కృషి లేకుండా లభించేది ఖుషీ
‘సంతోషం’ బ్రౌజ్ జేసే పాస్‍వర్డ్ ‘సంతాపం
సంతోషంగా ఉండే ఉపాయం నేర్చుకుందాం. వేదాంతాన్ని పక్కనపెట్టి, ప్రాథమిక సూత్రాలను మరొకసారి పరికిద్దాం.
అన్నివేళలా అందరికీ అత్యవసరమైనవి, అతి విలువైనవి ఏ ఒక్కటీ దాచి ఉంచబడలేదు. ఇది ఒక ప్రాథమికసూత్రం. ఇది ప్రకృతి ఉదారగుణం. గాలిని బంధించే తలుపు లేదు, తాళం లేదు. నీటిని కట్టి
ఉంచే తాడు లేదు, స్తంభం లేదు. పండును పట్టి ఉంచే పాశం లేదు, పంజరం లేదు. సూర్యకిరణాలు భూమిని చేరకుండా అడ్డుకునే గోడ లేదు. అందువలన నిజంగా ఆనందం అనుక్షణమూ ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైన ఆవశ్యకమైతే, అది ఏ బందిఖానాలోనూ ఉండకూడదు. కానీ, కట్టడిలేని దాని కట్లు విప్పడానికి ఎన్ని ఉపాయాలు ఆలో చిస్తామో కదా!
ధనం, హోదా, పేరు ప్రఖ్యాతులు కలవారిని చూసి అసూయపడుతుంటాం. అవన్నీ సౌఖ్యానికి అవసరమైన ఉపకరణాలని భావిస్తాం. మన వద్ద ఎన్ని ఉపకరణాలున్నా వాటితో సంతోషం పొందలేం.
ఆనందపు నిధి ఏదో పెట్టెలో నిక్షిప్తంగా లేదు. అన్నివైపులా, అంతటా కనిపిస్తున్నది. సరిగ్గా చూడు. ఇక్కడే ఉంది, నీ ముందరే ఉంది. ఇప్పటికిప్పుడు ఆనందంతో చిందులువెయ్యి. నీకున్న శక్తితో నీవేది చెయ్యగలిగితే అది చెయ్యి. అదే బ్రహ్మానందం. ఇంతకుమించి చేయవలసిందేదీ లేదు. సరదాగా ఈతకొట్టు. అందుకోసం నీకున్న రెండు కాళ్ళు, రెండు చేతులు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఇంకేం కావాలి? విదేశీ పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాలా? ఇతర ప్రత్యేకతలు కావాలా ? అవసరం లేదే ? అయితే మునగడం, తేలడం నీ చేతిలోనే ఉంది.
మనం సంతోషంగా ఉండేందుకు అవసరమైన దంతా ముందే ఇవ్వబడింది. అంటే మనం సాధించాలనుకున్న లక్ష్యాలు ఇదివరకే సాధింపబడిన వన్నమాట. ఆ విషయమే మనం గుర్తించడం లేదు. ఈదటానికి కాళ్ళు చేతులు తప్ప వేరే ఏమైనా అవసరమనుకుంటే అది అదనపు భారమే తప్ప మరేమీ కాదు. కాళ్ళు, చేతులు ఎలా కదపాలో తెలిస్తే చాలు. ప్రకృతి ఇన్ని అమర్చినా ఇంకా నిట్టూరుస్నున్నామంటే, ఏమిస్తే మనకు తృప్తి కలుగుతుంది ? ఇంకేమీ ఆశిస్తున్నాం?
మంచి ఆరోగ్యం, వెలకట్టలేని సంపద. అదే నీకు బహుమతిగా దొరికింది. అందుకు పెట్టుబడి లేదు. అదే పెద్ద ఘనత. పరుల సహకారంతో లభించినదానికంటె ఎంతో గొప్పది.
ఉన్నతమైన ప్రేమ, ఉత్క•ష్టమైన వివేకం సృష్టించిన సంతానం మనమందరం. ఇది నమ్మ డానికి ఇష్టపడక పోవడం వలన ప్రతి చిన్న కష్టానికి విలవిలలాడతాం. ఎక్కడైనా, ఏ రూపంలోనైనా, ఏ సందర్భంలోనైనా మనం విలపిస్తే విశ్వంభరుని అసమాన విజ్ఞతను అనుమానించినట్లే. జగద్రక్షకుని అనంత ప్రేమను అవమానించినట్లే.కనుక, ఎంతటి సంక్లిష్ట సమస్య ఉత్పన్నమైనా, అది అంతిమంగా మన మేలు కొరకే. భయాన్ని పారద్రోలే మార్గాలు వెతుకుతాం. జగత్పతి యొక్క కరుణ, సామర్థ్యాలను గుర్తించిన మరుక్షణమే భయం మటుమాయమవుతుంది.
