మావన కృషి -మాధవ కృప

మానవకృషి, మాధవ కృప యొక్క పర స్పర కలచాలనం నుండి ఈ జీవనకమలం వికసించింది. అందుకని, మనం చేయ గలిగిన కృషి చేస్తూ, చేయలేని పనులను భగవంతుని కృపకు ఆనందంగా విడిచి పెట్టాలి.
ప్రపంచంలో ఒక సాపేక్ష సిద్ధాంతం అమలులో ఉంది. సరదాగా దాన్ని ‘రంధ్ర సిద్ధాంతం’ అని పిలుచుకుందాం ఒక పంపు కింద ఖాళీ పాత్రను ఉంచి నీటిని వదలండి. కనిపించే ధారతోపాటు, ఆ పాత్రకు కనిపించని రంధ్రం ఉందను కుందాం. అప్పుడు ఎంత నీరు పాత్రలో చేరినా అది నిండదు. ఒక వ్యక్తికి అమె రికాలో ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. పదోన్నతి కలిగింది. ప్రభుత్వం సత్కరించింది. సంతోషం ధారగా ప్రవ హిస్తున్నా విచారం ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి పాత్రకు ఒక్కో చోట రంధ్రం ఉంటుంది. అలాగే, ఒక్కోక్కరి జీవితంలో సమస్య ఒక్కో రూపంలో దర్శనమిచ్చి, సంపా దించిన ఆనందాన్ని దుఃఖంగా మారుస్తుంది.

