అనంతుని అవగతం చేసుకోలేని అశక్తత
ఆనందంగా అంగీకరించడమే అసలైన విజ్ఞత
నువ్వు దేవుడిని అర్థం చేసుకున్నావా? అని ఒక మిత్రుడు నన్నడిగాడు. నీలానే నేను కూడా దేవుడిని అర్థం చేసుకోలేను కానీ ఒక చిన్న తేడా ఉంది. నేను దైవాన్ని అవగతం చేసుకోలేని నా అసమర్థత•కు గర్వపడుతున్నానని జవాబు చెప్పాడు.
ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి అర్థం చేసుకున్నానంటే వినడానికే నవ్వొస్తుంది. భగవంతుడు మనకు అర్థమయ్యేటట్టు ఉన్నాడంటే దేవుడి కంటే అల్పుడు మరొకడుండడు. మనం తెలుసుకునేటంత తక్కువస్థాయిలో దేవుడున్నాడా? అనేక పరిమితుల చట్రాలలో ఇరుక్కుని ఉన్న మనవంటి మందబుద్ధులు ఆయనను గ్రహించగలిగారంటే ఆ అనంతుని ప్రజ్ఞావిశేషాలకు విలువ ఉంటుందా? ఎంత తక్కువగా ఆయన్ని అవగాహన చేసుకుంటే ఆయన గొప్పతనం అంత ఎక్కువని తాత్పర్యం. ఒక పట్టాన కొరుకుడు పడని ఇంద్రజాలం ఆయన తత్త్వం. అందుకే మనం దేవుణ్ణి అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. ఆయన్ను పూర్తిగా అర్థం చేసుకోలేమన్న బాధా అవసరం లేదు. ఆయన చేసే ప్రతి పని వెనుక అనంతమైన ప్రేమ, అద్భుతమేదస్సు ఉందని గ్రహించి, ఆయన ఏది చేసినా మన మంచికేనని భావించి ఆనందిస్తే చాలు.
అసలు మన సమస్యలన్నిటికీ మూలకారణం ‘అర్థం’ చేసుకోవాలనుకోవడమే. నేడు ప్రతి వ్యక్తీ, తననెవరూ అర్థం చేసుకోవటంలేదనే అసంతృప్తితో ఉంటున్నాడు. తాను ఒంటరినని ఆవేదన చెందుతున్నాడు. మనం ఇతరులనెంతగా అర్థం చేసుకోదలిస్తే, వారు అంతగా అర్థం కారు. వారు మనల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినంత కాలం వారికి మనం అర్థం కాము. ఇదొక పెద్ద చిక్కుముడి. మనిషికీ-మనిషికీ, భార్యకూ-భర్తకూ, దేశానికీ-దేశానికీ, మతానికీ-మతానికీ, మనసుకీ-మనసుకీ మధ్య అపార్థాలు, అనర్థాలూ పెరిగిపోయాయి. రాయబారాలు, ఉత్తరప్రత్యుత్తరాలు, సమావేశాలు, సంధియత్నాలు ఈ అపార్థాలను పరిష్కరిస్తాయా? సవ ••ద్రపు నీరు త్రాగితే దాహం తీరదు, సరికదా ఇంకా ఎక్కువవుతుంది. ఇందుకు ఒకే ఒక పరిష్కారం ఉంది. ‘అర్థం చేసుకోవడం’ మానెయ్యాలి. ఎటువంటి షరతులూ లేకుండా ప్రేమించాలి. గాలికి చెదరిన మబ్బుల్లాగా అన్ని సమస్యలూ తొలగిపోతాయి.
గోపికలు కృష్ణుని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. కృష్ణునికి ‘చెంది’ ఉన్నారు. అందుకే ఆనందబృందావనం వారి స్వంతమయింది. రాధ, గోపాలుడిని తెలుసుకోవాలనుకోలేదు. గోవిందునిలో విడదీయలేని భాగమయింది. అతినికై హృదయాన్ని పరచింది. అతనికి ఆత్మగా వెలిగింది. వృక్షకోటి, పక్షికోటి, పక్షిజాతి, జంతుజాలం ఎంత సంతోషంగా జీవిస్తున్నాయి! అవి ప్రకృతిని ప్రశ్నించలేదు. మేధస్సుతో వేధించలేదు. అనంతంగా సృష్టిని అంగీకరించాయి. అమాయకంగా సృష్టికి అనుగుణంగా నడుచుకుంటున్నాయి. ప్రకృతిలో ప్రకృతిగా మమేకమైనాయి. మనం కూడా దైవాన్ని అర్థం చేసుకోవడం మాని, ఆయనకు చెంది ఉంటే దుఃఖం మన దగ్గరకు రాదు.
Review తెలుసుకొన తరమా!.