ఉన్నది ఒక్కటే జిందగీ

ఎక్కడెక్కడో ఉందని దేని కోసమైతే వెతుకుతామో అది మన మనసులోనే ఉందని చెబితే ఎవరూ ఒక పట్టాన నమ్మరు. నమ్మిన వారు జీవితాన్ని అందంగా మలుచుకోగలుగుతారు.
ఈ జీవితం అద్భుతమైనది. ఇది భగవంతుడు మనకు ఇచ్చిన అద్భుతమైన వరం. అటువంటి అద్భుత జీవితాన్ని ఏవేవో ఆలోచనలు, ఉద్దేశాలతో మనకు మనమే దుర్భరం చేసుకుంటున్నాం. అద్భుతమైన జీవితం అనుభవించడం అందరికీ సాధ్యమే. డబ్బున్న వాళ్లే సౌఖ్యాన్ని అనుభవించగలరనీ, పేదలు కష్టనష్టాలతో జీవితాన్ని నిస్సారం చేసుకుంటారని భావించడం తప్పు. ఆనందాన్ని పొందడానికి రాజు – పేద తేడా లేదు. ఆనందాన్ని ఫీల్‍ అవుతున్నామా? లేదా? అనే దానిని బట్టే అది మనకు దక్కుతుంది.
ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు?
అద్భుతంగానా? డిజప్పాయింటెడ్‍గానా? బోర్‍గానా? చిరాకుగానా?
ఒక్కసారి మీకు మీరు విశ్లేషించుకోండి. కచ్చితంగా మన జీవితాలను డిసైడ్‍ చేసే అతి ఫ్యాక్టర్‍ ఇదే.
ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారన్న దానిని బట్టే మరుక్షణం మీకు లభించే ఫలితం ఆధారపడి ఉంటుంది.
నిజానికి మీరు కొండంత బాధ్యతల భారం నెత్తిన మోస్తున్నారనుకోండి. అయితే ఏంటి? ఈరోజు ఉన్న బాధ రేపుండదని అనుకుంటున్నారా? లేక బాధ్యతల బరువుతో ఇంకా అంతకంతకూ కుంచించుకుపోతున్నారా?
పై రెండు ఆప్షన్లలో మీరు దేనిని ఫాలో అవుతున్నారన్న దానిని బట్టే మీ జీవితం ఆధారపడి ఉంటుంది.
మన ఆలోచనలు ఉండే తీరును బట్టే మన మెదడుకు ఇన్‍స్ట్రక్షన్స్ చాలాసార్లు సరిగా కానీ, ఎక్కువ సార్లు తప్పుగా కానీ హైజాక్‍ అవుతుంటాయి. ఈ ఆలోచనలు, భావనల హైజాకింగ్‍ వల్లనే చాలామంది ఫెయిల్యూర్‍ పీపుల్‍గా ఉండిపోతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే మన ఆలోచనలు, మన తీరు, మన వ్యవహారశైలి వల్లనే మన మెదడు ‘నెగటివ్‍ పోగ్రామింగ్‍’ చేయబడుతోంది.
మన మెదడుకు మంచికి, చెడుకి మధ్య తేడా తెలియదు. మనం ఏం చెయ్యమంటే అది చేస్తుంది. మనం ఏదైనా ఆర్డర్‍ ఇవ్వడమే తరువాయి అది గుడ్డిగా చేసేస్తుంది.
చిన్న ఉదాహరణ..
ఈ మధ్య మీరు మీ సన్నిహితులు, స్నేహితుల పేర్లు తరచుగా మరిచిపోతున్నారా?
ఒకవేళ ఈ మతిమరుపు సమస్యతో బాధపడుతూ మీరు గనుక ‘నేను మిత్రుల పేర్లు మరిచిపోతున్నాను’ అని పదేపదే తలస్తే అదే మెదడుకు పోగ్రామింగ్‍గా మారిపోతుంది. ఈ నెగెటివ్‍ పోగ్రామింగ్‍ వల్ల, మీరు గుర్తుంచుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ గుర్తుంచుకోవాల్సిన పేరును కచ్చితంగా మరిచిపోతారు. ఎందుకంటే మీ మెదడు ‘నేను పేర్లు మరిచిపోతున్నాను’ అనే పోగ్రామింగ్‍కు అలవాటు పడిపోయింది కాబట్టి. బలవంతంగా గుర్తుచేసుకునే ప్రయత్నం చేసినా.. దానిని ఈ నెగెటివ్‍ పోగ్రామింగ్‍ గుర్తుచేసుకోనివ్వదు.
నిజానికి మీకు ఆరోగ్యం బాగా లేదనుకుందాం. లేదా మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా, లోలోన ఏదో అనారోగ్య సమస్య ఉందని, ఫలానా రోగం ఉందనే అనుమానంతో బాధపడుతున్నారనుకోండి. భవిష్యత్తులో ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి తీరుతుంది.
మీరు ‘నాకు బాగాలేదు.. బాగాలేదు’ అనుకునే ప్రతిసారీ, అలా అనుకుంటున్న క్షణం నుంచీ మెదడు వివిధ ఆర్గాన్స్కు ఆ సమాచారాన్ని చేరవేసి బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేస్తుంది.
ఈ క్రమంలో లోలోన చోటుచేసుకునే మార్పులు చివరకు ఏదో ఒక అసౌకర్యానికి గురయ్యే పరిస్థితిని సృష్టిస్తాయి.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనే విషయం ఏమిటంటే.. మనం ఏం ఆలోచిస్తున్నామో.. ఏది తలుచుకుంటున్నామో.. అది ఒక టాస్క్గా మారిపోతుంది. దానినే మెదడు టాస్క్గా భావించి, ఆ టాస్క్ను పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతుంది. చివరకు ఆ టాస్క్ను కంప్లీట్‍ చేస్తుంది. అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతామన్న మాట. మనం ‘నేను నాకు ఉన్న దానితోనే ఆనందంగా ఉన్నాను’ అని పదేపదే లేదా తరచుగా అనుకుంటే.. అది మెదడుకు చేరి మీలో సానుకూల స్పందనలను కలిగించే రసాయనాలను, హార్మోన్లను విడుదల చేస్తుంది. దానివల్ల మీరు ఆనందాన్నే పొందగలుగుతారు.
అలాకాక, మీరు ‘నాకు ఈ జీవితంపై తృప్తి లేదు. నాది అనుకున్నదేదీ నాకు దక్కడం లేదు’ అని పదేపదే చింతిస్తూ కూర్చుంటే అది మెదడుకు చేరి నెగెటివ్‍ ఎనర్జీతో మీ మనసును, తనువును నింపేస్తుంది. అది మిమ్మల్ని నిరాశావాదిగా మిగుల్చుతుంది.

