పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో విశేష ఆరాధ్య దైవం. కార్తికేయ, మురుగ, షణ్ముఖ, శరవణ, మహాసేన, కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, బాలస్వామి, వేలన్, దండపాణి, వల్లీనాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర పేర్లు ఈయనకు ఉన్నాయి. శక్తికి, తేజస్సుకీ, గ్రహపీడలు తొలగిపోవడానికి, కుజదోషాలను నివారించుకోవడానికి కుమారోపాసన చేయడం సంప్రదాయంగా వస్తోంది. దేవతల్లో ఈయన అత్యంత శక్తివంతమైన దైవం. మిక్కిలి అందగాడు కూడా! అందుకే ఈయనను ‘మురుగన్’ (సౌందర్యవంతుడు) అని తమిళంలో ముద్దుగా పిలుచుకుంటారు. నవంబరు 26 సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక కథనం నమ: సింధవే సింధు దేశాయ తుభ్యం
పున: స్కందమూర్తే నమస్తే నమోస్తు
క్రీస్తుపూర్వం 1, 2 శతాబ్దాలకు చెందిన తమిళ మహాకవి నక్కిదేవ నాయనార్ (నక్కిరర్) ‘తిరుమురుగర్రుప్పడై’ అనే గ్రంథంలో మురుగ దేవుని ఆరాధన గురించి వర్ణించారు. గణపతి దేవుని వలే సుబ్రహ్మణ్య స్వామి కూడా శివపార్వతులకు విపరీత పరిస్థితులలో జన్మించాడు. వినాయకుడి పుట్టుకకు పార్వతీదేవి కారకురాలైతే సుబ్రహ్మణ్య స్వామి జననానికి పరమశివుడు కారకుడు.
దేవదానవులకు చిరకాలంగా సాగుతున్న యుద్ధంలో దేవతలు విజృంభించి రాక్షసులను ఓడిస్తుండే వారు. అఖిరసేనుడనే రాక్షసరాజు కుమార్తె తండ్రిని సంతృప్తిపర్చడానికి మాయావిగా మారి కశ్యప మహర్షిని ఆకర్షిస్తుంది. మాయ, కశ్యపులకు శూరపద్మ, సింహముఖ, తారక అనే ముగ్గురు కుమారులు కలుగుతారు. వారు శివుడిని మెప్పించి అపార శక్తిమంతు•లై దేవతలను బాధిస్తూ, ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు. దేవతలు శివుడిని ఆశ్రయించగా, ఆయన ఆరు ముఖాలతో ఒక బాలుడిని ఉద్భవింప చేస్తాడు. ఆ ఆరు ముఖాల్లో ఒక్కో ముఖం నుంచి వెలువడిన దివ్యతేజస్సులను అగ్ని, వాయువులు శరవణ (రెల్లు పొద) సరోవరంలో ఉంచుతారు. అందుకే ఆ బాలుడిని శరవణభవుడని పిలిచే వారు. ఆరు ముఖాలు గలవాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. ఆరుగురు కృత్తికలు ఆ జ్యోతి స్వరూపాలను పెంచినందున కార్తికేయుడయ్యాడు. ఒకే శరీరంలో ఆరు ముఖాలు, పన్నెండు హస్తాలు గల కార్తికేయునికి సహాయకులుగా పార్వతీదేవి మూపురం నుంచి తొమ్మిది మంది (వీరబాహు, వీరకేసరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురందర, వీరరాక్షస, వీరమార్తాండ, వీరాంతక, వీరధీర) అనే వీరులు వెలువడతారు. తిరుమాలుడి (విష్ణువు) ఆదేశం మేరకు ఈ బాలుడు శివుడికి ప్రణవోపదేశం చేస్తాడు. అందుకే ఈయనను శివగురు, స్వామినాథ, దేశిక అనే పేర్లతోనూ పిలుస్తారు.
