అమ్మ గ్రేట్‍.. బొమ్మ హిట్‍

తెలుగు సినిమాకూ ఒక ‘అమ్మ’ ఉంది. ఆ అమ్మ.. తనకు తానుగా మాతృమూర్తి గొప్పదనాన్ని, త్యాగనిరతిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించుకుంది. తెలుగు సినిమాలో అమ్మ ప్రాథాన్యంగా వచ్చిన కథాంశ సినిమాలు చాలా వచ్చాయి. జనాదరణను పొందాయి. కొన్ని చిత్రాలైతే భావోద్వేగాలతో కదిలించి వేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మేటి చిత్రాలలో కొన్నింటి పరిచయం..

తల్లి ప్రధాన కథాంశాలతో వచ్చిన మన తెలుగు సినిమాల పరిచయం
‘అమ్మ’పై కదిలించే పాటలే కాదు.. సినిమాలూ వచ్చాయి. తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మాతృత్వపు మమకారాన్ని, అమ్మతనంలోని గొప్పదనాన్ని చాటే చిత్రాలు చాలా ఉన్నా.. వాటిలో ‘అమ్మ’ పేరుతో వచ్చిన సినిమాలు.. అలాగే టైటిల్‍లో ‘తల్లి’ పదాన్ని కలిగిన సినిమాల గురించి..
మే 9 అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా..

అమ్మ (1939)
తెలుగు సినిమాల్లో ‘అమ్మ’ టైటిల్‍తో వచ్చిన తొలి మూవీ ఇదే. 1939లో విడుదలైన ఈ చిత్రంలో రాజకుమారి, లక్ష్మీరాజ్యం, కాశీనాథుని తదితరులు నటించారు. నిరంజనపాల్‍ దర్శకత్వంలో అరోరా ఫిల్మ్ కార్పొరేషన్‍ నిర్మించిన ఈ చిత్రం.. అమ్మ గొప్పదనాన్ని చాలా గొప్పగా చాటింది. నిరంజన్‍పాల్‍.. ప్రముఖ స్వాతంత్య ్రసమరయోధుడు బిపిన్‍చంద్రపాల్‍ కుమారుడు కావడం విశేషం. అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న చిత్రసీమలో ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇన్ని థియేటర్లు, వసతులు లేవు. దీంతో ఈ సినిమా విశాఖపట్నం, కాకినాడ, సికింద్రాబాద్‍లోని 3 థియేటర్లలో మాత్రమే విడుదలైంది.

తల్లిప్రేమ (1941)
ఈ సినిమాలో కన్నాంబ హీరోయిన్‍. ఈమె నిర్మాత నాగభూషణం భార్య. రాజరాజేశ్వరి పతాకంపై కడారు నాగభూషణం ఈ చిత్రాన్ని నిర్మించారు. సీఎస్‍ఆర్‍ ఆంజనేయులు హీరోగా చేశారు.జ్యోతిష్‍ సిన్హా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘జోజో నంద బాలా జోజో గోపీలోలా’, ‘ప్రేమ నిదానము ప్రపంచ మహహా..’, జయ తులసి మాతా సకల భువన, వాదములాడకురా నరుడా..’ వంటి పాటలు అప్పట్లో ప్రేక్షక జనాదరణ పొందాయి. హీరోయిన్‍గా కన్నాంబకు మంచి పేరును, నిర్మాతకు డబ్బును మిగిల్చిన సినిమా ఇది.

కన్నతల్లి (1953)
ప్రఖ్యాత నటి జి.వరలక్ష్మి ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు, నంబియార్‍ అన్నదమ్ములుగా చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కేఎస్‍ ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఈయన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు. ఈ సినిమా ద్వారానే గాయని పి.సుశీల తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు పరిచయం అయ్యారు. ఆరుద్ర రచించగా ఘంటశాల పాడిన‘ఎంత మంచిదానవోయమ్మ నీదెంత వింత విధాన..’మనే పాట బాగా ప్రాచుర్యం పొందింది. శాంతి (వరలక్ష్మి)ని భర్త వదిలేసి ఎక్కడికో వెళ్లిపోతాడు. విస్తర్లు కుడుతూ కుటుంబ భారాన్ని మోస్తుంది శాంతి. విస్తర్లను పెద్ద కుమారుడైన అక్కినేని చేత అమ్మించి, ఆ డబ్బుతో చిన్న కుమారుడైన శంకర్‍ను
పట్నంలో ఉంచి చదివిస్తుంది. అయితే చెడు వ్యసనాలకు బానిసైన శంకర్‍.. హత్య కేసులో చిక్కుకుంటాడు.
కుమారుడిని బయట పడవేసేందుకు శాంతి ఆ నేరాన్ని తనపై వేసుకుంటుంది. తల్లి త్యాగనిరతికి అద్దంపట్టే ఈ చిత్రం అప్పట్లో సూపర్‍హిట్‍ అయ్యింది.

