‘లలితా సహస్రం’ పుట్టిందెక్కడ?

లక్ష్మీగవ్వలంటే ఏమిటి? లక్ష్మీపూజలో వీటిని ఉపయోగించాలని చెబుతారు. దీని వెనుక ఏదైనా నేపథ్యం ఉందా?
గవ్వలు చాలా పవిత్రమైనవి. ఇవి సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానమైనవి. గవ్వలు స్థూలంగా ఒకటే ఆకృతిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న తేడాలతో అనేక రకాలుగా ఉంటాయి. ఈ గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటారు. వీటిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అసలు లక్ష్మీగవ్వలు ఎక్కడివి? ఎలా పుట్టాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
క్షీరసాగర మథనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీగవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీగవ్వలు లక్ష్మీదేవికి ప్రతిరూపం అయ్యాయి.
పూర్వం గవ్వను లక్ష్మీదేవికి చెల్లెలుగా భావించే వారు. కనుక నాణేలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్థిక లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించే వారు. అంటే ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉండేవన్న మాట. ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే ఆనాడు ధనవంతులు. గవ్వలకు నాడు చాలా ప్రాధాన్యం ఉండేది. గవ్వలు లేనివాళ్లు నిరుపేదల కింద లెక్క. ఇప్పటికీ బొత్తిగా డబ్బు లేదని చెప్పడానికి చిల్లిగవ్వ కూడా లేదని అనడం వింటుంటాం. గవ్వలను పూర్వం కానుకలుగా వినియోగించారంటే, అందుకు కారణం లేకపోలేదు. లక్ష్మీగవ్వలు సామాన్యమైనవి కావు. అవి ఇంట్లో ఉంటే సంపదలు కలుగుతాయి. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. అంటే గవ్వలకు లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీగవ్వలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇదీ లక్ష్మీగవ్వల విశిష్టత. అందుకే పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీగవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్థించడం ఆనవాయితీ.

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టాలనే నియమం వెనుక ఒక కథ ఉందని తెలిసింది. వివరంగా తెలుపగలరు?
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గణపతివర్మ పరిపాలిస్తుండే వాడు. శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుండే వారు. అలా ఉన్నా కూడా రాజా గణపతివర్మ తన మంత్రి శూరసేనుడితో కలిసి మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే వాడు. ఆ రాజ్యంలో అందరూ ధనికులే అయినా శాంతశీల అనే పేదరాలు ఉండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహా బలశాలి. ఓసారి రాజు, మంత్రి మారువేషంలో తిరుగుతుండగా బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేసింది. అటుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి బందిపోట్లను తరిమికొట్టి రాజును, మంత్రిని రక్షిస్తాడు.
రుద్రసేనుడి తెగువను మెచ్చుకున్న రాజు, ‘ఏం కావాలో కోరుకో’ అంటాడు. ‘తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు’ అంటాడు రుద్రసేనుడు. అందుకు రాజు సంతోషించి, ‘నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా రా’ అని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా రుద్రసేనుడు భార్య శాంతశీలకు చెబుతాడు. అప్పుడామెకు ఒక విషయం గుర్తుకువస్తుంది. అదేమిటంటే, కొద్దిరోజుల క్రితం తను కట్టెల కోసం అడవికి వెళ్లినపుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆయనతో తన పేదరికం గురించి చెప్పినపుడు ఆయన ‘తల్లీ! ఒక విషయం చెబుతాను. శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి, నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామె నీ ఇంట్లోంచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వామెను అడ్డగించి ‘బయటకు వెళ్తే లోనికి తిరిగి రాకూడద’ని షరతు పెట్టు. అప్పుడామె ‘నేను లోపలుండే వెలుగు భరించలేను. చీకట్లోకి వెళ్లిపోతా’నంటుంది. ఇంకో ఆమె పట్టుపీతాంబరాలతో ధగధగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి యత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి ‘లోపలికి వెళ్తే బయటకు వెళ్లరాద’ని షరతు పెట్టు. అప్పుడామె ‘బయట చీకటిని భరించలేను. లోపలికి వెళ్తా’నంటుంది. ఆమె ఇంట్లోకి రాగానే నువ్వు ఐశ్వర్యశీలి అవుతావు’ అని చెబుతాడు.
మునీశ్వరుడు చెప్పినదంతా శాంతశీలకు గుర్తుకువస్తుంది. వెంటనే ఆమె రాజు వద్దకు వెళ్లి తానెవరో చెప్పి, వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. రాజు అలాగేనని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్టు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ, శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజాజ్ఞ వేయించినందుకు బాధపడుతుంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా, దేవి ప్రసన్నురాలై ‘ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరు దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తా’నని వరమిస్తుంది.