అంటే, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా మనం మెదడును ఎలా ట్యూన్‍ చేసుకుంటామో అదే జరిగి తీరుతుంది.
చాలామంది ఉద్యోగాలు రావడం లేదనో, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నామనో, సంతోషంగా ఉండలేకపోతున్నామనో.. ఇలా రకరకాల మెంటల్‍ ట్రాప్‍లలో ఇరుక్కుపోతుంటారు. అంటే నిరంతరం అవే ఆలోచనలతో గడుపుతుంటారు. ఇవి రిపీటెడ్‍ సజెషన్స్ను మెదడుకు పంపిస్తాయి.
ఈ కారణంగా మీరు ఉద్యోగం కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‍గా వచ్చేస్తుంది. మీరు దేనినైనా దక్కించుకోవాలని అనుకుంటే.. మీ నెగెటివ్‍ థింకింగ్‍ కారణంగా ‘అది మనకు దక్కదు’ అనే అభిప్రాయం స్థిరపడిపోతుంది. దీంతో దానిని దక్కించుకునే ప్రయత్నాన్ని మీరు సవ్యంగా సాగించలేరు.
మీరు సంతోషంగా లేనని తలుస్తుంటే కనుక, సంతోషం కలిగే సందర్భాలు ఎదురైనా కూడా.. అప్పటికే ‘నేను ఎప్పటికీ సంతోషంగా లేను’ అనే పోగ్రామింగ్‍ను మెదడుకు చేరవేసేసినందుకు సంతోషం కలిగినా దానిని అనుభవించలేరు. సంతోషంగా ఉండాలని ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతారు.
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు పోగ్రామింగ్‍ వంటివి. ఈ పోగ్రామింగ్‍లో పాజిటివ్‍ యాటిట్యూడ్‍ సాధించగలిగితే కచ్చితంగా ప్రతీ క్షణం మీరు చాలా అద్భుతమైన రిజల్టస్ను పొందగలుగుతారు.
అంటే, మనల్ని మనం బ్లేమ్‍ చేసుకోవడం తగ్గించుకోవాలి. ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని మెదడుకు ఎక్కించుకుని కుంగిపోవడం తగ్గించాలి.

