ఎదురిచ్చి చదరంగమాడే రకం!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

ఎదురుపెట్టి చందరంగమాడటం
చదరంగం వ్యసన స్థాయికి తీసుకుపోయే ఆట. అది ఒక్కరే ఆడుకునే ‘గాడిద ఆట’ వంటి పేకాటలాంటిది కాదు. రెండువైపులా ఎత్తులూ పైఎత్తులూ ఒకరే వేయడం విసిగించే పని. అందువల్ల ఆ ఆట మీద ‘రంధి’ ఎక్కువగా ఉన్న వాళ్లు మరొకరిని ఆహ్వానించి, అతగాడు ఆడనంటే సొమ్ము ఎరువిచ్చి కానీ, ఊరికే సొమ్మిచ్చి కానీ ఆటలోకి దింపుతారు. ఇంతా చేస్తే ఎదురు డబ్బులిచ్చిన వాడు గెలుస్తాడన్న నమ్మకం లేదు. గెలిచినా ఓడినా ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు. సొమ్మూ, పందెమూ రెండూ పోగొట్టుకోవాల్సి రావచ్చు. తానే గెలిస్తే గెలుపు మిగిలినా సొమ్ము పోతుంది.
తమ పనులు నెరవేర్చుకోవడానికి లంచమిచ్చిన వాడి గతి కూడా ఇలాంటిదే. లంచం తిన్నవాడు పని చేస్తాడన్న నమ్మకమే కానీ, చేసి తీరుతాడన్న మాట లేదు. పని చేయలేదేమని గట్టిగా అడిగితే నాలుగు తన్ని పంపినా దిక్కులేదు. పైగా లంచమిచ్చి దెబ్బలు తినడమే ఒక్కోసారి ఫలితంగా మిగులుతుంది. ఇలాంటి భావంతో ఎదురిచ్చి చదరంగం ఆడటమనే జాతీయాన్ని వాడుతుంటారు.
పూర్వ కవి ఒకాయన- ‘లంచా లంచయో ర్మధ్యే యతో లంచ స్తతోజయ: ఉభయో ర్లంచయో ర్మధ్యే యతోథిక స్తతో జయ:’ అన్నాడు. ఒకరు లంచమిచ్చి మరొకరు ఇవ్వకపోతే ఇచ్చిన వాడికే జయం. ఇద్దరూ ఇస్తే ఎక్కువ ఇచ్చిన వాడికి విజయం అని పై శ్లోకానికి భావం. లంచం ఇచ్చీ అనుకున్న పని నెరవేరుతుందని గట్టిగా చెప్పలేనట్లు ఎదురు మదుపు పెట్టి కూడా గెలుస్తామన్న విశ్వాసం లేదు, ఉండదు. లోకజ్ఞానం లేని వాడని చెప్పడానికి ఫలానా వ్యక్తి ఎదురిచ్చి చదరంగమాడే రకమని ఆక్షేపణగా ప్రస్తావిస్తుంటారు.
అట్టం
అట్టం, అట్ఠం, అట్టకం, అష్టకం అనే రూపాంతరాలున్నాయి ఈ మాటకు. అష్టకమనేది మూల శబ్దం. అది వేద భాగం, వేదాల్లో రువ్వులు, రుక్కులు, అష్టకాలు వగైరా విభాగాలున్నాయి. వేదం తరువాత ప్రశస్తమైనదని ఈ మాటకు అర్థం కాదు. వేదాల్లో ఎనిమిది అష్టకాలు ఉన్నాయి. కాబట్టి ఇది తొమ్మిదో అష్టకమని కూడా కొందరు వ్యవహరిస్తుంటారు. అయితే దీనికి మంచి అర్థం లేదు. ‘బూతు’, ‘తిట్టు’ అనే అర్థం కూడా ఈ మాటకు ఆపాదించారు. ఎందువల్లనో కానీ పచ్చి బూతులు మాట్లాడుతుంటే ‘ఏమయ్యా! సంస్క•తం మాట్లాడుతున్నావు’ అనే వాళ్లున్నారు. ఆక్షేపణగా మనకు రానిది, మనకు కానిది బూతు కిందే లెక్క. ఆ భావంతో ఎనిమిదో/తొమ్మిదో అట్టానికి బూతు అనే అర్థం చెప్పారు. తిట్టిన తిట్టే మళ్లీ మళ్లీ తిడుతుంటే ‘ఎనిమిదో అట్టం పారాయణం చేస్తున్నాడ’ని అనడం కూడా కద్దు.
ఎమ్డెన్‍
ఇది తెలుగులో స్థిరపడిన జర్మన్‍ పదం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో దూర దూరాల్లో ఉన్న మిత్రమండలి యుద్ధనౌకలు అకస్మాత్తుగా మునిగిపోయేవి. శత్రువు మాత్రం కనిపించే వాడు కాదు. తరువాత తెలిసింది అది ఎమ్డెన్‍ అనే పేరుగల జలాంతర్గామి నిర్వాకమని. సప్త సముద్రాల్లోనూ విహరించిన ఈ జలాంతర్గామి మద్రాసు నగరం మీద కూడా బాంబులు విసిరింది. ఒక మందుగుండు అక్కడి హైకోర్టు భవనం గోడలో ఒకచోట రంధ్రం చేసింది. అప్పటికి ఈ రకం జలాంతర్గాముల గురించి వినటమే కాని అవి యుద్ధనౌకలని చాలామందికి తెలియదు. అది నౌకలను ముంచివేసి అంతర్థానమయ్యేది. మళ్లీ కొన్ని వందల మైళ్ల దూరాన మరోచోట కనిపించేది. వాస్తవ పరిస్థితి తెలియని జనం దాని ధాటిని తలుచుకుని విస్తుపోయే వారు. దాని చురుకుదనానికి ఆశ్చర్యపోయే వారు. చివరికి ఆ జలాంతర్గామి నిర్వాకాల గురించి విని.. వినీ దాన్ని వాడుకలోకి తెచ్చేశారు. గబగబా ఎవరైనా మాట్లాడితే, ‘ఆహా! ఎమ్డెన్‍లాగా మాట్లాడాడండీ’ అని మెచ్చుకునే స్థాయికి వచ్చారు. జలాంతర్గామి మాట్లాడదని తెలియక కాదు.. అది నీళ్ల మీద తేలుతూ అందులో మునగడం, ఇతర నౌకలను ముంచేయడం వంటి పనులు జనానికి విచిత్రంగా, విడ్డూరంగా అనిపించేవి. అందుకే ఎవరైనా సాహస ప్రదర్శన చేసినా, సగటు మనిషి చేయలేని పనిని ఎవరైనా చేసినా ‘ఎమ్డెన్‍’గా చేశాడని అనడం మొదలైంది. ఎమ్డెన్‍ మొదట విశేష్యంగా ఉంది. తరువాత విశేషణంగా మారింది. ఈ తరం జనం ఈ మాట విని ఉండకపోవచ్చు. ఎమ్డెన్‍ అంటే అద్భుతం, ఆశ్చర్యకరం, మహత్తరం వగైరా అర్థ విశేషాలు వచ్చాయి. అసలు జర్మన్‍ భాషలో ఆ మాటకు అర్థమేమిటో మాత్రం ఎవరికీ తెలియదు.