తల్లీబిడ్డలు (1963)
బాలయ్య కథానాయకుడిగా నటించిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఆయన సరసన కృష్ణకుమారి నాయికగా నటించారు. హేమలత తల్లి పాత్ర పోషించారు. పీఎస్‍ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దురాశకు లోనైన మనిషి ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. జంకుగొంకు లేకుండా ఎన్ని ఘోర కృత్యాలైనా చేస్తాడు. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తాడు. దురాశ మనిషిని ఎంత హీనస్థితికి దిగజారుస్తుందో తెలియ చెబుతుందీ చిత్రం. భర్త దురాశ.. కొడుకు దూరమైన సందర్భాల్లో తల్లి పడే మానసిక సంఘర్షణకు ఈ చిత్రం అద్దం పడుతుంది.

తల్లిప్రేమ (1968)
‘తల్లిప్రేమ’ టైటిల్‍తో వచ్చిన రెండో చిత్రమిది. మొదటి చిత్రం 1941లో విడుదల కాగా, అదే టైటిల్‍తో 1968లో వచ్చిన సినిమా ఇది. ఎన్టీఆర్‍, సావిత్రి జంటగా నటించారు. శ్రీకాంత్‍ దర్శకత్వం వహించగా, ఎం.ఆజమ్‍ నిర్మించారు. బిడ్డలపై తల్లి చూపించే ప్రేమకు మరేదీ సాటిరాదనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

మాతృదేవత (1969)
మహానటి సావిత్రి ఈ సినిమాకు దర్శకురాలు. అంతగా ప్రాధాన్యం లేకున్నా.. సావిత్రి మాట మీద ఎన్టీఆర్‍ ఈ సినిమాలో తన ఇమేజ్‍కు భిన్నమైన పాత్రను పోషించారు. ఆయన కుమార్తెగా చంద్రకళ నటించారు. శోభన్‍బాబు కీలకపాత్ర పోషించారు. అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‍ నిర్మాతలు. ‘మనసే కోవెలగా.. మమతలు మల్లెలుగా..’ అనే పాట సూపర్‍హిట్‍. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే గీతం నేటికీ చిరస్మరణీయ గీతంగా నిలిచిపోయింది.

అమ్మకోసం (1970)
బాలీవుడ్‍లో ఒక్కప్పటి అగ్రకథానాయిక రేఖ.. ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయమయ్యారు. కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా నటించారు. విజయనిర్మల కథానాయిక. అంజలీ పిక్చర్స్ బ్యానర్‍పై నటి, హీరోయిన్‍ అంజలీదేవి ఈ సినిమాను నిర్మించారు. అనుకోని పరిస్థితుల్లో ఒక బిడ్డను పోగొట్టుకోవడం.. మరో బిడ్డను కష్టనష్టాలకోర్చి చదివించి ప్రయోజకుడిని చేయడం.. వంటి కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

తల్లీకూతుళ్లు (1971)
శోభన్‍బాబు, కాంచన జంటగా నటించిన ఈ చిత్రంలో సావిత్రి తల్లిపాత్రను పోషించింది. జి.రామినీడు దర్శకత్వం వహించగా, క్రాంతికుమార్‍, వి.రాఘవరావు నిర్మాతలు.

బంగారుతల్లి (1971)
హిందీలో వచ్చిన ‘మదర్‍ ఇండియా’ ఎంత సూపర్‍హిట్లో తెలుసు కదా.. ఆ సినిమా ఆధారంగా తెలుగులో ‘బంగారుతల్లి’ పేరుతో వచ్చిన సినిమా ఇది. జమున, జగ్గయ్య, శోభన్‍బాబు, వైజయంతీమాల, కృష్ణంరాజు వంటి హేమాహేమీలు నటించారు. భూమి, రైతు ప్రాధాన్యమైన కథాంశమైనా.. అమ్మ విలువను చాటిన చిత్రమిది.

