జార్జియాలో మన తెలుగు ఉగాది వెలుగు

మన తెలుగుకు గొప్ప గెరవం దక్కింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని జార్జియా రాష్ట్రం.. మన తెలుగు పర్వదినమైన ‘ఉగాది’కి అరుదైన గుర్తింపు, గౌరవం లభించాయి. రాష్ట్ర గవర్నర్‍ బ్రయన్‍ పి.కెంప్‍.. ‘తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది పండుగను గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

మన తెలుగు జార్జియాలో వెలుగొందడం వెనుక ఎంతో కృషి ఉంది. 1980 నుంచి అట్లాంటా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం నాడు పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష విశిష్టతను, తెలుగు సంప్రదాయాలను ఈ సందర్భంగా అందరికీ తెలియజెప్పేలా పలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జార్జియాలో తెలుగు భాషకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా ప్రముఖ జర్నలిస్టు రవి పోణంగి, పలువురు తెలుగు భాషాభిమానులు జార్జియా యంత్రాంగం దృష్టికి తెలుగు భాష, సంస్క•తుల గురించి నివేదించారు. నేడు వారంతా చేసిన కృషికి దక్కిన గౌరవమే.. ఉగాది పండుగ జార్జియాలో ‘తెలుగు భాష, వారసత్వ దినం’గా ఎంపిక కావడం. వారందరి వినతి మేరకు జార్జియా గవర్నర్‍ కెంప్‍ తెలుగును గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రాచీన భాష మన తెలుగు
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనది తెలుగు భాష. భారత ప్రభుత్వం 2008, అక్టోబర్‍ 3న తెలుగును ప్రాచీన దేశ భాషగా గుర్తించింది. ఈ భాషలో వచ్చిన సాహిత్యం ప్రపంచంలోని మరే భాషలోనూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాషలలో తెలుగు పదిహేనవ స్థానంలో ఉంది. భారతదేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడేది తెలుగు భాషనే. ఇక, ప్రపంచ భాషల గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 9.3 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది. ఇటలీలోని వెనిస్‍కు చెందిన వర్తకుడు నికొలొ డా కాంటే.. 15వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించినపుడు.. తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్‍ భాషను పోలి ఉన్నాయని గుర్తించారు. తెలుగు భాషలోని పదాలు అచ్చు అంతాలు కలిగి (అజంతాలు) ఉన్నాయని గుర్తించిన ఆయన తెలుగును ‘ఇటాలియన్‍ ఆఫ్‍ ది ఈస్ట్’ (ప్రాచ్యదేశపు ఇటాలియన్‍ భాష)గా వర్ణించారు.

పపంచమంతా తెలుగు వెలుగులు
11వ శతాబ్దం ప్రాంతంలో ఆదికవి నన్నయ రచించిన మహా భారతం తెలుగులో మొట్టమొదటి సాహిత్య కావ్యమని అంటారు. అయితే ఇంతటి బృహత్తరమైన కావ్యం నాడు రూపుదిద్దుకుందంటే.. అంతకుముందే తెలుగు భాష సాహిత్యం ఉండే ఉంటుంది. అయితే, అది బహుశా గ్రంథస్తం కాకపోయి ఉండవచ్చు. శాసనాల్లో లభించిన మొదటి తెలుగు పదం ‘నాగబు’.
ఇక, ఆంధప్రదేశ్‍, తెలంగాణ రాష్ట్రాలలో 2001 గణాంకాల ప్రకారం దాదాపు 7.4 కోట్ల మందికి తెలుగే మాతృభాష. ఇది తెలంగాణ, ఆంధప్రదేశ్‍ రాష్ట్రాలలో అధికార భాషగా ఉంది. పశ్చిమబెంగాల్‍, అండమాన్‍ నికోబార్‍ దీవుల్లో కూడా అదనపు అధికార భాషగా మనగలుగుతోంది. ఛత్తీస్‍గడ్‍, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్‍ రాష్ట్రాలలో ప్రాంతీయ భాషగా ఉంది. ఇంకా భారతదేశంతో పాటు బహ్రెయిన్‍, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్‍, సింగపూర్‍, దక్షిణాఫ్రికా, యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్థానిక భాషగా వాడుకలో ఉంది.

తెలుగు ఎంతో గొప్పది
జార్జియాలో తెలుగు భాష, వారసత్వ దినంగా ఉగాది పండుగను గుర్తిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్‍ కెంప్‍ ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘అత్యంత పురాతన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యం, గుర్తింపు ఉన్నాయని, తెలుగులో ఎంతో సాహిత్యం ఉంద’ని కొనియాడారు. ఈ సందర్భంగా జార్జియాలో ఉగాదికి గుర్తింపు లభించడానికి కృషి చేసిన రమేష్‍ వల్లూరికి ధ్రువపత్రాన్ని ఏప్రిల్‍ 12న జరిగిన కార్యక్రమంలో అందచేశారు. గవర్నర్‍ కెంప్‍ ప్రకటనపై జర్నలిస్టు రవి పోణంకి సంతోషం వ్యక్తం చేశారు.

జార్జియా బడుల్లో తెలుగు బోధన
తెలుగు భాషకు లభించిన గొప్ప సత్కారాలలో .. ‘ఉగాది తెలుగు వారసత్వ దినం’గా జార్జియా రాజముద్ర లభించడం. ఇకపై, జార్జియాలో తెలుగు భాష పాఠశాలల్లో ఒక మాధ్యమంగా ఉండనుంది. తెలుగు భాషను విద్యాసంస్థల్లో బోధించడానికి వీలు ఏర్పడింది. ఈ సందర్భంగా తెలుగును వారసత్వ దినంగా గుర్తించిన జార్జియా గవర్నర్‍కు అట్లాంటా తెలుగు సంఘం ‘అంతర్జాతీయ తెలుగు దీప్తి’ అనే బిరుదునిచ్చి సత్కరించింది.

Review జార్జియాలో మన తెలుగు ఉగాది వెలుగు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top