అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లకు పలు హామీలను ఇచ్చారు. దేశాన్ని నిర్మించే కార్మికులకు అండగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంకా కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు. ఈ హామీలే ఓట్ల వర్షం కురిపించిన నేపథ్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ఇప్పుడు ఎనిమిది (8) అంశాలను కీలకంగా భావిస్తున్నారు.
1. నేషనల్ టెస్ట్ అండ్ ట్రేస్ పోగ్రాం:
ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సమస్య- కరోనా మహమ్మారి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ చేపట్టబోతున్న తక్షణ చర్య.. దేశంలో అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయించడం. ఈ క్రమంలోనే ‘నేషనల్ టెస్ట్ అండ్ ట్రేస్ పోగ్రాం’ పేరుతో లక్ష మంది సిబ్బందిని నియమించనున్నారు. కరోనా పరీక్షలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో కనీసం 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గవర్నర్లు అందరూ ఆయా రాష్ట్రాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని బైడెన్ అంటున్నారు.
2. కనీస వేతనాలు, గ్రీన్ ఎనర్జీ:
సామాజిక భద్రత చెల్లింపులుగా నెలకు అదనంగా 200 డాలర్లు చెల్లించాలనే ప్రతిపాదన ఉంది. ట్రంప్ పాలనలోని పన్నుల్లో కోతలు, ఫెడరల్ రుణాల్లో పది వేల డాలర్ల విద్యార్థుల రుణమాఫీ ఉన్నాయి. అలాగే, గ్రీన్ ఎనర్జీ కోసం 2 ట్రిలియన్ డాలర్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
3. న్యాయ సంస్కరణలు:
గత ఏడాది జాతి వివక్ష, వ్యతిరేక ఆందోళనలతో అమెరికా అట్టుడికింది. మైనారిటీలకు వివిధ రూపాల్లో అండగా నిలవడం ద్వారా జాత్యహంకార ధోరణిని ఎదుర్కోవచ్చనేది బైడెన్ అంచనా. అందుకే 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మైనారిటీలకు వ్యాపారపరంగా సహకారం అందించడం ఆయన ‘బిల్డ్ బ్యాక్’ కార్యక్రమంలో ఒక కీలకాంశం.
4. ప్రపంచ పర్యావరణ ఒప్పందం:
పారిస్ ఒప్పందంలో తిరిగి చేరాలనేది బైడెన్ నిశ్చితాభిప్రాయం. కాలుష్య ఉద్గారాలను అరికట్టడంతో మరింత వేగంగా పనిచేసేలా మిగతా ప్రపంచాన్ని కూడగట్టాలనేది బైడెన్ ఆలోచన.
5. అమెరికా ప్రతిష్ట, చైనాతో ఒప్పందం:
నాటో కూటమితో అమెరికా సంబంధాలను సరిచేయడం, చైనాతో వాణిజ్య సంబంధాలకు మొగ్గు చూపడం వంటివి బైడెన్ ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి.
6. ఒబామా కేర్:
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన హయాంలో ప్రవేశపెట్టిన పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని మరింత విస్తరిస్తారు. ఈ పథకం ద్వారా 97 శాతం మంది అమెరికన్లకు బీమా వర్తించేలా చేస్తానని బైడెన్ చెబుతున్నారు.
7. ట్రంప్ విధానాల రద్దు:
అధ్యక్ష పదవిలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే ట్రంప్ విధానాలను తిరగదోడతానని బైడెన్ చెప్పారు. శరణార్థ దరఖాస్తుల పరిమితులను ఉపసంహరించడం, మెజారిటీ ముస్లిం దేశాలకు ప్రయాణించడంపై ఉన్న నిషేధానికి తెరదించడం వంటివి ఇందులో ఉన్నాయి.
8.విద్య:
విద్యార్థి రుణమాఫీ, ట్యూషన్ ఫీజు లేని ఉచిత కాలేజీల విస్తరణ, యూనివర్సల్ ప్రీ స్కూల్ యాక్సెస్ వంటి భారీ విద్యా విధానాలకు బైడెన్ రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు.
బైడెన్ పాలన ఎలా ఉండబోతోంది?
2021, జనవరిలో వైట్‍హౌస్‍లోకి అడుగుపెట్టబోతున్న 77 ఏళ్ల జో బైడెన్ ఇప్పుడు అమెరికాకు 46వ అధ్యక్షునిగా అసలు సిసలు సవాళ్లు ఎదుర్కోబోతున్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో అతి పెద్ద వయస్కుడు ఈయనే. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వైట్ హౌస్ పీఠం వరకు చేరుకోవడానికి బైడెన్ ఎంతో సంఘర్షణకు గురయ్యారు. కానీ, గెలుపుతోనే ఆయన కల నెరవేరిపోయినట్టు కాదు. ఎందుకంటే, అంతకంటే కఠినమైన సవాళ్లు మునుముందు ఆయనకు స్వాగతం చెప్పనున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొని ఆయన అమెరికా రూపురేఖల్ని మార్చగలరా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నప్పటికీ, ఆయన పాలన ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో అత్యంత వివాదాస్పద అంశాల్లో కొన్నింటి పట్ల తన వైఖరి ఏమిటో ఆయన వెల్లడించలేదు. ఒబామా పాలన కాలానికి కొనసాగింపు ఇస్తానని మాత్రమే ప్రజలకు హామీనిచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక బైడెన్ ఎదుర్కోనున్న సవాలు ఒక్కటే.. ఏకాభిప్రాయం, ఒప్పందాల పట్ల మొగ్గు చూపించడానికి, తనకు ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలకు మధ్య సమతుల్యాన్ని సాధించడం.
టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్.. బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసమాన విజయం సాధించిన జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‍ను టైమ్ పత్రిక ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‍గా ఎంపిక చేసింది. కోవిడ్-19 మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జాత్యహంకార ఉద్యమం కూడా ఈ జాబితాలో పోటీపడ్డాయి. అయితే, వీళ్లందరినీ కాదని పర్సన్ ఆఫ్ ది ఇయర్‍గా ఎంపికయ్యారు. బైడెన్, కమలా హ్యారిస్ ఫొటోలను కవర్ పేజీపై ముద్రించిన టైమ్ మ్యాగజైన్.. ‘అమెరికా కథను మార్చారు’ అని ఉప శీర్షికను పెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‍కు మొత్తం 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డొనాల్డ్ ట్రంప్‍కు 232 ఓట్లు వచ్చాయి. అలాగే, అమెరికా ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో 70 మిలియన్లకు పైగా ఓట్లను ఆయన సాధించారు. ఇప్పటి వరకు 2006 ఎన్నికల్లో బరాక్ ఒబామా సాధించిన 6.9 మిలియన్ ఓట్లే అత్యధికం కాగా, దానిని బైడెన్ అధిగమించారు. టైమ్ మ్యాగజైన్ 1927 నుంచి ఏటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందచేస్తోంది. ఈ ఏడాదిలో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన వారిని అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‍ను వరించింది.
Review ఆ ఎనిమిదే కీలకం...