డొనాల్డ్ ట్రంప్‍ గెలుపు తర్వాత

ప్రజాస్వామ్య అమెరికా ప్రపంచానికి ఒక పెద్ద షాక్‍ ఇచ్చింది. నేటి వరకు అమెరికా చెబుతున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, నైపుణ్యాలు కలిగిన వారికి స్వాగతం, తారతమ్య బేధాలు లేకుండా అక్కున చేర్చుకోవడం అనే మూల సూత్రాలకు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిని దేశాధ్యక్షుడిగా ఎంచుకుంది.
నేడు డొనాల్డ్ ట్రంప్‍ అమెరికా అధ్యక్షుడు. జనవరి చివరి వారం నుంచి ఒక కొత్తరకం పాలన అమెరికా చవి చూడనుంది.
రిపబ్లిక్‍ పార్టీ పెద్దలు వ్యతిరేకించారు. మీడియా మొత్తం డెమోక్రటిక్‍ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‍దే విజయం అంటూ ముందుగానే ప్రచారం చేసింది. పత్రికల వారు తొందరపడి హిల్లరీ కవర్‍ పేజీతో కథనాలు ప్రింట్‍ చేసుకున్నారు. కాని అమెరికన్‍ ప్రజలు మాత్రం అందరి అంచనాలు తారుమారు చేస్తూ డొనాల్డ్ ట్రంప్‍నే గెలిపించారు. అమెరికన్‍ అధ్యక్ష పదవి ఎన్నికల విధానం మీద నమ్మకం లేదన్న వ్యక్తి, అమెరికా అధ్యక్ష పదవిలో రిగ్గింగ్‍ జరుగుతోందని ఆరోపించిన వ్యక్తి ఇప్పుడు తన ఎన్నిక తిరుగులేదని, ప్రజలు అంగీకరించాలని కోరుతున్నాడు. తన మంత్రివర్గ కూర్పుమీద దృష్టిపెట్టాడు.
్ర•ంప్‍ మా అధ్యక్షడు కాదని వీధుల్లోకి ప్రజలు వచ్చినా, డొనాల్డ్ని అధ్యక్షుడిగా గుర్తించమని నినాదాలు చేసినా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, ఓడిపోయిన అభ్యర్ధి హిల్లరీ గుర్తించిన తర్వాత ప్రజలు చేసిన నిరసనల్లో పసలేదు.
డొనాల్డ్ ట్రంప్‍ను నాలుగేళ్లు అధ్యక్ష పదవిలో ఉండనిస్తారా! లేక మార్చిలో పదవీచ్యుతిడిని చేస్తారా! అనేది అమెరికన్‍ ప్రజల ఇష్టం. రిపబ్లికన్‍ పార్టీ పెద్దల ఇష్టం. అయితే అమెరికాది ప్రపంచంలో పెద్దన్న పాత్ర. అటువంటి పాత్రను తెగ ముచ్చటపడే డొనాల్డ్ ట్రంప్‍ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో లేవనెత్తిన అంశాలు, తాము చేస్తామని ప్రకటించిన వాగ్దానాలను సహజంగానే ఇతర దేశాలు నిరసించగా పరిశీలించి, తగు జాగ్రత్తలు తమ దేశం తరపున చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాతో వ్యవహరించే తీరులో ఎలాంటి మార్పులు చేసుకోవాలో అనే ఆలోచనలు పడ్డాయి.
ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రేనన్నది ముందుగానే తెలిసిన విషయం. హిల్లరీ గెలిస్తే అమెరికా తొలి మహిళా అద్యక్షురాలయ్యేది. ట్రంప్‍ గెలవడం ద్వారా అమెరికా పాలనా విధానంలో ఏ చిన్నపాత్రని నిర్వహించని వ్యక్తి నేరుగా వైట్‍హౌస్‍కి చేరడం కూడా చరిత్రే. సెనెటర్‍గా, గవర్నర్‍గా పని చేయలేదు ట్రంప్‍. ఒక విధాన రూపకల్పనలో పాలుపంచుకోలేదు. పాలనా పరంగా ఒక్క రోజు అనుభవం లేదు. ఆయనకున్న అనుభవం రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారంలో, నిర్మాణ రంగంలో. ఒక రోజు రాజ్యం నడిపించడానికి, ప్రపంచాన్నంతటిని శాసించడానికి ఆ అర్హతలు సరిపోతాయా ! సరి పోతాయని అమెరికా ప్రజలు భావించారు. అందుకే గాలిలో వేసి గుద్దులు గుద్దుతూ ప్రచారం చేసిన డొనాల్డ్ ట్రంప్‍ను ఇప్పుడు అమెరికా విధానాల మీద, ప్రపంచ రాజకీయ వేదికల మీద తనదైన పిడికిలి ముద్ర వేసేందుకు సిద్దంగా ఉన్నాడు.
ప్రపంచ రాజకీయాల గురించి డొనాల్డ్ ట్రంప్‍కు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలీదు. దౌత్య సంబంధాలు నిర్మించడం, దౌత్యవ్యహారాలు చేయడంలో పరిమితమైన పరిజ్ఞానం ఉన్నవారే ట్రంప్‍ చుట్టూ ఉన్నారు. అధ్యక్షుడిలోనే పరిపక్వత కరువైనప్పుడు ఆయన సలహాదారులుగా తనకన్నా మెరుగైన వారిని నియమించుకోవడం సాధ్యం కాదు.
డొనాల్డ్ ట్రంప్‍కు తెలిసింది ‘తనవాడు’, శత్రువు అనేదే. మధ్యస్థంగా వ్యవహరించడం తెలియదు. రాజీ మార్గం అంటే ఏంటో అవగాహన లేనివాడు. మాటలను తూటాలుగా పేల్చడం తప్పించి గాయపడిన మనసులకు స్వాంతన చేకూర్చగలిగిన మాటలు ట్రంప్‍కు అలవాటు లేదు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్ష పదవికి ఏడు సార్లు ఎన్నికలు జరిగాయి. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మార్చి, మార్చి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాని స్ధిరపడిన అమెరికా విదేశాంగ విధానాలలో అంతగా మార్పు రాలేదు. ప్రపంచం మొత్తానికి ఒకేరకమైన భరోసా ఇచ్చే దేశంగా అమెరికా వ్యవహరించింది. అమెరికా పెత్తందారీ వ్యవస్థను సవాలు చేసిన సోవియట్‍ యూనియన్‍ విచ్ఛిన్నమైంది. ఆర్ధికంగా చితికిపోయిన రష్యా తనదైన వైభవాన్ని తిరిగి సాధించుకునే యత్నం చేస్తున్నది. కమ్యూనిజం తిరిగి వస్తుందన్న ఆశలు రష్యన్‍ నేతల్లో లేవు. కానీ ఆమెరికన్లను సవాలు చేయాలని, నిలువరించాలన్న ఆలోచనలు మాత్రం స్ధిరంగా ఉన్నాయి.
అమెరికాలోని పరిశ్రమలన్నీ చైనాకు తరలిపోతే, అమెరికాలో మిగిలిన ఉద్యోగాలు చేసేందుకు మిలిగిన దేశాలవారు వచ్చారు. ప్రపంచంలో కె 2 కే సమస్య విదేశీయులకు స్వాగతం పలికితే ఆ తర్వాత విదేశీయుల సమర్ధత, నైపుణ్యం నచ్చి అమెరికన్లు పిలుచుకున్నారు. అమెరికన్‍ సంస్థలన్నింటిది లాభాపేక్ష. ఆసియా ఖండం యువతతో తక్కువ జీతాలకు పనిచేయిస్తూ లాభమనిపించింది.