లలితా సహస్ర నామాలను ఎవరు రచించారు? ఈ నామాలు ఎక్కడ పుట్టాయి? తమిళనాడులో లలితా సహస్ర నామాలతో ముడిపడిన అమ్మవారి ఆలయం ఒకటుందని విన్నాను. నిజమేనా?
తమిళనాడులోని తిరువారూర్‍ జిల్లా తిరుమేయచ్చూరులో లలితాంబిక ఆలయం ఉంది. ఇక్కడ నిత్యం లలితా సహస్ర నామాల పారాయణలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఇక్కడ అమ్మవారు లలితాదేవిగా, శాంతనాయకిగా శ్రీచక్రంపై ఆశీనురాలై, ప్రసన్న వదనంతో, అభయముద్రతో దర్శనమిస్తారు. పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా పూజలందుకుంటున్నాడు. వీరిద్దరూ స్వయంభువులుగా వెలిసిన ఈ క్షేత్రానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే లలితా సహస్రనామ స్తోత్రం పుట్టింది. అందుకే ఇక్కడి అమ్మవారి సమక్షంలో పారాయణం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. ఈ సహస్ర నామాల పుట్టుక వెనుక ఓ కథ ఉంది. భంగాసురుడనే రాక్షసుడు దేవతలనూ, రుషులనూ ఇబ్బంది పెడుతుండటంతో వాళ్లంతా జగన్మాతకు మొరపెట్టుకున్నారట. దాంతో జగన్మాత ఆ అసురుడిని సంహరించిందట. ఆ తరువాత కూడా శక్తి స్వరూపిణి ఆగ్రహం చల్లారకపోవడంతో అది గ్రహించిన పరమేశ్వరుడు దేవిని భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయాలని ఆదేశించాడట. అలా దేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసి కరుణామయిగా మారి, లలితాదేవిగా కొలువుదీరిందని కథనం. ఆ తరువాత లలితాదేవి ఆదేశానుసారం అష్ట వాగ్దేవతలైన వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మోదిని, సర్వేశ్వరి, కౌళిని కలిసి ఇక్కడే లలితా సహస్ర నామాలను రచించారట. ఇది జరిగిన కొన్నాళ్లకు అగస్త్య మహర్షి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ ఆలయంలోనే మొదటిసారి లలితా సహస్ర నామ స్తోత్రాన్ని ఆ మహర్షికి ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక, దసరా సందర్భం గురించి కూడా తెలుసుకోవాలి. దేవీ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినా విజయదశమి నాడు లలితాదేవికి చేసే నివేదనను చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఆ రోజున ఎక్కువ మోతాదులో పొంగలి, పులిహోర, దద్ధ్యోజనాన్ని వండి.. ఓ వరుస క్రమంలో పేరుస్తారు. పొంగలిని ఓ చిన్న నీటిగుంటలా చేసి అందులో కాచిన నెయ్యిని ఎక్కువ మొత్తంలో వేయడంతో అది చూడ్డానికి చిన్న నీటి కొలనులా ఉంటుంది. ఆ నేతిలో సర్వాభరణాలు దాల్చి మందహాసంతో ఉన్న దేవి ప్రతిబింబం కనిపిస్తుందనీ, ఆ రూపాన్ని చూస్తే అనారోగ్యాలు నయమై, సకల శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే విజయదశమి నాడు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఇక, శనీశ్వరుడు, వాలి, సుగ్రీవుడు జన్మించిన ప్రాంతం కూడా ఇదేనని చెబుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఆయుష్షు, మృత్యుంజయ హోమాలు చేయించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఇక, పరమేశ్వరుడు పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునే సందర్భాన్ని తెలిపే అరుదైన విగ్రహాన్నీ ఈ ఆలయంలో చూడవచ్చు.

Review ‘లలితా సహస్రం’ పుట్టిందెక్కడ?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top