ధర్మోపదేశకుడు ఉతథ్యుడు

రుషులు మన అర్ష్య ధర్మానికి ఆద్యులు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నెన్నో తప, యాగ, అధ్యయన ఫలాలుగా వారు మనకు ఒసగినవే. అందుకే మన మహర్షులు వివిధ అంశాలలో మనకు దారి చూసే మార్గదర్శకులు. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం.

బహ్మదేవుడు మనసు నుంచి మానస పుత్రులు పుట్టారనే విషయం తెలిసిందే. మనసు నుంచి పుట్టారు కాబట్టే వారికి మానస పుత్రులనే పేరు వచ్చింది. ఈ మాసన పుత్రుల్లో మూడవ వాడైన అంగిరస మహర్షి కొడుకు పేరు ఉతథ్య మహర్షి. అంగిరసుడికి ఈయన పెద్ద కొడుకు.
ఉతథ్య మహర్షి గొప్ప తన సంపన్నుడు. నెమ్మదయిన వాడు. తీర్థయాత్రలు చేయడం అంటే చాలా ఆసక్తి, శ్రద్ధ ఉన్నవాడు. ఉతథ్య మహర్షి భారయ పేరు మమత. వారికి సంతానం కలగగానే ఉతథ్యుడు తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.
అంతలో మరోపక్క దేవతలు వివిధ యుద్ధాలలో రాక్షసులను ఓడించి వారిని కష్టాలు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో రాక్షసులంతా కలిసి తమ గురువైన శుక్రాచార్యుడికి విషయం చెప్పి, తమను రక్షించాలని వేడుకున్నారు. శుక్రాచార్యుడు వారిని దేవతల బారి నుంచి రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. యుద్ధానికి అవసరమైన అస్త్రాలు, శస్త్రాలు తీసుకుని వస్తానని చెప్పి శివుడి గురించి తపస్సు చేయడానికి వెళ్లాడు.
ఇదే అదనుగా దేవతల గురువైన బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందరినీ తన వశం చేసుకున్నాడు. అంతలో తపస్సు ముగించుకుని వచ్చిన శుక్రాచార్యుడు అసలు విషయం గ్రహించి ధర్మం తప్పుతావని బృహస్పతిని శపించాడు.
ఒకసారి బృహస్పతి తన అన్న ఉతథ్య మహర్షి ఇంటికి వెళ్లాడు. వదిన మమత ఆయనను ఆదరించి భోజనం పెట్టింది. బృహస్పతి శుక్రాచార్యుడి శాప ప్రభావంతో వావివరస, మంచితనం, ధర్మం మరిచిపోయి వదిన గారితో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఫలితంగా మమతకు ఒక కుమారుడు కలిగాడు. కానీ, అప్పటికే ఆమె కడుపులో ఉన్న బిడ్డ బృహస్పతి శాపం వల్ల గుడ్డివాడు అయ్యాడు.
ఉతథ్య మహర్షి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చి జరిగినదంతా తెలుసుకున్నాడు. ఇదంతా శుక్రాచార్యుడి శాప ప్రభావం వల్లనే జరిగిందని భార్య మమతను ఓదార్చాడు.
కొంతకాలం తరువాత మాంధాత అనే చక్రవర్తి ఉతథ్య మహర్షికి శిష్యుడై రాజనీతి గురించి ఆయన ద్వారా తెలుసుకున్నాడు. మాంధాతకు ఉతథ్యుడు బోధించిన రాజనీతి సంగ్రహమే- ఉతథ్యగీతగా ప్రసిద్ధి పొందింది.
‘ఉతథ్య గీత’ రాజధర్మాన్ని బోధిస్తుంది. రాజధర్మం అంటే రాజు అనే వాడు ప్రజలతో ఎలా ఉండాలి?, ధర్మాన్ని ఎలా నిలపాలి? అనేది తెలియచేస్తుంది.
రాజు ధర్మవర్తనుడైతేనే ఆ దేశంలోని ప్రజలు నిశ్చింతగా, భయం లేకుండా ఉంటారు. ధర్మం వేదవిదుల వల్ల కలిగింది కాబట్టి రాజు ఎప్పుడూ వేదవిదులను పూజించాలి, గౌరవించాలి.
అసూయ, దురభిమానం ఉన్న రాజు వద్ద, ఆ రాజు పాలించే దేశంలోనూ లక్ష్మీదేవి ఉండదు.
నాలుగు వర్ణాల వారు ఎవరి ధర్మం వారు చేస్తున్నారా? లేదా? అనేది రాజు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి.
శూద్రుడికి సేవ, వైశ్యుడికి కృషి, క్షత్రియుడికి దండనీతి, బ్రాహ్మణుడికి బ్రహ్మచర్యం, తపస్సు చేయడం, నిజం పలకడం ధర్మాలు.
ప్రజలు దీనంగా వేడుకుంటున్నపుడు కూడా రాజు దగ్గర ఉండే ఉద్యోగులు కఠినంగానూ, ధనాశతోనూ ప్రవర్తించకూడదు.
ఏ రాజ్యంలో ప్రజలు ధర్మంగా ఉంటారో ఆ రాజు కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది.
తప్పు చేసింది కొడుకైనా సరే రాజు క్షమించకూడదు.
సాధువులను పూజించడం, ఎప్పుడూ నిజాన్నే మాట్లాడటం, భూదానాలు చేయడం, అతిథులను గౌరవించడం వంటివి రాజు చేయాల్సిన నిత్య ధర్మాలు.
ధర్మాత్ముడైన రాజు ఇంద్రుడితో సమానం. ఇలాంటి రాజును దేవతలు, రుషులు, గంధర్వులు కూడా కీర్తిస్తారు.
ఇటువంటివే మరెన్నో రాజధర్మాలను గురించి మాంధాత మహారాజుకు ఉతథ్య మహర్షి బోధిస్తాడు.
ఈ కారణంగానే ఉతథ్య మహర్షి ధర్మోపదేశకుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు.

Review ధర్మోపదేశకుడు ఉతథ్యుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top