కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కంటే భక్తకోటికి కావాల్సింది ఏముంది? ఆ దేవదేవుని దర్శనం కోసం గంటలు కాదు.. రోజుల తరబడి పడిగాపులు కాసే భక్తులు ఎందరో..?! అటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ‘ప్రత్యేక ప్రవేశ దర్శనం’ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారి దర్శన భాగ్యానికి మార్గం సుగమం చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉండే ఈ టికెట్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, నియమాలేమిటి, తాజాగా ఈ విధానంలో ఇచ్చిన సడలింపులు, వెసులుబాటు ఏమిటో తెలుసుకుందాం
దేవుడి దగ్గర అందరూ సమానమే అంటారు. కానీ, కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శనం అందరికీ అంత సులువుగా లభించదనేది ఒకప్పటి వరకు ఉన్న అపవాదు. అందుకే చాలామంది సమాజంలో పలుకుబడి కలిగిన వారి సిఫార్సుతో శ్రీవారిని దర్శించుకున్న దాఖలాలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సిఫార్సు దక్కని వారికి దర్శన భాగ్యం కలిగేది కాదు. ఈ క్రమంలోనే టీటీడీ వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వీలు కల్పించింది. దీనికి భక్తకోటి నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఎటువంటి సిఫార్సు లేకుండా ఈ టికెట్ల ద్వారా స్వామిని అందరూ దర్శించుకోవచ్చు. నిర్దేశిత సమయంలో స్వామిని దర్శించుకోగల సౌలభ్యం ఈ విధానం ద్వారా భక్తులకు రెండున్నర సంవత్సరాలుగా లభిస్తుంది. దర్శనానికి వచ్చే భక్తుల అభిప్రాయాలకు, సలహా సూచనలకు విలువనిస్తూ, వారి నుంచి వాటిని స్వీకరిస్తూ ఈ పథకంలో తగిన మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. ఈ ఆన్‍లైన్ టికెట్ బుకింగ్ విధానం వల్ల టీటీడీకి రోజూ రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇంటర్నెట్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ (రూ.300)ను నమోదు చేసుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరింత పారదర్శకంగా టికెట్ల జారీకి గాను 2014 ఆగస్టు 20న టీటీడీ ఆన్‍లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకు 120 దేశాలకు చెందిన 85 లక్షల మందికి పైగా భక్తులు ఈ ఆన్‍లైన్ విధానం ద్వారా టికెట్లను బుక్ చేసుకుని వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారని అంచనా. యాత్రికుల సౌకర్యార్థం టీటీడీ ఆన్‍లైన్ నమోదు పక్రియను సరళతరం చేస్తోంది. గతంలో ఆన్‍లైన్‍లో టికెట్ నమోదుకు కుటుంబసభ్యుల అందరి ముఖచిత్రాలను అప్‍లోడ్ చేయాల్సి
ఉండగా, తాజాగా ఈ నిబంధనకు సడలింపు ఇచ్చింది. మొదటి వ్యక్తి చిత్రాన్ని అప్‍లోడ్ చేసి మిగతా సభ్యుల గుర్తింపు కార్డుల వివరాలను పొందుపరిచేలా వెసులుబాటు కల్పించింది. క్రమంగా ముఖచిత్రాలతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డుల సంఖ్య నమోదుకు అవకాశం కల్పించి మరింతగా సరళతరం చేసింది. ఈ విధానానికి ఊహించిన దానికంటే భక్తుల ఆదరణ పెరుగుతుండటంతో తాజాగా, గత సంక్రాంతి పండుగ నుంచి ఆరుగురికి పరిమితంగా ఉన్న టికెట్ల నమోదు సంఖ్యను పది మందికి పెంచుతూ అవకాశం కల్పించింది.
ప్రైవేటు కేంద్రాల దోపిడీకి అడ్డుకట్ట
ఆన్‍లైన్ టికెట్ల నమోదుకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రైవేటు సంస్థలలో అత్యధికంగా వసూలు చేస్తున్న వైనం టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ల నమోదును మరింత సులభతరం చేసే దిశగా టీటీడీ తాజాగా మరికొన్ని చర్యలు తీసుకుంది. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆన్‍లైన్ కేంద్రాలు 7,500 వరకు ఉన్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ శాఖలున్నాయి. కొన్ని ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు భక్తులను అధిక సేవా రుసుముల పేరుతో మోసం చేస్తున్నాయనే ఫిర్యాదుతో టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆన్‍లైన్ కేంద్రాల్లో టికెట్లు కొనుగోలు చేసిన పక్షంలో రూ.5 వంతున మాత్రమే వసూలు చేసేలా నిర్ణయం తీసుకుంది. భక్తులకు టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంది.
భక్తుల కోసం ఆతిథ్య ఏర్పాట్లు
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తగినంతగా అందుబాటులో ఉండటంతో ముందస్తుగా బుక్ చేసుకుని శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భక్తులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని పెద్దసంఖ్యలో టికెట్లను నమోదు చేసుకుంటున్నారు. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శన సముదాయాన్ని కొత్తగా ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇస్తోంది. సముదాయంలోకి అడుగుపెట్టగానే
•తిలోని సంచులను తీసుకుని డిపాజిట్ చేసుకుని శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి జాగ్రత్తగా అందించే పక్రియను కొనసాగిస్తోంది. వెంటనే సేదదీరడానికి స్వచ్ఛమైన మంచినీటితో పాటు కోరుకున్న మేరకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ అందించి ఆతిథ్యం ఇస్తోంది. భక్తిభావం ఉట్టిపడేలా నొసటన తిరునామధారణ సౌకర్యం కల్పించింది. కొంత సమయం అలసట తీర్చుకుని టికెట్లను సులభంగా స్కానింగ్ చేసుకుని ఆలయానికి వెళ్లేలా చర్యలు తీసుకుంది.
గుర్తింపు కార్డుంటే చాలు
ముందుగా ఆన్‍లైన్‍లో టికెట్లను నమోదు చేసుకున్న యాత్రికులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని టీటీడీ కోరుతోంది. ఎటువంటి సిఫార్సులు అవసరం లేదని, నియమాల మేరకు గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకుంటే చాలని టీటీడీ సూచిస్తోంది. ఎంత రద్దీ ఉన్నా.. రెండు గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనానికి భరోసా ఇస్తోంది. టికెట్ల నమోదు సమయంలోనే అదనపు లడ్డూల కొనుగోలుకూ అవకాశం కల్పిస్తోంది. ఒక్కో టికెట్‍పై రెండు (2) లడ్డూలు ఉచితంగా ఇస్తుండగా, మరో రెండు (2) కూడా అదనంగా రూ.50 చెల్లించి పొందే అవకాశం ఉంది. అలాగే శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం అందుకునే భాగ్యం ఉంది. ఇంటర్నెట్‍లో ప్రస్తుతం మూడు గంటలకు ముందుగానే నమోదు చేసుకుని శ్రీవారిని దర్శించుకునే అవకాశం కొత్తగా అందుబాటులోకి వచ్చింది. భక్తుల డిమాండ్‍ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ రోజూ 20 వేల నుంచి 25 వేల వరకు టికెట్లను అందుబాటులోకి తెస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం.. అమెరికాలో ఉన్నా.. అమలాపురంలో ఉన్నా సమస్య లేదు. ఇంటర్నెట్‍లో ఆన్‍లైన్ టికెట్ బుక్‍చేసుకుంటే చిటికెలో దేవదేవుని దివ్య దర్శన భాగ్యం మీ సొంతం!
Review శ్రీవారి దర్శన భాగ్యం.