ఓ శిష్యుడు కొత్తగ ఆశ్రమంలో చేరాడు. ఒకరోజు అతడు అడవికి వెళ్లి చీకటి పడినా తిరిగి రాలేదు. దీంతో శిష్యుడిని వెతుక్కుంటూ గురువు అడవికి వెళ్లాడు. ఓ ఏటి ఒడ్డున శిష్యుడు ఎంతో విచారంగా ఏడుస్తూ కనిపించాడు.
గురువు అతని వద్దకు వెళ్లి, ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు.
‘నేను ఒంటరివాడిని. నాకెవరూ లేరు. అమ్మానాన్నల్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంతో మీ దగ్గరికి వచ్చాను. మీ మిగతా శిష్యులు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయారు’ అని చెప్పాడా శిష్యుడు.
గురువు అతని వెన్నుతట్టి పక్కన కూర్చున్నాడు.
శిష్యుడు కాస్త స్థిమితపడ్డాక, ‘ఈ వాగు తిన్నగా వెళ్లక ఎందుకు ఇన్ని వంకరలు తిరిగింది?’ అని ప్రశ్నించాడు గురువు.
‘రాళ్లూ రప్పలూ అడ్డొచ్చాయి కాబట్టి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది’ అని బదులిచ్చాడు శిష్యుడు.
‘కదా..! మనిషి కూడా అంతే. ఒక తల్లి కడుపున పదిమంది పుట్టినా పెరిగి పెద్దయ్యాక ఎవరి బతుకు వారిదే. ఎవరి చావు వారిదే. ఎవరి కోసమూ ఎవరూ ఆగరు. కొత్తవాడివైన నువ్వు జట్టును వదిలి దూరంగా వెళ్లడం పొరపాటు. అమ్మానాన్నలు లేరని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చావు. రేపు నేను లేకపోయినా మరోచోట నువ్వు బతకగలగాలంటే ఆ ఏటిలోని నీళ్లలాగా అడ్డువచ్చిన అవరోధాలను తప్పించుకుంటూ ముందుకు సాగడం నేర్చుకోవాలి’ అని చెప్పడం ముగించాడు గురువు.
జగమంతా మన కుటుంబంలానే అనిపిస్తుంది. కానీ, మనవి ఏకాకి జీవితాలు. ఏదో దశలో, ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరికీ ఒంటరితనం అనుభవంలోకి వస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా ఏకాకి జీవితాలు, ఒంటరితనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఇదో పెద్ద ఆరోగ్య సమస్యగానూ పరిణమించడం నేటి అతిపెద్ద విషాదం.
‘నాకెవరున్నారు?’..
ఈ మాట జీవితంలో ఏదో సందర్భంలో, ఏదో దశలో ప్రతి మనిషికి ఎదురయ్యే ప్రశ్న ఇది. ఏదో ఒకప్పుడు ఎవరో ఒకరి నోటి వెంట ఈ మాట వినే ఉంటాం. కానీ, కాస్త తాత్వికంగా ఆలోచిస్తే ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అని ఓ సినీ కవి ఏనాడో రాశాడు. రెక్కలొచ్చిన పిల్లలు తమ జీవిత గమ్యాలను వెతుక్కుంటూ వెళ్లిపోవడం ఎంత సహజమో రెక్కలు అలసిన పెద్దలు ఒంటరిగా, విశ్రాంత జీవితం గడపాల్సి రావడమూ అంతే సహజం. విధి వక్రించి భాగస్వామి దూరమైతే ఆ కుటుంబంలోని మిగిలిన వారంతా ఒంటరితనంతో సహవాసం చేయకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో పై ప్రశ్న చాలామందిని చాలా సందర్భాల్లో వేధిస్తుంది. అలాంటి వారు తమ చుట్టూ ఉన్న వారి జీవితాలను పరిశీలిస్తే ఆ ప్రశ్నకు తేలిగ్గానే సమాధానం దొరుకుతుంది. తోబుట్టువులూ, కన్నబిడ్డలూ ఎంతమంది ఉన్నా వారందరికీ సొంత కుటుంబాలు ఉంటాయి. ఆ బాధ్యతలను వదిలేసి వచ్చేయడం ఎవరికీ సాధ్యం కాదు. రమ్మనడం సబబూ కాదు. మరి అటువంటప్పుడు ఆ ప్రశ్నకు •వాబేమిటి? మనకెదురయ్యే ప్రతీ అనుభవం పరిస్థితుల ప్రభావమే తప్ప మరొకటి కాదు. ఈ వాస్తవంతో సర్దుకుపోగలిగితే ఇక్కడ ఎవరూ ఒంటరి కాదు. ఎవరూ ఏకాకి కాదు.
