తెలుసుకుందాం…!

ఆడపిల్లలకు చెవులెందుకు కుట్టిస్తారు?
ఆడపిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీదేవిలా తలచుకొని, మురిసిపోతారు. ఇలా చేయడం వెనుక ఆరోగ్యరహస్యం కూడా ఉంది. చెవులు కుట్టించుకుంటే కంటిచూపు శక్తి పెరుగు తుంది. ఆక్యుపంక్చర్‍ వైద్య విధానం ప్రకారం.. చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.
పండగ రోజుల్లో, పుణ్యరోజుల్లో ఉల్లిపాయను తినకూడదా ?
పుణ్య రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా, ప్రశాంతంగా మనస్సూ, శరీరమూ భగవంతుని మీదే లగ్నం చేయాలి. అలా ఉంచాలంటే ఉల్లిపాయను తినకూడదు. ఉల్లిపాయలో ఉత్తేజం చేసే శక్తి ఉంది. నిగ్రహాన్ని సడలించేలా చేస్తుంది. అందుకే వాటిని ఆ రోజుల్లో దూరంగా ఉంచాలి.
ఆవు ముఖాన్ని చూడకూడదంటారు ఎందుకని?
శివలింగం ముందుభాగాన్ని బ్రహ్మదేవుడూ, చివరి భాగాన్ని శ్రీమహావిష్ణువు చూసి రావాలని ఒకసారి పందెం వేసుకున్నారు. దేవతల సాక్షిగా ఇద్దరూ బయల్దేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్లినా శివలింగం ముందు భాగం కనిపించలేదు. విష్ణువుకు చివరిభాగం కన్పించలేదు. బ్రహ్మదేవుడికి మార్గం మధ్యలో దేవలోకపు గోవూ, మొగలి చెట్టూ కన్పిస్తాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్టు దేవతలకి సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందుభాగం చూశారని సాక్ష్యం చెబుతాయి. దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడ్నే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవూ, మొగలిపువ్వు అబద్ధం చెప్పాయని చెబుతుంది. దీంతో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి పూజలుండవనీ, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలిపువ్వు పూజకు పనికిరాదనీ, గోవు ముఖం చూస్తే దోషమని శాపమైంది.
బట్టలుతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా? కాదా?
ఒక విధంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా కొందరు ఆడాళ్ళు కాళ్లపై పోసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల పుట్టింటికి అరిష్టమే! ఆడవాళ్ళు ఎక్కువ సమయం నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకూ, చేతులకూ పగుళ్లొస్తాయి. నూటికి తొంభై మంది మధ్యతరగతి వారి లోను, ఆ కింద తరగతి స్త్రీలలో కచ్చితంగా కాళ్ళపగుళ్ళు ఏర్పడతాయి. వారిలో పదిశాతం చదువుకున్న, లేదా అందం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోని స్త్రీలు బట్టలుతికిన నీటిని, మలినమైన నీటిని కాళ్ళపై పోసుకోవటం ద్వారా ఎన్నో క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యాన్ని కలగచేస్తాయి. అప్పుడు అస్వస్థతకు గురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు.
మూడు విషయాల్లో మొహమాటం పనికిరాదంటారు. ఏమిటవి?
1వది డబ్బు- ఇక్కడ కనుక మొహమాట పడితే డబ్బు పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారినీ ఇబ్బందులలో పడవేయవలసి వస్తుంది. 2వది భోజనం… ఇక్కడా కూడా మొహమాటపడితే మాడేది తన కడుపే. 3వది శృంగారం… ఇక్కడ సిగ్గుపడితే శృంగార, సరసాల్లో అసలైన ఆనందాన్ని చేజార్చుకున్నావారు అవుతారు. కనుక ఈ మూడు విషయాల వద్ద అస్సలు మొహమాట పడరాదు.
గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?
గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిల్లోనే వేయాలి. తోసుకుంటూ లేదా ముందువారిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు. దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపూ చేయాలి. అమ్మవారికి నూనె దీపమయితే ఎడవపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడివైపు వెలిగించాలి.
శ్రీశైలంలో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది?
చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధంచేసి, విజయాలతో రాజ్యం చేరతాడు. అంత:పురంలోని స్త్రీలతో ఉన్న అందాల రాశిని తన కూతురని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవటంతో, చంద్రావతి శ్రీశైలం అరణ్యాలకి వచ్చి పరమేశ్వరుడ్ని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కూడా చంద్రగుప్తుడు వచ్చి చంద్రావతిని చెరపట్టబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకు పోయిన నీవు పచ్చలబండవై పాతాళగంగలో పడి ఉండమని శపిస్తాడు. ఆపై వేడుకోగా, శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై పాతాళగంగలో దిగిన నాడు, స్నానమాచిరించిన నాడు నీకు శాపవిమోచనం కలుగుతుందని మహేశ్వరుడు శాప విముక్తం బోధిస్తాడు.

Review తెలుసుకుందాం…!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top