ఎలుగు తంటసం
ఈ మాటను కొందరు ఎలుగ్గొడ్డు తంటసమని కూడా అంటారు. వృథా ప్రయాసను ఈ జాతీయంతో పోలుస్తారు. కోడిగుడ్డుకు వెంట్రుకలు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు కోడిగుడ్డుపై వెంట్రుకలు వెతికే తరహా రకం మనుషులు ఉంటారు. వాటిని పీకాలని ప్రయత్నం చేసే వాళ్లున్నట్టే, ఒంటి నిండా వెంట్రుకలున్న ఎలుగుబంటి శరీరం మీది నుంచి ఒక్కొక్క వెంట్రుకను పీకాలని ప్రయత్నించే
వాళ్లుంటారు. ఎన్ని పీకినా కొన్ని మిగిలిపోతుంటాయి. ఒక వరస పీకడం పూర్తయ్యే లోగా కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. వాటిని పీకక తప్పదు. కుక్కతోక వంకర తీసినట్టు ఈ ప్రయత్నం ఒక పట్టాన నెరవేరేది కాదు. నెరవేరిందని అనుకునేలోగానే మళ్లీ మొదలయ్యేది కూడా. ఇలాంటి పనిని వృథా ప్రయాస అంటారు. కోడిగుడ్డు విషయంలో లేనిచోట వస్తువును సృష్టించాలని అనవసరంగా ప్రయాస పడితే, ఎలుగుబంటి విషయంలో ఉన్న వస్తువులను తొలగించడానికి నిష్ఫల ప్రయాస పడతారన్న మాట. మూలంలో మార్పే గాని ప్రయత్నంలో లేదు, ఫలితంలోనూ లేదు. తేలే పని, తెమిలే పని కాని దాన్ని సాధించాలని శ్రమిస్తుంటే అలాంటి కష్టాన్ని లేదా ప్రయత్నాన్ని అంతా ఎలుగు తంటసమని పోలుస్తారు.
ఎల్లమ్మ
నాంచారమ్మ ఎలాంటిదైనా సౌమ్యురాలు. జగడాలమారి కాదు. దానధర్మాలు చేయాలని అనుకోదేమో కానీ ఇతరుల సొమ్ము మీద ఆమెకు ఆసక్తి లేదు. ఆమెకు అనేక విధాల విరుద్ధమైన ప్రవృత్తి గల మరో మహా తల్లి ఎల్లమ్మ. ఎల్ల అంటే పొలిమేర, హద్దు అని అర్థం. గ్రామ సరిహద్దులో మరం పెట్టి ఊరిని కాపాడే దేవత కూడా కావచ్చు ఆమె. ఆమె శక్తి సామర్థ్యాల గురించి స్పష్టంగా వివరించాలంటే ఆమె పూర్తి విలాసం అని చెప్పాలి. అది- ‘ఏనుగు మింగిన ఎల్లమ్మ’.
ఎవరయినా, పరద్రవ్యాన్నయినా సరే- తమకు అందుబాటులో ఉందంటే కబళించడం సహజం. ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులూ తనవే కావాలనీ, తన అనుభవంలోనే ఉండాలనీ అనుకుంటారు. అలాంటి లక్షణాన్ని ‘ఆబ’ అంటారు. అన్నదమ్ములు పంచుకున్న కొత్తల్లో ఆ వీధిని పెద్దపులి పోయినా తలా తోకా చెరోవైపూ పట్టుకుని చంపి పంచుకుంటారని అంటారు. అంత తీవ్రమైన ఆబ కలిగిన వ్యక్తి ఎల్లమ్మ. ఆమె ఏనుగులనైనా మింగుతుంది కానీ ఏమీ ఎరగనట్టు ఉంటుంది. ఎవరైనా క్రూరంగా ప్రవర్తిస్తూ పైకి నిశ్చలంగా కనిపిస్తే వారిని ఏనుగు మింగిన ఎల్లమ్మతో పోలుస్తారు.

Review ఎదురిచ్చి చదరంగమాడే రకం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top