వాక్యము దేవుడైయుండెను

బాషా వ్యక్తుల మధ్య వారధిలా నిలుస్తుంది. మెరుగైన జీవనాన్ని సారథై నడిపిస్తుంది. జీవన నాణ్యతకు మూలమైన ఆధ్యాత్మిక భావాలను మనసుల్లో నాటడానికి భాషను మించిన ఉపకరణం లేదు. అలా కోట్లాది మంది భక్తులకు చేరువైన ఆధ్యాత్మిక గ్రంథం బైబిల్‍. బైబిల్‍ పఠనం అనేది లక్షలాది మంది క్రైస్తవుల నిత్యకృత్యంగా మారటానికి తెలుగు భాషే కారణం. డిసెంబరు 25 క్రిస్మస్‍ పర్వదినం సందర్భంగా బైబిల్‍ తెలుగు లిపి గురించి, బైబిల్‍ ఘనత గురించి..
అమ్మ చేతి గోరుముద్దలా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంధాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం బైబిల్‍ క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాలను తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ భావనకు దగ్గరగా ఉండే ఒక వాక్యం బైబిల్‍ పవిత్ర గ్రంథంలోని యెహాను సువార్తలో ఉంది. అది-‘ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను’ అనడం ద్వారా వాక్యానికి దైవత్వాన్ని ఆపాదించి, భగవంతునితో ఆధ్యాత్మికంగా అనుబంధం ఏర్పరిచే వంతెనగా దాన్ని నిలిపే ప్రయత్నం జరిగింది.
భారతీయ భాషలు ప్రగతి సాధించడానికి ముద్రణ ఎంతో ఊతమిచ్చింది. ఇందుకు క్రైస్తవ మిషనరీల మత ప్రచార సంకల్పమే కారణం. ‘సాధ్యమైనన్ని భారతీయ భాషల్లో బైబిల్‍ అనువాదం చేయాలనే క్రైస్తవ మిషనరీల దృఢ సంకల్పమే భారతీయ భాషాభివృద్ధికి దోహదపడింది’ అని భారత మాజీ ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ మిషనరీల ప్రయత్నాన్ని కొనియాడారు. ముద్రణ నూతన శకానికి నాంది పలుకుతూ 19వ శతాబ్దం తొలి పాదంలో 42 భారతీయ భాషల్లో బైబిల్‍ పవిత్ర గ్రంథ అనువాదం జరిగింది. ఇక బైబిల్‍ తెలుగు అనువాదం విషయానికి వస్తే.. ‘మోక్షానికి కొంచ్చుకుపోయే దోవ’, ‘సత్యమైన వేదంలో ఉండె’, ‘బుద్ధి కలిగిన నూరు జ్ఞాన వచనాలు’, ‘ఒక గురువు ఐదు బ్రాహ్మల యొక్క నడమన’ అనే ఈ నాలుగు పుస్తకాలనే తెలుగులో అచ్చయిన తొలి ముద్రణలుగా పేర్కొనాలి. 1818లో కొత్త నిబంధన గ్రంథ ప్రచురణ, ఆ తర్వాత మూడు సంవత్సరాలకు పంచకాండాలు, వ్యాకరణాలు, వాచకాలు, నిఘంటువులు, చిన్న కథల ముద్రణ క్రమేపీ ఊపందుకుంది. ఇలా మత ప్రచారమైన మిషనరీల సంకల్ప ఫలితంగా ముద్రణకు నోచుకున్న తెలుగు భాష జ్ఞాన ప్రసారంలో నమ్మదగిన సాధనమైంది. తరతరాల మానవ సంస్క•తి విజయ పరంపరకు ఆలవాలమైంది. నాటి నుంచి నేటి వరకూ అప్రతిహతంగా జవావళికి తోడ్పడుతూ వచ్చింది.