ఆరు వారాల ప్రాయం గల కార్తికేయుడు క్రౌంచ పర్వతంలో దాక్కున్న తారకాసురుడిని తన వజ్రాయుధంతో హతమారుస్తాడు. తారకాసురుడిని నేలకూల్చిన స్థలమే నేటి తిరుత్తణి క్షేత్రం. ఇది తమిళనాడులోని ఆరు షణ్ముక క్షేత్రాల్లో ఒకటి. తమ్ముడి మృతితో శూరపద్ముడు కుమారస్వామిపై దండెత్తుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. మాయావి అయిన శూరపద్ముడు సముద్రంలోకి వెళ్లిపోయి పెద్ద మామిడిచెట్టు రూపం దాల్చుతాడు. కుమారస్వామి తన వేలాయుధంతో ఆ వృక్షాన్ని చీల్చుతాడు. రాక్షసుని శరీరం రెండు ముక్కలుగా చీలి ఒక భాగం నెమలిగానూ, రెండో భాగం కోడిపుంజుగానూ మారతాయి. కుమారస్వామి నెమలిని తన వాహనంగానూ, కోడిపుంజును తన ధ్వజంగానూ చేసుకుంటాడు.
అందువల్లనే ఈయనను శిఖి వాహనుడని కూడా పిలుస్తారు. కోడిపుంజును ధ్వజంగా కలిగి ఉండటం చేత కుక్కుటధ్వజుడూ అయ్యాడు. ఈ యుద్ధం జరిగిన స్థలమే నేటి తిరుచెందూరు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది.
అనంతరం కార్తికేయుడు సింహముఖుడిని కూడా తన వజ్రాయుధంతో నేలకూల్చాడు. దేవతలకు రాక్షసుల పీడ విరగడ చేసిన కుమారస్వామి ఇంద్రుని కుమార్తె దేవయానిని, శివముని కుమార్తె వల్లీదేవిని పెళ్లాడతాడు. తమిళనాడులోని తిరుత్తణి, తిరుప్పరకున్రమ్, తిరువినన్‍కుడి (పళని), తిరువరగం (స్వామిమలై), తిరుచెందూరు అళహర్‍కోయిల్, శ్రీలంకలోని కదిర ప్రధానమైన మురుగ క్షేత్రాలు. ఈ క్షేత్రాలు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనూ, అడవులలోనూ ఉంటాయి. వీటిలో పళని ప్రధానమైన మురుగ క్షేత్రం. అన్నగారైన వినాయకుడితో భూలోక ప్రదక్షిణలో పోటీపడి ఓడిపోయిన కుమారస్వామి.. ఇక్కడే, ఈ కొండపైనే దిగాలుగా ఉండిపోతే, శివుడు ఓదార్చిన చోటు ఇదేనని అంటారు.
స్వామికి పూలు, పడగలు..
మార్గశిర శుద్ధ షష్ఠి (నవంబరు 26, 2025) సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రతీతి. ఆంధప్రదేశ్‍లోని, ప్రధానం గోదావరి జిల్లాల్లో, కోస్తా ప్రాంతంలో సుబ్రహ్మణ్య షష్ఠి గొప్ప ఉత్సవంలా వైభవంగా జరుగుతుంది. దీనినే ఈ ప్రాంతాల్లో సుబ్బారాయుడి షష్ఠిగానూ వ్యవహరిస్తారు. తమిళనాడు వాసులు స్కంద షష్ఠి అంటారు. ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి పూజతో పాటు చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలు కూడా చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి పరగడుపున పట్టుబట్టలతో కానీ, తడి బట్టలతో కానీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పళ్లు, పడగలు, పుట్టలు సమర్పిస్తారు. పుట్టలు, పడగలు సమర్పించడం నాగపూజకు చిహ్నం. గోదావరీ తీర ప్రాంతాల్లో షష్ఠి నాడు పాటించే ఆచారాలు కాస్త భిన్నమైనవి. షష్ఠి తరువాతే వరిచేల కోతలు ప్రారంభిస్తారు. ఇది రైతుల పండగగా కూడా భావిస్తారు. షష్ఠి వెళ్తే వానలు వెనక పట్టినట్టు రైతుల విశ్వాసం. ఈ తిథి నాటికి ఆకాశం మబ్బులు పట్టి ఉంటుంది కానీ వానలు పడవు. కాబట్టే వానలు కురవని మబ్బులకు షష్ఠి మబ్బులని పేరు.
సంతాన కాంక్షితులు కూడా ఈనాడు విశేషంగా పూజలు చేస్తారు. ఈనాడు సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే విశ్వాసం తమిళ, తెలుగు ప్రజల్లో విశేషంగా ఉంది. అందుకే ఈయనను సంతానదేవతగా భావిస్తారు.
