త్వం త్రాతా తరణ: (నీవే రక్షకుడవు. దాటించు వాడవు)

త్వం త్రాతా తరణో చేత్యో భూ:
పితా మాతా సదమిన్మానుషాణామ్‍।।
రుగ్వేదంలోని ఈ శ్లోకానికి- ‘ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవు. దాటించువాడవు. జ్ఞేయమవు, ఉనికివి. ఎల్లవేళలా ఈ మనుష్యులకు తండ్రివి. తల్లివి’ అని అర్థం.

పరమేశ్వరుడికి మనకీ మధ్య ఉన్న బంధాన్ని ఈ మంత్రం ద్వారా వేదమాత తెలియచేస్తోంది. ఈ పరమేశ్వర తత్త్వాన్ని ఎవరు ఏ సంప్రదాయంలో కొలిచినా ఈ భావనను మనసులో ప్రతిష్ఠించుకుంటే చాలు. ఈ మంత్రంలోని పదాలకు భావాలను తెలుసుకుందాం.
త్రాతా:
రక్షకుడు. ఆర్తత్రాణ పరాయణుడు’ వంటి భక్తి భావనలకు ఆధారమైన వైదిక మంత్ర ప్రతిపాదనలలో ఇది ఒకటి. జీవులకు ఆర్తిలో స్ఫురించవలసిన మహిమాన్విత తత్త్వం భగవానుడే.
తరణ:
దాటించువాడు. దీనికి భౌతిక స్థాయిలో కష్టాల నుంచి గట్టెక్కించుట అని అర్థం. కానీ అసలైన పారమార్థిక ప్రయోజనం ‘అవిద్యారూప సంసార సముద్రం నుంచి దాటించువాడు’ అనే అర్థాన్ని స్వీకరించాలి. ‘మోక్షయిష్యామి మా శుచ:’ వంటి గీతా వాక్యాలు ఇక్కడ స్ఫురణకు వస్తాయి.
చేత్య:
తెలుసుకోవలసిన వాడు. విచారణ ద్వారా, ఉపాసన ద్వారా తెలియబడే వాడు. ఈయనను తెలుసుకొనుటే జీవితానికి పరమార్థం. భగవదనుభవమే ‘తెలుసుకొనుట’. భక్తి దృష్టిలో ‘ఈశ్వర సాక్షాత్కారం’, వేదాంత పరిభాషలో ‘బ్రహ్మజ్ఞానం’. ఈశ్వర స్ప•హ, అనుభవం ప్రధానమని తాత్పర్యం. ‘మధువైరి దవిలిన మనము మనము పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి’ అనే భాగవత ధర్మం ఇందులో ధ్వనిస్తోంది.
భూ:
సదా ఉండువాడు. అందరికీ ఆధారమై, అన్నిటినీ కలిగించు అధిష్ఠాన రూప పరమాత్ముడితడు. ‘సత్‍’ అనే మాటకు ఇదే అర్థం.
పితా, మాతా:
తల్లి, తండ్రి. ఈ శబ్దాలు కారణత్వాన్ని సూచిస్తున్నాయి. సర్వకారణుడైన సర్వేశ్వరుడు తల్లిదండ్రుల వలే కారణమై, పోషకమై, రక్షకమై ఉన్నవాడు.

ఈ రెండు మాటలతో పరమాత్మకు మనం ఎంతటి దగ్గరి వారమో, ఆయనకు మనకు ఉండాల్సిన చనువు ఎంతటిదో అర్థమవుతుంది.

‘మానుషాణామ్‍’ అనే మాటకు ‘ఆలోచన (జ్ఞానం) కలిగిన వారికి’ అనే అర్థాన్ని స్వీకరించవచ్చు (మన అవబోధనే- అనే ధాతు అర్థాన్ని అనుసరించి). భారతీయ సంస్క•తిలోని భక్తి భావనకు వైదికమైన ఇటువంటి మంత్రాలే ఆలంబన.
‘నీవే తల్లివి, తండ్రివి’, ‘త్వమేవ మాతా చ – పితా త్వమేవ’ వంటి భాగవతుల వచనాలకు ఆలంబనమైన వైదిక సంప్రదాయమిది.

పైన వివరించిన ఆరు బంధాలను భావన చేస్తుంటే క్రమంగా ‘ఆ పరమాత్మయే సమస్తము’ అనే సిద్ధి లభిస్తుంది.

మనకు శాశ్వత బంధం భగవంతునితోనే ఉంది. మిగిలినవన్నీ కర్మబంధాలు, పరిమితాలు మాత్రమే.

ఈ నిత్యబంధువుని విస్మరించని వాడే ధన్యుడు.

Review త్వం త్రాతా తరణ: (నీవే రక్షకుడవు. దాటించు వాడవు).

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top