లోకాన్నేలే ఈశ్వరుడు సూర్యుడు

ఈ లోకాన్ని ఏలే ఈశ్వరుడు సూర్యుడే. ఆయనను సర్వేశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడు సృష్టించాడట! జనవరి 24, బుధవారం మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి సందర్బంగా ఆయా మంత్రాపుష్పాల నుంచి సేకరించి అందిస్తున్న మహిమాన్విత సూర్య మంత్రాలివి..
ఆదిదేవ సమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రథమారూఢమ్‍ ప్రచండమ్‍ కశ్య పాత్మజమ్‍
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమా మ్యహమ్‍
ఏడు గుర్రాలు గల రథమును ఎక్కినట్టి వాడు, ప్రచండుడు, దివాకరుడు, భాస్కరుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించిన వాడు అయిన సూర్యభగవానునికి నమస్కరిస్తున్నాను.
సూర్యుడిని పూజించడం వల్ల విశేష ఫలి తాలు కలుగుతాయి. అవెలాంటి ఫలితా లంటే..
సర్వదుఃఖోపశాంతాయ
సర్వపాప హరాయచ
సర్వవ్యాధి వినాశాయ
భాస్కరాయ నమో నమః
ఈ శ్లోకం భవిష్యత్తోర పురాణంలోనిది. దీనికి భావం ఏమిటంటే- ‘సూర్య భగవానుడిని ఆరాధిస్తే శోకం, దారిద్య్రం, అనారోగ్యం దరిచేరదు. ఒక్క సూర్యుడిని ఆరాధిస్తే సకల దేవతలనూ ఆరాధించినట్టే’.
ఇక, పద్మ పురాణంలో సూర్యారాధన గురించి, మాఘ స్నానం వల్ల కలిగే ఫలితం గురించి విశేషంగా వర్ణించారు.
మాఘం విశేషధర్మా
మోఘఫలప్రదముగాదె ముల్లోకములన్‍
మాఘన్నానంబెవ్వ డ
మోఘంబుగ జేయు నొక్కొ మునుకొనియని పా
పౌఘములు గంపమొందుచు
లాఘవమున దూలి యడవులంగలయుదు దిన్‍
మాఘ మాసపు ఆదివారాలు మహత్తరమైనవి. ఈ రోజుల్లో సూర్యుడిని పూజించిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. మాఘ మాసం మకర మాసం కలిసి ఉండే రోజులు మహా ఫలప్రదం. ఈ కాలంలో ప్రాతఃస్నానం అతి ముఖ్యం. సూర్యుడు మకరరాశి గతుడు ఎప్పుడు అవుతాడో అప్పటి నుంచి ప్రాతః స్నానం తప్పక చేయాలి. మాఘ మాసంలో ఉషఃకాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావులు మొదలైన వాటిలో కాని, చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఒకవేళ అశక్తత వల్ల ఆ సమయంలో స్నానం చేయడానికి సమర్థత లేని వారు తెల్లవారు ఝాము లోపు స్నానం చేయాలి. చలికి వెరవక మంచు చేత జలిమిరి హెచ్చిన నదీ జలాల్లో స్నానం మంచిది. మాఘ మాసం అరుణోదయాన దీపారాధన, తిలహోమ తిలదానం, తిలభక్షణం, మాఘ స్నానం ముఖ్యం.
అధవా మండలే తత్ర భాస్కరస్య మహాత్మనః
పద్మాసన స్థితం దేవం నిర్మలం పాపకోసమమ్‍
భాసయంతంజగత్సర్వం సృష్టిస్థిత్యంత కారణమ్‍
సోహమాత్మేతి తద్ధ్యానం, విద్వద్భిః పరికీర్తనమ్‍
జ్ఞానం సమస్త జగతాం సంయమే సూర్య మండలే
దేచకాభ్యాస యుక్తేన ప్రవిశత్య పదాంపదమ్‍
సమాన వాయుర్జ్వలన యుదానే గమనే గతిః
లావణ్యంచ బలం రూపం
యస్మిన్తస్మిన్‍ సు సంయమమ్‍
‘సూర్యమండల సంయమనం వల్ల సంపూర్ణ జగత్తు యొక్క ముల్లోకాల జ్ఞానం లభిస్తుంది. రేచక ప్రాణాయామ అభ్యాసంతో కూడిన సంయమనం వల్ల పరకాయ ప్రవేశం సాధ్యం. లావణ్యం, బలం కలుగుతుంది’ అని పై శ్లోకా నికి భావం.
చిత్రం దేవానా ముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః
అప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు స్థుషశ్చ
పై శ్లోకంలో ‘ఉదగాత్‍’ అనే క్రియను ఈ మంత్రం దినదినం ఉదయించే సూర్యుడిని దేవతగా ఉపాసించడానికి ఉద్దేశించారు. దీనిని దేవతాకార్యమైన యజ్ఞం చేసే సమయంలో, హోమంలో జపిస్తారు. పై శ్లోకానికి అర్థమిది..
‘తమలో రక్తశ్వేతాది వివిధ వర్ణములు నిగూఢంగా ఉండి దీప్తి మంత్రాలై లోకాలను ప్రకాశింప చేసే కిరణాల కాంతి పుంజము మహా సైన్యం వలే ఒక్కమారుగా చిత్రంగా ఉద్భ వించింది’.

Review లోకాన్నేలే ఈశ్వరుడు సూర్యుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top