కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. ‘కాకి చిరకాలమున్న నే కార్యమగును?’ అనే పద్యం చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు. ‘లోకులు పలుగాకులు’ అనే సామెత కూడా ఒకటి ఉంది. ఈ విధంగా మనం కాకులను తక్కువ చేస్తూ మాట్లాడుకుంటుంటాం. కానీ, కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మనింటికి చుట్టాలు వస్తారని అర్థం. చనిపోయిన వాళ్ల మనసుల్లో ఏమైనా తీరని కోరికలు ఉంటే కాకులు పిండాలను ముట్టవు. అప్పుడు మనం చనిపోయిన వాళ్ల కోరికలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తాం.
కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి.
శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్లు తెరిచింది. కాకమ్మ తల్లిదండ్రులు చాలా ప్రజ్ఞావంతులు. ఎండు పుల్లలూ, చీపురు పుల్లలూ, రకరకాల ఈకెలు పెట్టి అందంగా గూడు కట్టడం వారికి తెలుసు.
పుట్టినప్పుడు కాకమ్మ ఏమంత అందంగా ఉండేది కాదు. ఈకలు లేని శరీరం, బోడి తలా, తల కన్నా పెద్ద ముక్కూ.. దాన్ని చూస్తే ఎవరికైనా నవ్వు వచ్చేది. కానీ, మనం కాకి పిల్లలను చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవికారంగా కనిపించినా, కాకి పిల్ల కాకికి ముద్దు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే కదా!.
కాకమ్మకు ముగ్గురు తోబుట్టువులు. ఇద్దరు అన్నదమ్ములూ, ఒక చెల్లెలూ ఉండేవారు. ఇంతమందినీ పెంచుకురావడం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో ఇద్దరు మరీ ఆశాపాతకులు. వారిద్దరూ తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికన్నా ముందు అందిపుచ్చుకుని కాజేసే వారు. మిగతా పిల్లలకు ఇది కష్టంగా ఉండేది. అందరి కన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి.
ఒకరోజు వాళ్లిద్దరూ ‘కూ’ అని అరిచారు. వాళ్లు కాకులు కారనీ, కోయిలలనీ కాకమ్మ అమ్మానాన్నలకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్దీ వెంటబడి తరిమాడు కానీ, ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన ముఖం చేత వాటిని వదిలిపెట్టాలని చెప్పి తన భర్తను శాంతపరిచింది.
కాకి పిల్లలు మెల్లిగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కన ఉన్న చెట్ల మీదికీ, ఇంటి కప్పుల మీదికీ ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలను తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు. తల్లిదండ్రుల వెంట కాకమ్మ తిండి వేటకు బయలుదేరింది.
ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండు కుక్క ఉంది. రోజూ దాని యజమాని దానికి ఉడకబెట్టిన ఎముకలు పెడుతుండే వాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టకుండా నౌకరు చేత పెట్టించాడు. అందుకని ఆ కుక్క అలిగి నేల మీద పొర్లాడసాగింది.
కాకమ్మా, వాళ్ల అమ్మా, నాన్నా ఇంటి చూరు మీద నుంచి ఇదంతా చూస్తున్నారు. కాకమ్మ తండ్రి ‘కా.. కా’ అని అరిచాడు. కుక్క ఆ అరుపులకు వాళ్లకేసి నిర్లక్ష్యంగా చూసింది.
కాకమ్మ తల్లి ‘కా.. కా.. కా..’ అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మొరిగింది. మళ్లీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసుగెత్తింది. ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి మళ్లీ ‘కా..’ అని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది. కాకమ్మ రివ్వున వాలి, కుక్క దగ్గర ఉన్న ఒక ఎముకను అందుకుని, మళ్లీ వచ్చి తల్లిదండ్రులను చేరుకుంది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడి గారింటికి చేరుకున్నాయి.
కాకమ్మ తల్లిదండ్రులు బండరాముడిని బాగా ఎరుగుదురు. వాడి దగ్గర వాళ్లు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాడిని ఎన్నిసార్లో ఏడిపించారు. బండరాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్లింట్లో మాంసం వండుకోరు.
ఆవేళ రాముడు వాళ్ల ఇంటి పంచలో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ల అవ్వ పళ్లెంలో అన్నం పెట్టుకుని మనవడికి వడ్డించడానికి వంటింట్లో నుంచి బయటకు వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ తన నోట్లో ఉన్న ఎముకను కాస్తా జారవిడిచింది. అది ఖర్మం చాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్లెంలో పడింది.
‘ఈ కాకులు పడిచావా! కంచెడు అన్నం గంజి గుంటలో పొయ్యాల్సి వచ్చిందే!’ అని అవ్వ తిట్టుకున్నది.
అవ్వ చాలా చెడ్డది. అసలే రేషను రోజులు కదా! అటువంటప్పుడు వృథాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేది ఏ కాకులకో వేయక గంజి గుంటలో పారేస్తారా?. ఎముకలంటే అవ్వకు అంత లోకువా?.. కాకులు ఇలా అనుకుంటుండగా, అవ్వ గంజి గుంటలో అన్నం పడేసేందుకు వెళ్లసాగింది.
ఇదే అదనుగా కాకమ్మ, దాని అమ్మానాన్నలు అవ్వ వంటింట్లోకి దూరడానికి ప్రయత్నం చేయసాగాయి. అవ్వ అలా బయటకు వెళ్లగానే కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంటింట్లో నుంచి ఆ వాసన వస్తుందని పసిగట్టిన కాకులు అందులోనికి చొరబడి ఒక గారెను నోటకి కరుచుకుంది. ఇంతలో తలుపు దబాలున మూసిన చప్పుడైంది.
బండరాముడు, ‘అవ్వా! కాకి వంటింట్లోకి దూరింది. దబ్బున రా.. దబ్బున రా’ అని కేకలు పెట్టాడు.
‘చంపు.. చంపు’ అని తిరిగి కేక పెట్టింది. అవ్వ.
కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరుగెత్తి పోయి కాకమ్మను చంపడానికి పెద్ద గడ తెచ్చాడు. అది పట్టుకుని లోపలికి వచ్చి మళ్లీ తలుపు మూసేశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలోని గడ నుంచి తప్పించుకోవడానికి అటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడను బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. ఆ దెబ్బకు అటక మీద ఉన్న జాడీలు కిండపడి పగిలిపోయాయి.
‘ఏం చేస్తున్నావురా బండ వెధవా? చాల్లే నీ కాకి వేట’ అని అవ్వ బయటి నుంచి లబల•లాడుతూ వచ్చింది.
‘ఈసారి చూడు అవ్వా! ఈ కాకిని ఏం చేస్తానో’ అని అరిచాడు బండరాముడు.
ఈసారి వాడు కొట్టిన దెబ్బకు పొయ్యి మీద ఉన్న బూరెల మూకుడుకు తగిలి నెయ్యి యావత్తూ పొయ్యిలో పడి భగ్గున మంటలు లేచాయి.
బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో నుంచి కాకమ్మ బయటకు జారుకుని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముడిని దబదబా బాదడాన్ని కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి.
‘ఆ పిల్లాడు నిన్నంట లేదు కదా! ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలపడుతుంది. మైలపడిన కాకిని ఎవరూ పెళ్లాడరు’ అంది కాకమ్మ తల్లి.
‘లేదమ్మా! నన్ను ఆ అబ్బాయి తాకలేదు’ అంది కాకమ్మ తల్లితో.
ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడికి పడితే అక్కడికి పోసాగింది.











































































































































































Review కాకమ్మ కథ.