ఇక షష్ఠి నాడు తమిళనాడులో చేసే పూజలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ షష్ఠి నాడు అక్కడ కావడి కట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మోసుకుని వెళ్లడం ఆచారంగా ఉంది. కావడి కుండలను పంచదారతో కానీ, పాలతో కానీ నింపుతారు. ఇది మొక్కు తీరును బట్టి ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు బాల్యంలోనే గొప్ప పనులు చేసిన దేవుడు. ఆయనకు మొక్కు తెచ్చే కావడి దండెను బ్రహ్మదండి అని పిలుస్తారు. కావడి మట్టులను అష్టనాగములని అంటారు. బ్రహ్మదండి అంటే వెన్నెముక. కావడి మొక్కులు తమిళుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనినే కావడి ఉత్సవం అంటారు.
స్వామి వాహనం నెమలి. అది పురివిప్పి ఆడినపుడు ఓంకార రూపంలో ఉంటుంది. అందువల్ల ఈయన ప్రణవ స్వరూపుడు. ఆయన ధ్వజంపై కోడిపుంజు ఉంటుంది. ‘కో’ అనే ధ్వని ప్రణవాన్ని సూచిస్తుంది. జ్ఞానభానూదయానికి ఆ ధ్వని సంకేతం.
స్కాంద పురాణంలోని అగస్త్య నారద సంవాదంలోని సుబ్రహ్మణ్య స్వామి సహస్ర నామాలలో ‘ఉరగశ్వరాయ నమ:, మహోరగాయ నమ:’ అని ఉంటుంది. వల్లీదేవి సర్పరూపంలో ఉన్నదని, స్వామి కూడా సర్పాకారంలో ఉంటారని పురాణగాథ. ఈ కారణంగానే ఆయనను సుబ్రహ్మణేశ్వర స్వామిగా కూడా ఎంచి కొలుస్తారు.
నిత్య యవ్వనుడైన కుమారస్వామిని బాలన్, కుమార అని కూడా పిలుస్తారు. క్రీస్తు శతాబ్ది ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో స్కందారాధన విస్త•తంగా ఉండేది. కుషాణ రాజులు తమ నాణేలపై రెండువైపులా మహాసేనానుడిని, స్కందుడిని ముద్రించేవారు.
సుబ్రహ్మణ్యస్వామి సాధారణంగా రెండు, నాలుగు చేతులు, ఆరు తలలు, పన్నెండు చేతులు గల మూర్తిగా కనిపిస్తాడు. కుక్కుటము, గంట, పతాకం, శక్తి అతని ఆయుధాలు. ఎడమచేతిలో వజ్రాయుధం, కుడిచేత శక్తి (వేలాయుధం) కలిగి ఉంటాడు. బృహత్‍సంహితలో ఈ స్వామిని బర్హికేతునిగా వర్ణించడం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయాల్లో నెమలి విగ్రహం ఉంటుంది. శివుని ముందు నంది, విష్ణువు ముందు గరుత్మంతునిలా అన్నమాట.
సుబ్రహ్మణ్యస్వామికి ఎరుపు రంగు ఇష్టం. ఎర్రని పుష్పాలతో స్వామిని పూజిస్తారు. తలపై అయిదు జడల శిఖిండక లేదా కాకపక్షమనే కేశబంధం ఉంటుంది.
పర్షియన్, అరబిక్ తెగల వారు సుబ్రహ్మణ్యస్వామిని ‘ఇస్కందర్’గా వ్యవహరిస్తారు. స్కందుడే పారశీ భాషలో ‘ఇస్కందర్’ అయ్యాడు. స్కందుడు దక్షిణ భారతదేశ ప్రధాన దేవత కాకముందు సింధు దేశ దేవతగా పూజలందుకున్నట్టు శ్రీశంకరాచార్యుల వారి ‘సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం’లో ఉంది.
మధుర సమీపంలోని తిరప్పరన్ కున్రమ్‍లోని సుబ్రహ్మణ్యస్వామిని అక్కడి ముస్లింలు ‘సిక్కందర్’ అని పిలుస్తారు.