సామాజిక మాధ్యమాల ప్రభావంతో..
ఇదివరకు ఆప్తుల్ని కోల్పోతే ఒంటరితనం, దిగులు కలిగేవి. ఇప్పుడు మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు కరువై ఒంటరితనం పెరుగుతోంది. ఇదే ఇప్పుడు అతిపెద్ద ఆరోగ్య సమస్య అని మానసిక నిపుణులు అంటున్నారు. నేడు విచ్చలవిడిగా పెరిగిపోయిన సామాజిక మాధ్యమాల ప్రభావం మనుషుల్లో ఒంటరితనానికి దారితీస్తోంది. సామాజిక మాధ్యమాల వాడకం పెరిగే కొద్దీ ఒంటరితనం పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే సోషల్ మీడియా వాడకం బ్రిటన్‍లోనే ఎక్కువట. అందుకే ఆ దేశంలో ఆ మాధ్యమాల బారినపడి ఒంటరితనం, కుంగుబాటులో కూరుకుపోతున్న వారి సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. ఈ కారణంగానే ప్రపంచంలోనే ‘ఒంటరితనపు రాజధాని’గా బ్రిటన్ పేరు తెచ్చుకుంది. నిజానికి ఒంటరితనానికి సామాజిక మాధ్యమాలకు సంబంధమేంటనే ప్రశ్న కలగొచ్చు. ఈ రెండింటికీ సంబంధం ఉంది. మనుషులు ఇప్పుడు ఏకాస్త తీరిక దొరికినా ఫోనులో సామాజిక మాధ్యమాలను చేస్తూ గడిపేస్తున్నారు. దీంతో సాటి మనుషులతో ప్రత్యక్ష సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇటీవల ప్రపంచ మీడియా సంస్థ బీబీసీ లండన్‍లో ఓ పోల్ నిర్వహించింది. అందులో పాల్గొన్న వారిలో 33 శాతం మంది తమ పొరుగున ఎవరు ఉంటున్నారో తమకు తెలియదని చెప్పారట. ఒంటరితనం అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. సాంకేతికంగా కమ్యూనికేషన్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో మనసు విప్పి మాట్లాడుకునే తోడు లేక ఒంటరితనంతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి సంబంధించి ఓ వాస్తవమైన ఉదాహరణ కూడా ఉంది.
ఇది కథ కాదు..
తండ్రీకొడుకులు బైక్‍పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరికీ బాగా గాయాలయ్యాయి. తండ్రి ఇంకాస్త ఎక్కువ గాయపడ్డాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. ప్రమాదం సంగతి తెలిసి తండ్రి స్నేహితులూ, సహోద్యోగులూ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ఎవరో ఒకరు తండ్రిని చూడ్డానికి వస్తూనే ఉన్నారు. పండ్లు ఇతరత్రా అందచేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించేవారు. కాసేపు కూర్చుని మంచిచెడ్డలు మాట్లాడే వారు. దీంతో పెద్ద గాయలైనా.. ఆయన తన ఆత్మీయుల సమక్షంలో ఎక్కువ సేపు గడపడంతో ఆ బాధనంతా మరిచిపోయాడు. త్వరగా కోలుకున్నాడు. ఇక, కాలేజీలో చదువుతున్న కొడుక్కి వందల్లో స్నేహితులున్నారు. కానీ, పరామర్శించడానికి ఒక్కరూ రాలేదు. అందరూ అతని సోషల్‍మీడియా ఖాతాల్లో ‘సారీ.. గెట్ వెల్ సూన్ బ్రో..’ అంటూ మెస్సేజ్‍లు పెట్టి ఊరుకున్నారు. ఈ ప్రమాదం జరగడానికి వారం ముందే ఈ తండ్రీ కొడుకులకు ఫోన్ విషయమై వాగ్వాదం జరిగింది. ఫోన్ వాడకం తగ్గించమన్న తండ్రితో, ‘సోషల్‍మీడియాలో నాకెంత మంది స్నేహితులున్నారో తెలుసా?. వాళ్లందరితో టచ్‍లో ఉండటం వల్ల నాకెంత ఉపయోగకరమో తెలుసా?’ అంటూ తండ్రితో వాదించాడు కొడుకు. నాటి సంఘటన కొడుక్కి ఇప్పుడు గుర్తొచ్చింది. వర్చువల్ స్నేహాలకు, అసలైన స్నేహాలకు మధ్య తేడా తెలిసొచ్చింది. తనకు చిన్న గాయాలే అయినా.. పలకరించే ఒక్క స్నేహితుడూ ప్రత్యక్షంగా రాకపోయేసరికి ఆ కొడుకు మరింత కుంగిపోయాడు బాధతో.
