మలుపు తిప్పిన ఎన్నిక..

2002లో శాన్‍ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికవడం కమలా హారిస్‍ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి ఆమే కావడం విశేషం. ఇక్కడ ఆమె తన ప్రతిభను చూపారు. ఆమె తన హయాంలో కాలుష్య నివారణకు 2005లో ప్రత్యేకంగా ‘పర్యావరణ నేరాల విభాగా’న్ని ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల నేరాలపై కఠినంగా వ్యవహరించారు. ట్రాన్స్జెండర్లు వేధింపులకు గురవుతుండటంతో వారికి రక్షణ కల్పించేందుకు ‘హేట్‍ క్రైం’ విభాగాన్ని కూడా నెలకొల్పారు. ఉరిశిక్షలు బదులు జీవితాంతం జైలులో ఉండేలా శిక్షలు విధిస్తే మంచిదనేది కమలా హారిస్‍ అభిమతం. ఈ విషయంలో ఒత్తిడి వచ్చినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

పిల్లలు స్కూల్‍కు వెళ్లకపోతే పేరెంట్స్కు శిక్ష
పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం అనేది అమెరికాలో కమలా హారిస్‍ హయాంలోనే చోటుచేసుకుంది. సరయిన కారణం లేకుండా 50 రోజుల పాటు గైర్హాజరైనందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్ష పడింది. శాన్‍ఫ్రాన్సిస్కోలో ఇటువంటి శిక్షలు పడటం అదే తొలిసారి. జైలుకు పంపించడం వంటివి చేయకుండా సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షలు వేశారు. 2011లో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్‍గా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళ, మొదటి ఆఫ్రికన్‍ – అమెరికన్‍ కూడా కమలా హారిస్‍నే కావడం విశేషం. 2014లో మరోసారి అదే పదవిని ఆమె నిర్వహించారు. 2016లో డెమొక్రటిక్‍ పార్టీ తరపున కాలిఫోర్నియా నుంచి సెనేట్‍కు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో సెనేటర్‍గా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన రెండో ఆఫ్రికన్‍ – అమెరికన్‍ మహిళ, తొలి దక్షిణాసియా సంతతి మహిళ కమలా హారిస్‍నే. ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆమెను డెమొక్రటిక్‍ పార్టీలో బాగా ఎదుగుతున్న నాయకుల్లో ఒకరిగా ముందు నుంచీ పరిగణించే వారు.

అధ్యక్ష స్థానంపైనే గురి..
కమల అమెరికా అధ్యక్ష స్థానంపైనే తొలుత గురి పెట్టారు. డెమొక్రటిక్‍ పార్టీ తరపున పోటీ చేస్తానంటూ గత ఏడాది కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‍లో 20 వేల మంది సమక్షంలో జరిగిన సభలో బహిరంగంగా ప్రకటించారు. ఇందుకు ‘మార్టిన్‍ లూథర్‍క•ంగ్‍ జూనియర్‍ డే (ఎంఎల్‍కే డే)ను ఎంచుకున్నారు. అమెరికాలో జాతి వివక్షపై ఉద్యమించిన మార్టిన్‍ లూథర్‍కింగ్‍ జూనియర్‍ గౌరవార్థం ఏటా జనవరి మూడో సోమవారం ఎంఎల్‍కే డే నిర్వహిస్తారు. ఆయన ఆశయమే తనకు స్ఫూర్తిని ఇస్తుందని, ఈ రోజు అమెరికన్లు అందరికీ చాలా ప్రత్యేకమైనదని, ఈ రోజు నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తాననే ప్రకటన చేస్తుండటం తనకు గర్వంగా ఉందని కమల వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె జో బైడెన్‍పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. చివరకు కొన్ని విషయాల్లో బైడెన్‍తో సమానంగా సమాధానాలు ఇవ్వలేక అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో పార్టీ మద్దతును పొందలేకపోయారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆమెను ఉపాధ్యక్ష పదవికి స్వయంగా బైడెన్‍ ఎంపిక చేయడం విశేషం.

‘నేనొక నల్లజాతి మహిళనని గర్వంగా చెప్పుకునే వాతావరణంలో పెరిగాను. భారత వారసత్వంతో, అమ్మమ్మ, తాతయ్యలతో కూడా నాకు బలమైన బంధాలు ఉన్నాయి. వాళ్లు చెప్పిన కథలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాళ్ల మాటల్లో వ్యక్తమయ్యే ఆత్మీయత, ప్రజాస్వామ్యం ప్రాధాన్యం గురించి వాళ్ల మాటలు.. బీసెంట్‍నగర్‍ బీచ్‍లో మా తాతగారితో నడుస్తూ విన్న మాటలు.. నేను ఈ స్థితికి చేరుకోగలిగానంటే వీటన్నింటి ప్రభావం నాపై ఉంది’’.

‘‘మన అమెరికా విలువల పరిరక్షణ కోసం గళం విప్పే మీరు, మీలాంటి కోట్ల మంది ప్రజలపైనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే అమెరికా అధ్యక్ష స్థానానికి నేను పోటీ చేస్తున్నాను’’.
– 2019, జనవరిలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ట్విట్టర్‍లో విడుదల చేసిన ఓ వీడియోలో కమలా హారిస్‍

‘‘నేను నేనే. నా నేపథ్యంతో నేను సంతోషంగా ఉన్నా. మీరు దాన్ని నాకు గుర్తు చేయవచ్చు. కానీ, నాకు అది ఎంతో బాగుంది. అమెరికా విలువల పరిరక్షణ కోసం పోరాడేలా నా తల్లి నుంచి నేను ప్రేరణ పొందుతాను. అదే తనను ముందుకు నడిపిస్తుంది’’.
– కమలా హారిస్‍,

Review మలుపు తిప్పిన ఎన్నిక...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top