మా అమ్మాయి ఒకసారి తనకు వచ్చిన పీడకల గురించి చెప్పింది. ఆ కలలో తళతళ మెరుస్తున్న కత్తిమొన తన వైపు వస్తున్నది. భయంగా చూడసాగింది. పెద్ద కత్తి! చూస్తుండగానే మరింత పెద్దదయింది! వణికిపోతూ ఇంకాస్త పైకి చూసింది. పెద్ద పిడికిలి ఆ కత్తిని పట్టుకొని, తన పొట్టలోకి గుచ్చుతోంది. ప్రాణాలు కడబట్టాయి. లోతుగా కడుపులోకి కత్తి దిగబడుతోంది. చనిపోవడానికి సిద్ధమై గట్టిగా అరవబోతూ, తల పైకెత్తి చూసింది! ఆ వ్యక్తిని గుర్తు పట్టింది! అంతే!! ఒక్కసారి, హమ్మయ్య! అని తేలికగా నిట్టూర్చింది. భయం పటాపంచలయింది. ఎవరు కనిపించారు తల్లీ! అని ఆతృతగా అడిగాను. ఆమె చెప్పిన •వాబేమిటో తెలుసా! ఆ కత్తి పట్టిన వ్యక్తి మీరే డాడీ! మా డాడీతో నాకేం ప్రమాదం లేదనే ఆలోచన వచ్చిన వెంటనే, ఆమె భయం పోయింది. కత్తి ఎంత పొడవైనా, ఎంత పదునైనా, పట్టుకున్నది తన తండ్రి కనుక, తనకు హాని జరగదని నమ్మింది. ఆ నమ్మకమే ధైర్యా న్నిచ్చింది. దైవాన్ని నమ్మండి ! ఆయన వాత్సల్యాన్నీ, వివేకాన్నీ నమ్మండి! సమస్య ఎంత క్లిష్టమైనా, సమస్య చివర సృష్టికర్త ఉన్నాడన్న ధైర్యం మనల్ని ఆనందంలో ముంచాలి.
జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు రావటం, కాసింత దుఃఖం కలగడం చాలా సహజం. ఆహారం ఎంత రుచికరమైనా, ఎంత ఖరీదైనా జీర్ణమయ్యాక కొంత వ్యర్థపదార్థంగా మారుతుంది. పవిత్ర గంగాజలమైనా, మానససరోవరం నుండి తెచ్చి త్రాగినా నీరు కొంత విసర్జింపబడుతుంది. స్వచ్ఛమైన సంతోషం కూడా కొంత దుఃఖంగా పరిణమిస్తుంది. ఇది అత్యంత సహజం.
బాత్‍రూంకి వెళ్ళినపుడు ఏమిటి నాకీ అవస్థ అని దైవాన్ని నిందిస్తామా ? ఇది ప్రతిజీవికీ సామాన్య ధర్మమని తెలియదా? ఏ జీవికీ మినహాయింపు లేదు. చెట్లూ చేమలూ కూడా కొంత నీరు గ్రహించి, మరికొంత బయటికి విడుస్తాయి. పశువుల వ్యర్థపదార్థాలను ఎరువులుగా వాడుతారు. ఎడాదిలో తప్పనిసరిగా దర్శనమిచ్చే వేసవిని నిందించకుండా, ఎలా భరించి, అది తయారుచేసే వర్షాన్ని అనుభ విస్తామో, అలాగే, జీవితంలో దుఃఖం అనివార్య మైనపుడు దాన్ని ఆనందంగా ప్రేమించాలి. అది సృష్టించే సంతోషాన్ని అనుభవించాలి.
సింగపూర్ నగరం మొత్తం ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. అంతటి పరిశుభ్రతకు కారణం తెలుసా? అడుగడుగునా ఉన్న చెత్త బుట్టలు. అదే రహస్యం, ఆనందం వెనుక రహస్యం ఆవేదన, ఒకటి కాదనుకుంటే రెండు పోగొట్టుకుంటాం.
Review సుఖానికి సోపానం.