అందని జాబిలి కోసం అర్రులు చాచకు
అందిన వెన్నెలతో విందులు చేసుకో
ఎవరి జీవనపాత్రను చూసినా, సుఖ దుఃఖాలు ఒకే స్థాయిలో ఉంటాయి. పొరుగు వారి పంపు వెడల్పు, నా కుళాయి సన్నం అని సణగకండి. చిన్న కుళాయి క్రింద ఉన్న పాత్రలో చిన్న రంధ్రమేర్పడుతుంది. పెద్ద కుళాయికి పెద్ద రంధ్రముంటుంది. ఆ రెండూ పూర్తిగా నీటితో నిండవు.
జీవిత పర్యంతం నీ భౌతికమైన అవస రాలు, మానసికావసరాలు ప్రకృతికి తెలుసు. వాటన్నిటినీ తీరుస్తుంది. నీ విషయమే కాదు, సృష్టిలో అన్ని జీవుల పట్ల అంతే శ్రద్ధ తీసుకుంటుంది. ప్రకృతి క్రియాశీలక పాత్ర గురించి ఎప్పుడూ అనుమానం వ్యక్తం చేయకు. నీకు చేతనైనంత, నువ్వు చెయ్య గలిగినంత చెయ్యి. మిగిలింది ప్రకృతికి విడిచి పెట్టు. కానీ, చాలామంది అంతా తమ చేతు ల్లోకి తీసుకుంటారు. నదిలో మునుగుతున్న వ్యక్తి ఈదగలిగినంత ఈదుతాడు. ఒడ్డునున్న వాళ్ళ సహాయం కోసం అరుస్తాడు. అందుకు వీలుగా చేతులు పైకి చాచి ఉంచుతాడు. అంతేకానీ, చేతులు ముడుచుకొని కూర్చోడు. మనం చేయగలిగినది చేసి, మిగిలిన వంతు చెయ్యడానికి ప్రకృతికి అవకాశం ఇవ్వాలి.
ఏదైనా అనుకోని దుస్సంఘటన జరిగితే వెంటనే కంగారు, ఆందోళన మొదలవుతాయి. అంతే ! సాయం చేసేందుకు ప్రకృతికి దారులు మూసుకుపోతాయి. నీటిలో మునిగే మనిషి చేతులు ముడుచుకోవడం అంటే ఇదే! కలవరం చెందడంతో కలత కన్నీరుగా మారుతుంది. చేయూతనిచ్చే ప్రకృతిని అడ్డుకుంటుంది. పరీక్షా సమయంలో ఒత్తిడికి గురైతే చదివినదంతా మర్చిపోతాం. ఒక్కటీ గుర్తుకు రాదు. ఆందోళన వీడితే తప్ప ప్రకృతి సాయం చెయ్యలేదు.
ఒక పిల్లవాడి దగ్గర కొంత చిల్లరసొమ్ము మాత్రమే ఉంటుంది. దానితో ఏవో రెండు నోట్‍ పుస్తకాలు, పెన్నూ, చాక్లెట్లు కొనుక్కోగలడు. స్కూల్‍ ఫీజు కట్టలేడు. ఆ విషయంలో అతనికి బెంగ లేనే లేదు. అది తల్లిదండ్రుల బాధ్యత. డబ్బెలా సమకూరుతుందో ఆ అబ్బాయికి సంబంధం లేదు. అతనికి తెలియనే తెలియ కుండా జీతం కట్టబడుతుంది. అతని ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుంది. ఇది అద్భుతం కాదా? ఎప్పుడో ఒకసారి జరిగేది కాదు, అద్భుతం నిత్య జీవితంలో ఒక భాగం, మనం చేయలేని పనులన్నీ, ప్రకృతి మనకు చేసి పెడుతుంది. దైవం తలచుకుంటే ము•ళ్ళ బాటలు పూలతోటలుగా మారుతాయి. కష్టాల కడలి యమునలా చీలి దారితీస్తుంది.
మనం ఊపిరి పోసుకున్నప్పటి నుండీ ఆఖరిశ్వాసవరకూ జీవితంలో ప్రతిక్షణమూ అద్భుతమే! మహిమాన్వితం కాని క్షణమంటూ కాని క్షణమంటూ లేదు. క్షణ క్షణం ఆనందాన్ని స్వచ్ఛంగా, ప్రత్యక్షంగా అనుభవించడమే అసలు సిసలు అద్భుతం. ఈ మహిమ చేసి చూపండి, చాలు ! ఇంకేమీ అక్కర్లేదు.
సంతోషం పొందే శక్తి మన దగ్గర పుష్కలంగా ఉంది. అవసరమైన శక్తి కంటే ఎక్కువే మనకు ఇవ్వబడింది. నీ సమర్థత నీకు సరిగ్గా తెలిస్తే, ఇంతకు పదిరెట్లు సుఖంగా ఉంటావు. ప్రస్తుతం నీకున్న వనరులకు ఇంకొకటి అదనంగా సమకూరితే, మహాసముద్రానికి ఒక గ్లాసు నీరు కలిపినట్లవుతుంది. ఇప్పటికే మనకున్న భోగభాగ్యాలు, సుఖసంతోషాలు మనకు చాలు.
ఉన్న శక్తి యుక్తులు సక్రమంగా ఉప యోగించుకుంటే చాలదా? ఒక వ్యక్తిలో అపూర్వమైన కవితాపటిమ దాగి ఉంటుంది. అతడు కలం పట్టుకుంటే సుమధుర కవితా ఝరులు గోదావరులై ప్రవహిస్తాయి. అతడా శక్తిని వాడుకోవాలి. అవధానికి అర్థం లేని నాలుగు పిచ్చిమాటలు ఇచ్చి చూడండి. ఆయన రామాయణ, భారతాలతో అన్వయించి రసవత్తర మైన, రమణీయమైన పద్యాలు ఆశువుగా విని పిస్తాడు. అదీ ఆయన చాతుర్యం! ఇక మన విషయం చూడండి. చుట్టూ నిఘం టువులూ, కావ్యాలూ, శాస్త్రాలూ పేర్చుకుని కూర్చుంటాం. ఒక్క మాట బయటకు పెగలదు. ఒక్క అక్షరం నోటి నుండి రాదు. ఇదీ, మన పాండిత్యం! ఏం చేస్తాం చెప్పండి! భగవంతుడు మన జీవన ప్రాంగణంలోకి ఏది విసిరినా దాన్ని ఆనందంగా మార్చుకునే ప్రజ్ఞను అలవరచుకోవాలి.
నిన్ను తీసుకుపోయి సుందర కాశ్మీరంలో విడిచిపెట్టినా, లేక రెండు మొక్కలున్న పూరి గుడిసె ముందు వదలి పెట్టినా ఆనంద మక రందం ఆస్వా దించగలగాలి. ఆకలితో విస్తరి ముందు కూర్చు న్నావు. పాచిపోయిన అన్నం పెడితే పాయసంలా స్వీకరించు. పంచభక్ష్యాలు వడ్డిస్తే పరమా నందంగా భుజించు. పస్తుంచితే లంఖణం పరమౌషధమని భావించు. ఇదే జీవనకళ.
సహజంగా జీవించు. ఇహం కోసం కానీ, పరం కోసం కానీ ప్రయత్నించకు. సామాన్యంగా ఉండు. సహజజీవనవిధానం ఐహికంలోని మంచి-చెడులను, పారమార్థికంలోని గుణ -దోషాలను రంగరించి సమన్వయపరుస్తుంది.
ఈ జీవితం ఒక అయాచితవరం. మనం కష్టించి సంపాదించినది కాదు. అవసరమైన దంతా మనకు లభించింది. ఇంతకుమించి ఏ కొంచెం అడిగినా పద్ధతిగా ఉండదు. ఎవరైనా బహుమతి ఇస్తే, ఇందెందుకిచ్చారు, మరొకటిస్తే బాగుంటుంది కదా అని అడుగుతామా ? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది! అలా అడిగే హక్కు మనకు లేదు. ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే, నేనేం పాపం చేసాను అని బాధపడతాం. ఈ రోజు ఇంత ఆరోగ్యంతో ఉండటానికి ఏ మాత్రం పుణ్యకార్యాలు చేశాం? ఇప్పటి ఈ సుఖ సంపదలు పొందడానికి ఎటువంటి అర్హత లున్నాయి మనకు? ఈ నాటి ఈ స్థితికి దైవానికి ధన్యవాదాలు తెల పండి. ఆయనకు ఋణపడి
ఉండండి.
ప్రకృతి పథకరచనలో, వినోదంతోపాటు విషాదం కూడా ఉంటుంది. చిగురింపచేయడమే కాదు. చిదిమివేయడం కూడా సృష్టిధర్మమే. లోపలికీ, బయటకూ రెండు దారులుంటాయి. జీవితం నుండి నిష్క్రమించాలంటే కొంత దుఃఖం కూడా అనుభవించాలి. ఏడుస్తూ కాలాన్ని ఈడుస్తుంటాం. అయినా జీవితాన్ని పట్టుకొని వేళ్లాడుతూనే ఉంటాం. నవ్వుల నావలా బతుకు సాగిపోతున్నపుడు విడిచి వెళ్ళడానికి అసలే ఇష్టపడం. వినాశనానికి ఉపకరణంగా విషాదం సృష్టించబడుతుంది. ఉన్న దానిని వదిలేస్తాం. లేనిదానికై వెంటపడతాం.
కన్నీరు, ఆనందబాష్పం భగవంతుని కవల పిల్లలు. కనుక, రెంటినీ ప్రేమిస్తూ, కృషి – కృపలను ఊతకర్రలుగా వాడుకుంటూ ఈ జీవితం వాడిపోయేదాకా వీడని ఆనందాన్ని అనుభవించాలి.

Review మావన కృషి -మాధవ కృప.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top