అమెరికన్లు విజ్ఞతతో ఎన్నుకున్నారు
డెలావర్‍లోని విల్మింగ్టన్‍లో తమ పార్టీ అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికైన సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఇందులో బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత మూలాలున్న కమలా హారిస్ ప్రసంగించారు. తన మాటలతో పార్టీ మద్దతుదారులను ఆమె ఉత్సాహపరిచారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
‘‘ఈ ఎన్నికల్లో నా గెలుపు మహిళా లోకం సాధించిన విజయం. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను కావచ్చు. కానీ, చివరి మహిళను మాత్రం కాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి చిన్నారి ఈ దేశాన్ని ఇప్పుడు ఓ అవకాశాల కేంద్రంగా భావిస్తోంది. అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారు. మా అమ్మ శ్యామలా గోపాలన్ అమెరికాకు వచ్చి కన్న కలలు ఇంకా నాకు గుర్తున్నాయి. మెరుగైన భవిష్యత్తును నిర్మించే శక్తి ప్రజల్లో ఉంది. అమెరికా చరిత్రలో కొత్త రోజులు ఉండబోతున్నాయంటూ ప్రజలు నిర్ణయించారు. అందుకు బైడెన్, నా గెలుపులే నిదర్శనం. గత నాలుగు సంవత్సరాలుగా సమానత్వం, న్యాయం కోసం పోరాడారు. దాని ఆధారంగానే ఐక్యత, ఆశావాదం, విజ్ఞానం, సత్యాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. తమ విజ్ఞతను ఉపయోగించి ఆశావాదం, ఐక్యత, శాస్త్ర విజ్ఞానాన్ని ఎనుకున్నారు’’
ఇప్పుడే అసలు కార్యం మొదలైంది. మహమ్మారిని పారదోలాలి. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలి. జాతి వివక్షతను పెకలించాలి. వాతావరణ మార్పులను నియంత్రించాలి. అమెరికా ఆత్మను స్వస్థపరచాలి. ముందున్న మార్గం అంత సులువైనదేమీ కాదు. కానీ, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఆ దిశగా నడిపించేందుకు బైడెన్, నేనూ సన్నద్ధంగా ఉన్నాం.
– కమలా హారిస్,
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమొక్రాటిక్ అభ్యరి
Review ఐక్యత, ఆశావాదం, సత్యం.