మన ఆలోచనలు, తలంపుల ద్వారా మనం ఎంత నెగెటివ్‍ ఎనర్జీని లోపలకు పంపిస్తే అంత నెగెటివ్‍ అవుట్‍పుట్‍ బయటకు వస్తుంది. సరిగ్గా ఎంత ఆశావాహ దృక్పథాన్ని లోనికి పంప్‍ చేస్తే అంత పాజిటివ్‍ అవుట్‍పుట్‍ బయటకు వస్తుంది.
ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం.
కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సరదాగా ఏర్పాటు చేసుకున్న ఓ గేదరింగ్‍ కార్యక్రమానికి లేదా ఏదైనా ఫంక్షన్‍కు వెళ్లారనుకుందాం. అయితే, అక్కడ అందరితో కలవలేక ఓ మూలన కూర్చుండిపోయారనుకుందాం. అప్పుడు అక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తారు. మీరు మాత్రం ‘నేను ఒక్కడినే సంతోషంగా లేను’ అనే భావనతో ఉంటారు. మనం ఒక్కరమే ఒంటరిగా ఉన్న ఫీలింగ్‍ కలుగుతుంది. అయితే, ఆ ఒంటరితనాన్ని వీడి.. మీరు కూడా అక్కడున్న అందరితో కలిసిపోతే. కలివిడిగా కబుర్లు చెప్పి అందరితో సరదాగా ఉండగలిగితే మీరే అక్కడ ఒక సెంటర్‍ ఆఫ్‍ అట్రాక్షన్‍గా మారిపోతారు. అటువంటి వేడుకలు, ఇతరత్రా పదిమందీ కలిసే కార్యక్రమాల్లో అరమరికలు మరిచిపోవాలి. మనకు తగ్గ వారు తప్పకుండా ఏ కొందరే ఉండి ఉంటారు. వారితో గడపాలి. ‘అక్కడున్న అందరిలో కనిపిస్తున్న సంతోషం నాలోనూ ఉంది’ అనుకుని దూసుకుపోగలిగితే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్‍ అయిపోతారు.
దీనిని బట్టి అర్ధమయ్యేదేమిటంటే- జీవితంలో ప్రతి క్షణం, ప్రతి సిట్యుయేషన్‍ను ఎలా లీడ్‍ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలాంటి ఛాయిస్‍ తీసుకుంటే జీవితం అలా ఉంటుంది.

పోగ్రామింగ్‍ ట్రాప్‍ అనే మరో అంశం ఒకటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు, అనుభవాలు ఏమైనా మన మెదడు డేటాబెస్‍లో ఉన్నాయేమోనని మన మెదడు చకచకా స్కానింగ్‍ చేసేస్తుంది. ఉదాహరణకు రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే, గతంలో ఎప్పుడో ఒకరోజు సాయంత్రం టీ తాగలేదని అనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది. అలవాటు కొద్దీ టీ తాగకపోవడం వల్లే తలనొప్పి వచ్చిందని మీరు ఫిక్స్ అయిపోతారు. మర్నాడు కూడా మళ్లీ మీరు టీ తాగలేదని అనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకున్నా.. ముందురోజు కలిగిన అనుభవంతో టీ తాగకపోవడం వల్లే మళ్లీ తలనొప్పి వచ్చిందని మీరు భావిస్తారు. దీంతో బ్రెయిన్‍ ఆ కండిషన్‍కు ఓ రిజల్ట్ను మ్యాచ్‍ చేసుకుని ఆ అవుట్‍కమ్‍నే రప్పిస్తుంది. ఇక్కడ కండిషన్‍ ఏమిటంటే- టీ తాగలేదు.
రిజల్ట్ ఏమిటంటే- తలనొప్పి రావాలి. కాబట్టి మీకు తలనొప్పి వచ్చే అవకాశం లేకున్నా డేటాబేస్‍లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్‍ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పిని సృష్టిస్తుందన్న మాట. సో.. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని, కండిషన్‍ను, ప్రతి రోజునూ, ప్రతి క్షణాన్నీ కొత్తగా చూస్తే, దాని పట్ల కొత్తగా రెస్పాండ్‍ అవుతూ ఉంటే, బ్రెయిన్‍ డేటాబేస్‍లోని పాత రికార్డులూ, పనికిమాలిన జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. జీవితం కొత్తగా ఉంటుంది. ఇప్పుడే జీవితాన్ని కొత్తగా ప్రారంభించినంత తాజాగా ఉంటాం.
అందుకే- జీవితం అందమైనది.
ఆనందంగా జీవించాలి.
ఎందుకంటే- మనకున్నది ఒక్కటే జిందగీ!.

Review ఉన్నది ఒక్కటే జిందగీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top