ఇప్పుడున్న సంబంధాలన్నీ ఇలాంటివే.
ఏకాంతం వేరు.. ఒంటరితనం వేరు..
నిజానికి కాస్త అప్రమత్తంగా ఉంటే ఒంటరితనాన్ని ఎదుర్కోవడం కష్టమేమీ కాదు. అయితే అది సమస్య స్థాయికి వెళ్లకముందే చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పది పన్నెండేళ్ల వయసు వచ్చే వరకు అమ్మానాన్నల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. టీనేజ్‍లోకి వచ్చాక ప్రైవసీ కోరుకుంటారు. ఏకాంతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఆ పిల్లలే ఇంకాస్త పెద్దవారై ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే ఒంటరితనంతో బాధపడతారు. ఏకాంతానికి, ఒంటరితనానికి తేడా తెలుసుకోవాలి. ఏకాంతం అంటే మనకు మనం.. మనతో గడపడానికి కేటాయించుకునే సమయం. ఇది ఆరోగ్యానికి, మానసిక వికాసానికి మంచిదే. ఒంటరితనం అలాంటిది కాదు. అందరూ ఉన్న ఏదో లోటు కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండింటికి తేడా గుర్తించి, పరిస్థితులకు తగ్గట్టు పరిష్కారాలు వెదుక్కోవాలి. కొత్త ప్రాంతంలో ఉండాల్సి వస్తే అక్కడి వారితో మమేకం కావడం ఒంటరివారిమనే భావనను పోగొడుతుంది. సోషల్‍మీడియా వాడకాన్ని పరిమితం చేసుకుని ప్రత్యక్ష స్నేహ సంబంధాలను కొనసాగించాలి.
ఏ వయసు వారైనా తమకు తగిన, అభిరుచి ఉన్న వ్యాపకం ఏదొకటి కల్పించుకోవాలి. ఆటలు, ఆధ్యాత్మికం, సంగీతం, సాహిత్యం.. ఏవైనా సరే రోజులో కొంత సమయంలో మనసుకు నచ్చిన వ్యాపకంలో నిమగ్నమైతే ఒంటరితనమనేది దరిదాపుల్లోకి రాదు. రకరకాల అభిరుచులకు తగినట్టు ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి. సాహసయాత్రల నుంచి తీర్థయాత్రల వరకూ నిర్వహిస్తున్నాయి. ఆటల పోటీలూ, సాహితీ సమావేశాలూ, సంగీత కచేరీలూ ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేస్తుంటాయి. అవేవీ ఇష్టం లేకపోతే ఆఖరుకు ఓ పెంపుడు జంతువును తెచ్చుకున్నా సరే. ఇలాంటి వ్యాపకాల వల్ల ఒంటరితనాన్ని అధిగమించడమే కాక, చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంటారు.
కొంతవరకూ ఏకాంతం అవసరమే..!
ఒంటరితనం ప్రమాదకరమే అయినా, ఒక మోతాదులో అదీ అవసరమేనని చెబుతున్నారు మానసిక నిపుణులు. అందుకే ఒంటరితనానికి భయపడటం మానేయాలని సూచిస్తున్నారు. ఆస్వాదించగల స్థాయిలో ఏకాంతాన్ని అనుభవించడమే మేలని అంటున్నారు. ఒంటరితనం నుంచి బయటపడటానికి ఏకాంతంగా ఎలా గడపాలంటే..
• రోజులో కాసేపు ఒంటరిగా ఉండటం రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయటపడవేస్తుంది. ఇలాంటి సమయం జీవించడానికి కావాల్సిన ఇంధనాన్ని అందిస్తుందని ‘ద కాల్ ఆఫ్ సాలిట్యూడ్’ అనే పుస్తకం రాసిన డాక్టర్ ఎస్తర్ చెబుతున్నారు.
• ఒక మోతాదు ఒంటరితనం అలసట నుంచి తేరుకునే శక్తినీ, ఏకాగ్రతతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్నీ ఇస్తుంది.
• సృజనాత్మకంగా ఆలోచించాలంటే ఏకాంతవాసం అవసరం. డార్విన్ నుంచి పికాసో వరకూ అందరూ అలా ఏకాంతం నుంచి ప్రేరణ పొందిన వారేనని ‘క్వైట్’ రచయిత్రి కెయిన్ చెబుతున్నారు.