అమ్మమాట (1972)
వి.రామచంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మహానటి సావిత్రి తల్లి పాత్ర పోషించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించగా ‘ఎంతబాగా అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా’ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. ఈ పాటను సావిత్రి, శ్రీదేవి (అప్పట్లో బాలనటి)పై చిత్రీకరించారు. ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు’ అనే మాస్‍ గీతం కూడా సూపర్‍హిట్‍. తల్లిగా సావిత్రి అభినయం ఈ చిత్రానికే హైలైట్‍గా నిలుస్తుంది.

కన్నతల్లి (1972)
ఈ సినిమాలోనూ సావిత్రి తల్లి పాత్రను పోషించారు. చంద్రకళ కథానాయిక కాగా, శోభన్‍బాబు హీరోగా చేశారు. టి.మాధవరావు దర్శకుడు. డి.వివేకానందరెడ్డి, ఆర్‍.సీతారామరాజు నిర్మాతలు. నాగభూషణం, రాజబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఒక తల్లి పడే సంఘర్షణను తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది.

తల్లీకొడుకులు (1973)
అంజలీదేవి తల్లిగా నటించగా, కృష్ణ, చంద్రమోహన్‍ ఆమె కొడుకులుగా, అన్నదమ్ములుగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఏడిద నాగేశ్వరరావు పూర్తి స్థాయి నిర్మాతగా మారకముందు నిర్మించిన సినిమా ఇది., కాంచన కథానాయికగా చేసింది. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావు నిర్మాతలు.

అమ్మ మనసు (1974)
చలం హీరోగా నటించిన ఏకైక సినిమా ఇది. కళా తపస్వి కె.విశ్వనాథ్‍ దర్శకత్వం వహించారు. భారతి కథానాయిక. తల్లి పాత్రలో జయంతి మెరిశారు. సత్యనారాయణ, శుభ మరో జంటగా కనిపిస్తారు. జీవీఎస్‍ రాజు నిర్మాత. వేటూరి సుందరరామ్మూర్తి రచించగా, ఎస్‍పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ‘పశువైనా పక్షయినా మనిషైనా అమ్మ మనసు ఒకటే’ అనే గీతం భావయుక్తంగా ఉంటుంది.

తల్లే చల్లని దైవం (1978)
జి.వరలక్ష్మి తల్లిగా నటించిన ఈ చిత్రంలో మురళీమోహన్‍, ప్రభ జంటగా నటించారు. ఎం.రాధాదేవి, జి.కృష్ణమూర్తి నిర్మాతలుగా వ్యవహరించగా, ఎమ్మెస్‍ గోపీనాథ్‍ దర్శకత్వం వహించారు. సి.నారాయణరెడ్డి గీత రచనలోని ‘ఈ తల్లే చల్లని దైవం’ పాట బాగుంటుంది.

అమ్మ ఎవరికైనా అమ్మ (1979)
అంజలీదేవి తల్లి పాత్ర పోషించారు. రజనీకాంత్‍ హీరోగా, మోహన్‍బాబు విలన్‍ నటించారు. హిందీలో విజయవంతమైన ‘మా’ చిత్రం ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఆర్‍.త్యాగరాజన్‍ దర్శకుడు కాగా, సి.దండాయుధపాణి నిర్మాత. ఈ సినిమాలోని ‘అమ్మా నువ్వు లేని నేను’ పాట చాలా పాపులర్‍.