సుబ్రహ్మణ్యుడు.. పాము పూజ
సుబ్రహ్మణ్యస్వామికి, పాముపూజకు గల సంబంధాన్ని గురించి ఒక కవి ఇలా వర్ణించారు-
‘మూలాధారం నుంచి వెన్నెముక (బ్రహ్మదండి) మధ్య నుంచి సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలినీ శక్తి అనబడే సుషుమ్నా నాడియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అజ్ఞాన దశలో మనసు ప్రపంచాభిముఖమై ఉండి, వృత్తులన్నీ సుషుమ్నా మార్గంలో అథోముఖ వ్యాప్తి కలిగి ఉన్నపుడు కుండలినీ పుచ్ఛం సహస్రారంలోనూ, శిరసు మూలాధారంలోనూ కలిగి ఉంటుంది. అదే సమాధినిష్ట (జ్ఞానావస్థ)లో పుచ్ఛం మూలాధారంలోనూ, శిరస్సు సహస్రారంలోనూ కలిగి ఉంటుంది. కనుక అప్పుడు సర్పాకారుడైన సుబ్రహ్మణ్యుడు తన పడగను సహస్రార కర్ణికలో ఉండే శివుడిపై కలిగి ఉంటాడు. ఈ కారణం వల్లనే శివుడు నాగాభరణుడయ్యాడు. శివుడికి ఆభరణం కావడం చేత సర్పరూపి అయిన సుబ్రహ్మణ్యుడికి పూజ్యత కలిగింది’.
శక్తికి సంకేతం
సుబ్రహ్మణ్య స్వామి శక్తి స్వరూపుడు. ఆయన ధరించే విగ్రహంలో ఉన్న శక్తి (వేలాయుధం) అనే ఆయుధాన్ని బ్రహ్మవిద్యకు ప్రతీకగా భావిస్తారు. దురహంకారం, మాయ, కామం అనే దుర్గుణాలకు ప్రతీకలు రాక్షస సోదరులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు. వీరిని కార్తికేయుడు శక్తి అనే బ్రహ్మవిద్యా బలంతో హతమార్చాడు. స్వామి దేవేరులైన దేవసేన, వల్లీదేవి పరమేశ్వరుని ఇచ్ఛా, జ్ఞానశక్తులకు ప్రతీకలు. వల్లీదేవిని కుండలినీ శక్తిగా భావిస్తే, ఆ శక్తి సుషుమ్నా నాడి ద్వారా, సహస్రార కమలాన్ని చేరి సదాశివునిలో ఐక్యమైనట్టుగా భావించాలి.
బ్రహ్మచారులకు పూజ
పురాణగాథల్లో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడిగా కనిపిస్తాడు. కానీ, ఆయన పూజకు ఉద్ధిష్టమైన షష్ఠి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి పూజ చేయడం ఆచారంగా ఉంది. ఆంధప్రదేశ్‍లోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు పులగం, క్షీరాన్నం వండుకుని బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి భోజనం పెడతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాడు ఉపవాసం ఉండి మరునాడు (సప్తమి) బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెడతారు. మరికొన్ని ప్రాంతాల్లో షష్ఠి నాడు ముగ్గురు లేదా ఐదుగురు బ్రాహ్మణ బ్రహ్మచారులను పిలిచి, వారికి తలంటి స్నానం చేయించి, పీటల మీద కూర్చోబెట్టి పూజ చేసి ఒక్కొక్కరికి రెండేసి లేదా ఒక్కొక్కటి చొప్పున కొత్త వస్త్రాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి వారిని సుబ్రహ్మణ్య స్వరూపంగా ధ్యానించి భక్ష్యాలతో భోజనం పెట్టి వారి ద్వారా అక్షితలు పొంది, అవి తమ తలపై వేసుకుని తరిస్తారు.




































































































































































Review సుబ్బారాయుడి షష్ఠి.