• తరచూ కాసేపైనా ఒంటరిగా గడిపే వారే ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరట. తమ గురించి తాము తెలుసుకోవడానికి, ఇతరులతో అనుబంధాన్ని విశ్లేషించుకోవడానికి ఈ తరహా ఒంటరితనం ఉపయోగపడుతుందట.
• ఏకాంతంతో అంత:శోధన చేసుకునే వారు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకుని సహానుభూతి చూపగలుగుతారు.
• ఎవరైనా సరే, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వారైనా సరే.. రోజూ కాసేపు ఏకాంతంగా గడపాలి. ఇష్టమైన సంగీతం వింటూనో, చల్లని గాలికి సేదదీరుతూనో, ఏమీ లేకపోతే మంచి ఆలోచనల్లో లీనమయ్యి రోజులో కొంతసేపు గడిపితే మనసు తేటపడుతుంది.
• కాసేపు మీ గదిలో మీరు ఏకాంతంగా ఉండటం మీకు మీరిచ్చుకునే విలువైన కానుక’ అన్న కవి రూమీ మాటలు నిజమే. ఏకాంతం ఎన్నో విషయాలు చెబుతుంది. వాటి నుంచి నేర్చుకోదగిన పాఠాలూ ఎన్నో ఉంటాయి.
ఎన్నెన్నో సమస్యలకు మూలం..
• ఒంటరితనం మానసికంగా ఇతర సమస్యలకూ దారితీస్తుంది. కుంగుబాటుకీ దీనికీ విడదీయలేని సంబంధం ఉంది. అంతేకాదు, ఆందోళన, మతిమరుపు, మాదకద్రవ్యాల వాడకం, స్కిజోఫ్రీనియా, అల్జీమర్స్లాంటి సమస్యలకూ కారణమవుతుంది. ఇవన్నీ మనిషికి దీర్ఘకాలం వేధించే సమస్యలు.
• ఒంటరితనం ముఖ్యంగా ఆయుష్షుని తగ్గిస్తుంది. ఆప్తుల్ని కోల్పోయి ఒంటరితనంతో బాధపడే వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎంచుకోకపోతే త్వరగా మృత్యువుకు చేరువవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
• అనారోగ్యంగా ఉన్నా, చిన్నచిన్న ప్రమాదాలేమైనా జరిగినా ఎవరూ తోడుండరు. కాబట్టి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోయి కుంగుబాటుకు లోనైతే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది.
• ‘ఎవరి కోసం బతకాలి?’ అనే నిర్వేదంతో చాలామంది ఒంటరి వారు తమ గురించి తాము పట్టించుకోరు. అప్పటి వరకూ ఉన్న ఆరోగ్యకరమైన అలవాట్లనూ వదిలేస్తారు. నిద్రపట్టదు. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
• ఒత్తిడి అనేది ఏ రకంగా మనిషికి తెలియకుండానే ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందో ఒంటరితనం కూడా వారికి తెలియకుండానే వారి ఆరోగ్యం మీద పరోక్షంగా ప్రభావాన్ని చూపుతుంది.
• పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఒంటరితనాన్ని ఈ కాలపు పెద్ద రుగ్మతగా పరిగణిస్తున్నారు. అధిక జనాభాతో పాటు సామాజికంగా క్రియాశీల సంబంధాలు కలిగి ఉండే మన సమాజంలోనూ ఇలాంటి పరిస్థితులు.. ముఖ్యంగా నగరాల్లో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
• ఒంటరిగా ఉండేవారు ప్రపంచాన్ని తమకు అనువుగాని ప్రదేశంగా భావిస్తారు. దాంతో వారి రక్షణ వ్యవస్థ గాడి తప్పుతుంది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‍ఫెక్షన్లూ, కేన్సర్లూ, గుండెజబ్బులూ ఎక్కువగా వస్తాయి. స్ట్రెస్ హార్మోన్, కార్డిసోల్ స్థాయిలూ, బీపీ పెరుగుతాయి. దాహం, ఆకలి, తీవ్రమైన నొప్పి వంటివి కలిగి మనిషిని భౌతికంగా ఎలా బాధిస్తాయో ఒంటరితనమూ మనిషిని అలాగే బాధిస్తుంది. అందుకే దీనిని ప్రాణాలు హరించగల జబ్బుల జాబితాలో చేర్చారు.


































































































































































Review మీరు ఒంటరి కాదు!.