మాతృక హిబ్రూ భాష నుంచి తెలుగులోకి బైబిలు అనువాదం కాలానుగుణ భాషా పరిణామాలకు అనుగుణంగా జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వివిధ తెలుగు బైబిలు అనువాదాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
బిబ్లియా అనే గ్రీకు పదం నుంచి బైబిలు పుట్టింది. బిబ్లియా అంటే పుస్తకాలు అని అర్థం. పరిశుద్ధ గ్రంథం వేర్వేరు రచయితలు వెయ్యి సంవత్సరాల పాటు ప్రయాసకోర్చి రాసిన పుస్తక సంకలనం. పరిశుద్ధ గ్రంథంలో పద్యం, కీర్తనలు, జ్ఞాన సాహిత్యం, సామెతలు, సువార్తలు ఇలా ఎన్నో విభిన్న సాహిత్య రీతులు, శైలులు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే వివిధ క్రైస్తవ పదాల రూపకల్పన పురుడుపోసుకుంది. ‘ఇవాంజెలియన్‍’ అనే గ్రీకు పదానికి ‘గాడ్‍స్పెల్‍’ అనే ప్రాచీన ఆంగ్ల పదం సూటి అనువాదం. గాడ్‍స్పెల్‍ అనే పదం నుంచే ‘గాస్పెల్‍’ అనే పదం వచ్చింది. ‘గాస్పెల్‍’ అంటే ‘సువార్త’ అని తెలుగులో అర్థం. అలాగే, ప్రార్థన ముగిస్తూ క్రైస్తవులందరూ ఉపయోగించే మరో పదం- ‘ఆమెన్‍’. అంటే, ‘తథాస్తు’ అని అర్థం. క్రీస్తును స్తుతిస్తూ పలికే ‘హలేలూయా’ అనే హిబ్రూ పదానికి ‘దేవునికి స్తుతి కలుగుగాక’ అని అర్థం.
ఆధ్యాత్మికమైన ఆసక్తిని కలిగింపచేసే కృషి పరిశుద్ధ గ్రంథం రచనాశైలిలో కనిపిస్తుంది. వాక్య నిర్మాణం, పదాల పొందిక వాక్యాలకు నిండుదనాన్నిచ్చి మనసుకు హత్తుకుపోయే మహత్తును వాక్యాలకు ఆపాదించాయి. యేసు పలికిన కొన్ని వాక్యాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ దేవుని కుమారుడే నేరుగా మనతో మాట్లాడుతున్నటువంటి అనుభూతి కలిగేంతటి దైవత్వం వాక్యాలకు అలవడింది. తమ జీవితాలను సన్మార్గంలో నడిపించుకునేందుకు దోహదపడిన అమూల్యమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలు. వాటిలో క్రీస్తు చెప్పిన అమూల్య వాక్యాలను కొన్నిటిని చదవండి..
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది’.
‘దుఃఖపడువారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు’.
‘సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు’.
‘నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు’.
బైబిలులో దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి ముఖ్యమైన సత్యాలను దైనందిన జీవితంలో అందరికీ బాగా తెలిసిన విషయాలతో పోల్చి చెప్పే చిన్న కల్పనలే ఉపమాన కథలు. ఇవి పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వీటిని క్లుప్తంగా లేదా వివిధ పాత్రలతో, సాదృశ్యాలతో వివరించే విధానం బైబిలులో కనిపిస్తుంది.
బైబిలులో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన రచనలు కనిపిస్తాయి. బైబిలులోని కొన్ని గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో రచయితల ఉద్దేశాలు ప్రతిఫలిస్తాయి. నాటి కాలమాన పరిస్థితులను కళ్లకు కట్టిస్తూనే, క్రీస్తు మూర్తిమత్వం, వ్యక్తిత్వాలను పాఠకులు గ్రహించేలా రచనలు చేశారా అనిపించే రీతిలో ఉంటాయి. లూకా సువార్త 2వ అధ్యాయనంలోని మొదటి 20 వచనాలు చదివినప్పుడు యేసు జనన వృత్తాంతానికి సంబంధించిన సంఘ టనలు మన కళ్ల ముందే జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. ఇందుకు భిన్నంగా యెహాను సువార్తలో పరిస్థితులు, సంఘటనలకు బదులుగా యేసు వాక్యము, నిజమైన వెలుగు, ఆయన శరీరధారి అయ్యాడని సూచించే కావ్య వర్ణన కనిపిస్తుంది. రచన ప్రకరణంలో పద్యం, కీర్తనలు, కథ వంటి విభిన్న శైలులు కనిపిస్తాయి. లోకం, దేవుడు, మనుషుల గతి ముఖ్యాంశాలుగా వివేచన కలిగించే సామెతలు, సూక్తులు, విశిష్టమైన శైలిలో రచించారు. తాత్విక ధోరణితో పాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడా కనిపిస్తాయి. ప్రార్థనలు గద్యంలోనూ, పద్యంలోనూ ఉంటాయి. దేవునితో సంభాషించడమే ప్రార్థన. కృతజ్ఞతా స్తుతులు, సహాయాన్ని అర్థిస్తూ వేడుకోలు, విచారాన్ని వెలిబుచ్చుతూ.. ఇలా సందర్భం ఎలాంటిదైనా దేవుడిని ప్రార్థించే విధానం పద్య రూపంలో ఉండటం బైబిలు సాహిత్య విశిష్టత.