ప్రపంచీకరణలో తాను ఆశించిన దిశలోనే కాక వ్యతిరేకదిశలో కూడా సాగుతుందనే విషయం అమెరికాకు ఆలస్యంగా అర్ధమైంది. దీని నుంచి బయటపడాలంటే కళ్ల ఎదురుగా కనిపిస్తున్న విదేశీయులను బయటకు పంపి వారి ఉద్యోగాలను సొంతం చేసుకోవాలి. అలా చేయించే మొనగాడిగా డొనాల్డ్ ట్రంప్‍ని చూస్తున్నారు.
ట్రంప్‍ తాను చెప్పిన వన్నీ చేయగలడా! మెక్సికన్‍ సరిహద్దుల్ని మూసేసి గోడకట్టగలడా ! అక్రమంగా అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ ఏరివేసి బయటకు పంపించడం సాధ్యమా! చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలను సాధించే నిర్ణయం చేసుకోగలడా ! ఇస్లాం ఉగ్రవాదం పేచమణిచే దాడులు ప్రారంభిస్తాడా ! ఇవన్నీ ఒక్కసారిగా చేయగలడా ! దీనిలో ఏది ఆయన ప్రాధాన్యతా అంశంగా చేసుకుంటాడనే దానిని బట్టి ప్రపంచం డొనాల్డ్ ట్రంప్‍ను అంచనా వేస్తుంది.
భారతదేశం డొనాల్డ్ ట్రంప్‍ని భిన్న కోణాల నుంచి గమనిస్తున్నది. మొదటిది విదేశాల నుంచి వచ్చేవారి మీద ఆంక్షలు విధిస్తానన్న ప్రకటనను ట్రంప్‍ సీరియస్‍గా అమలు చేయలేడన్నది భారతీయుల నమ్మకం. రెండోది చైనాతో ట్రంప్‍ ఎలా వ్యవహరిస్తాడన్నది. మరోవైపు చైనా విస్తరణకు పథకాలు సిద్దం చేసుకుంది. చైనాను ఒంటరిగా ఎదుర్కోలేని భారత్‍.. అమెరికా, •పాన్‍ల మద్దతు ఆశిస్తోంది. ఆసియాఖండంలో చైనా వ్యతిరేకదేశాలను ఏకం చెయ్యడం అమెరికా చేస్తుందన్నది భారత్‍ ఆశ.
ఉగ్రవాద అంశంలో పాకిస్థాన్‍ను ఏకాకిని చెయ్యాలన్న నరేంద్రమోదీ ప్రభుత్వ ఆలోచనకు డొనాల్డ్ ట్రంప్‍ మద్దతు పలుకుతాడో లేదో తెలీదు. గడచిన రెండున్నరేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ, బరాక్‍ ఒబామాతో స్నేహాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‍ గెలిచాడు. మళ్లీ కొత్తనేత, కొత్త ఆలోచనలు, తిరిగి మొదటి నుంచి స్నేహం మొదలు పెట్టాలి. ఇదీ భారత్‍ ఇబ్బంది.
అంతర్లీనంగా చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్‍ విజయం ఒకరకంగా అమెరికా దిగజారుడికి తొలిమెట్టు. జనాభాపరంగా, నైపుణ్యాల పరంగా అగ్రరాజ్యాలైన చైనా, భారత్‍లదే భవిష్యత్తు. అయితే ఈ రెండు దేశాలు ఏకాభిప్రాయంతో లేకపోవడమే అసలు సమస్య. ఒకరినొకరు పోటీదారులుగా కాక, ఐక్యంగా ప్రపంచాన్ని శాసించగలమన్న భావన భారత్‍, చైనా నేతలలో తేగలిగితే అమెరికాని సవాలు చేయడం అంతపెద్ద సమస్యకాదు. ఆస్థాయికి ఈ రెండు దేశాలు వస్తే అగ్రరాజ్య అమెరికాకి చివరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‍ చరిత్రలో నిలిచిపోతాడు.

Review డొనాల్డ్ ట్రంప్‍ గెలుపు తర్వాత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top