టపడి పెంచిన తల్లిని గురించి కొడుకులు పట్టించుకోవడం లేదనే తపపను జాషువా ఒలికిస్తే, అబ్బూరి రామకృష్ణారావు తల్లి కష్టాన్ని గుర్తించేదెవరు? అని ప్రశ్నించారు. పాడేటి జాన్సన్‍ 88 పద్యాలతో మాతృమూర్తి నిర్యాణాన్ని గురించి రాశారు. అమ్మను పూడ్చినా అమ్మ ప్రేమను పూడ్చలేమని ఆయన అంటారు.ఇంకా ఎందరెందరో ఆధునికులు అమ్మను వేనోళ్ల అక్షరాల్లో అజరామరం చేశారు. ‘అమ్మను మించిన దైవమున్నదా’ అంటూ సినీ సాహిత్యం కూడా మాతృమూర్తులకు అక్షర నీరాజనాలు పలికింది.
అమ్మ దగ్గరుంటే బిడ్డలకు గొప్ప రక్ష. అమ్మ కొంగు పట్టుకుంటే చాలు ప్రపంచమంతా తన గుప్పిట ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకు, మనకు నచ్చిందంతా అమ్మ రూపంలానే కనిపిస్తుంది. భారతమాత, తెలుగుతల్లి అనే పేర్లు ఈ భావనల నుంచే పుట్టుకొచ్చాయి. అందుకే అమ్మ ఎప్పుడూ ‘అక్షరం’. అక్షరమంటే నశించనిదని అర్థం. అమ్మ కూడా అటువంటిదే. అమృతంలాంటి ఆ అక్షరమే అచ్చమైన తెలుగుతనమనే అమ్మతనం.

Review అమ్మే సత్యం అమ్మ ప్రేమే స్వచ్ఛం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top