అమ్మ రాజీనామా (1991)
అప్పటి వరకు వచ్చిన అమ్మ సినిమాలు ఒక ఎత్తయితే.. 90లలో వచ్చిన ఈ సినిమా మరో ఎత్తు. ఒక విధంగా చెప్పాలంటే అమ్మ గురించి అధునాతన శైలిలో ఆలోచించి తీసిన సినిమా ఇది. ఓ వయసు దాటిన తరువాత ప్రతి మగవాడికి పదవీ విరమణ, విశ్రాంతి జీవితం అంటూ ఉంటాయి. మరి మహిళల సంగతి? ఆమె మరణించే వరకు ఇంటి, వంటపని, పిల్లల బాగోగుల్లో నిమగ్నమయ్యే ఉంటుంది. విశ్రాంతి లేదు. చేసే, చేయాల్సిన పనుల నుంచి రిటైర్మెంటూ లేదు. అయితే, జీవితంలో తనకూ విశ్రాంతి కావాలని కోరుకున్న ఓ అమ్మ తన ‘అమ్మ’ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటే.. ఆ ఇల్లు పరిస్థితి ఏమిటనేదే ఈ చిత్ర కథ. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి తన విలువను గుర్తించని వారి మధ్య ఒక్కసారిగా తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందో తెలిపే కథ ఇది. అప్పట్లో ఈ సినిమా ఎంతోమందిని
ఆలోచింపచేసింది. ‘అమ్మ’పై మరింత గౌరవాన్ని పెంచింది. ఇలాంటి విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకుడు. అగ్ర నిర్మాతలు కె.దేవీవరప్రసాద్‍, సి.అశ్వనీదత్‍, టి.త్రివిక్రమరావు కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. మరాఠిలో విజయవంతమైన ‘ఆయి రిటైర్‍ హోతి’ నాటకం ఆధారంగా దీనికి తెలుగులో మెరుగులు దిద్దారు. శారద తల్లి పాత్రలో కనిపించగా, అమ్మ గొప్పదనాన్ని తెలుపుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ‘ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న తియ్యని కావ్యం’, ‘సృష్టికర్త ఒక బ్రహ్మ’ అనే పాటలు అత్యంత ప్రేక్షకాదరణ పొందడమే కాక ప్రతి ‘మదర్స్ డే’ నాడు కచ్చితంగా వినిపించే పాటలు.

మాతృదేవోభవ (1993)
మాధవి కథానాయికగా నటించిన ఈ చిత్రం కూడా తెలుగు నాట ప్రేక్షకుల్ని కదిలించి వేసింది. మలయాళంలో విజయవంతమైన ‘ఆకాశదూతు’ చిత్రం ఆధారంగా తెలుగులో దీనిని తెరకెక్కించారు. నాజర్‍ మాధవి భర్తగా నటించారు. మన తెలుగు సినిమా పాటలకు ఇప్పటి వరకు రెండే జాతీయ అవార్డులు లభించాయి. అందులో ఒకటి ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘తెలుగు వీర లేవరా..’ (గీత రచయిత శ్రీశ్రీ) అనే పాట ఒకటి కాగా, రెండోది- ఈ సినిమాలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..’ అనే గీతం. వేటూరి సుందరరామ్మూర్తి రచించిన ఈ గీతం ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. క్రియేటివ్‍ కమర్షియల్స్ పతాకంపై కేఎస్‍ రామారావు ఈ సినిమాను నిర్మించగా, కె.అజయ్‍కుమార్‍ దర్శకత్వం వహించారు. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ.. క్యాన్సర్‍ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకుని తన ముగ్గురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ చిత్ర కథాంశం. తనలాగే తన పిల్లలు అమ్మానాన్నలు లేక అనాథాశ్రమంలో పెరగకూడదనే ఉద్దేశంతో ముగ్గురు బిడ్డల్ని మంచి మనసు గల మూడు కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. ఈ సందర్భంలో చోటుచేసుకునే సన్నివేశాలు.. ఆయా పాత్రల నటన జలదరింప చేస్తాయి. ఇందులో సందర్భానుసారం వచ్చే వివిధ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంకా ఈ సినిమాలోని ‘వేణువై వచ్చాను భువనానికి’ అనే పాట కూడా సూపర్‍హిట్‍.
ఇంకా అమ్మ ప్రధాన పాత్ర గల సినిమాలు చాలా వచ్చాయి. అయితే, ‘అమ్మ’, ‘తల్లి’ టైటిల్‍తో వచ్చిన సినిమాల గురించే ఇక్కడ ప్రస్తావించుకున్నాం. ఇటీవల కాలంలో వచ్చిన ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’ కూడా తల్లి-కొడుకు మధ్య చక్కని అనుబంధాన్ని ఆధునికంగా ఆవిష్కరిస్తుంది. ‘అమ్మా.. అమ్మను చూడాలని ఉంది’ అనే చిత్రం కూడా ఆలోచింపచేసేది. ఇక అమ్మ మీద వచ్చిన పాటలకు లెక్కే లేదు.

Review అమ్మ గ్రేట్‍.. బొమ్మ హిట్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top