కవిత్వం ద్వారా క్రీస్తును స్తుతించిన తెలుగు ప్రముఖులు
కవిత్వం ద్వారా క్రీస్తును స్తుతించిన తెలుగు ప్రముఖులు
కవిత్వం ద్వారా యేసును కీర్తించిన తెలుగు ప్రముఖుల్లో కవి కోకిల గుర్రం జాషువా అగ్రగణ్యులు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రధాన ఘట్టాలన్నింటినీ ‘క్రీస్తు చరిత్ర’ పద్య అధ్యాయాల్లో పరిమళింప చేసి క్రీస్తు ప్రేమను చాటారు ఆయన. ‘మత గ్రంథాన్ని ఛందోబద్ధం చేయడం కత్తి మీద సాము, తీగ మీద నడక వంటిది’ అంటూ క్రీస్తు చరిత్ర పుస్తక ప్రారంభంలోనే జాషువా చెప్పారు. అలాగే, బైబిలు భాషను సమర్థిస్తూ ‘తెలుగు బైబిలు భాషనీసడించు హైందవ మిత్రులకు, కళాభిరుచి కల ఆధునిక యువ క్రైస్తవ లోకానికీ ఈ కావ్యం రుచిస్తుందనే ధైర్యం నాకున్నది’ అంటూ రాసుకున్నారు జాషువా. అలాగే, క్రీస్తు చరిత్రలో ఆయన రచించిన ‘ఖండ ప్రశంస’ పద్యాలను పరిశీలిస్తే, క్రీస్తు ఆసియా ఖండంలోనే జన్మించారనే ఒక కథనాన్ని కవి సమర్థించిన విషయం స్పష్టమవుతుంది. ఆ వాదనను బలపరిచే పద్యం ఇలా సాగుతుంది.
‘ఏమి నోములు నోచితో యేసు ప్రభువు
డాబు దర్పాలు గల్గు ఖండాంతరములు
జన్మమెత్తక నీ గడ్డ జన్మమెత్తె
ఆసియా ఖండమా! ధన్యవమ్మ నీవు!’.
జాషువాతో పాటు ఆయన సమకాలీనులైన కొందరు కవులు పరిశుద్ధ గ్రంథంపై పద్య కావ్యాలు రాశారు. వారిలో ఏలూరుకు చెందిన లక్కవరం ఎస్టేటు జమీందారు ‘మంతిప్రగడ భుజంగరావు’ ఒకరు. ఈయన కొత్త నిబంధన గ్రంథంలోని మత్తయి సువార్తపై కావ్యాలను వినూత్న పద్య ప్రయోగంతో రచించారు. ఆ పద్య కావ్యాల్లోని ఒక పద్యంలో- ‘ఏసుజనుండు’ అనే ద్విపదాలను, విడగొట్టినప్పుడు, జోడించినప్పుడు వేర్వేరు అర్థాలు స్ఫురించేలా రచించారు. ‘ఏ సుజనుండు’ అనడం ద్వారా ‘ఏ మంచి వ్యక్తి’ అనే అర్థం, ‘ఏసు జనుండు’ అనడం ద్వారా ఏసు క్రీస్తును సంబోధించిన అర్థాన్ని తన కావ్యాల్లో నర్మగర్భంగా ధ్వనింపచేశారు. అలాగే, తెలుగు భాషలో ద్వంద్వ కావ్యాలకు అంటే, రెండర్థాల కావ్యాలకు ప్రాధాన్యం ఉంది. ఆధునిక కాలంలో కృష్ణుడి చరిత్ర, ఏసు క్రీస్తు చరిత్రలు రెండింటినీ కలిపి ‘ఏసుకృష్ణీయం’ అనే పేరుతో కవి, అష్టావధాని గాడేపల్లి కుక్కుటేశ్వరరావు ద్వంద్వ కావ్యం రచించారు. ఇవే కాకుండా పరిశీలించగలిగితే ఇలాంటి మరెన్నో పద్య ప్రయోగాలు క్రీస్తు చరిత్ర సంబంధ గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి.బోధనలు సార్వకాలీనమైనవి. సార్వజనీనమైనవి. నిత్యమై, సత్యమై నిఖిల జనరంజకంగా భాసిల్లిన క్రీస్తు బోధనలు జీవన నాణ్యతను మెరుగుపరిచే బహిమాన్విత మేలి ముత్యాలు.

Review వాక్యము దేవుడైయుండెను.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top