మనిషి స్వభావం

పేరుకే పిల్లల కథలు.. పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేర్లతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు, పక్షులు ఈ కథలో వేసే ఎత్తులు, చూపే తెలివితేటలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. ఆ తెలివితేటల్లో, చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. అటువంటి కొన్ని కథల పరిచయం.
ఒకరోజు అక్బర్‍ మహారాజు తన సభలో- ‘మనుషులు వారి స్వభావానికి తగిన వృత్తిని ఎంచుకుంటారు’ అని అన్నాడు.
అది బీర్బల్‍ అంగీకరించలేదు. మనిషి వృత్తికీ, స్వభావానికి సంబంధం లేదని వాదించాడు.
అక్బర్‍కు బీర్బల్‍ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేథస్సు మీద చాలా నమ్మకం. కానీ, అప్పుడప్పుడూ పరీక్షలు పెట్టి ఆనందిస్తుండే వాడు.
అందుకే మనిషి వృత్తికీ, స్వభావానికి సంబంధం లేదని బీర్బల్‍ అనగానే, అక్బర్‍ ఆ విషయాన్ని నిరూపించాలని సవాల్‍ విసిరాడు.
‘సరే.. రేపు ఇద్దరం మారు వేషాలు వేసుకుని నగర పర్యటన చేద్దాం. నేనన్న దానికి రేపు మీకు ప్రత్యక్ష నిదర్శనం చూపిస్తాను’ అని బీర్బల్‍ చెప్పారు.మర్నాడు ఇద్దరూ మారు వేషం వేసుకుని నగర పర్యటనకు బయల్దేరారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారి కనిపించాడు.
అతని దగ్గరికి బీర్బల్‍ చాలా దీనంగా ముఖం పెట్టుకుని వెళ్లాడు. ‘మేం పొరుగూరి నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టులో నుంచి ఏమైనా ఇప్పించండి’ అన్నాడు.మిఠాయి వ్యాపారి చీదరించుకుంటూ, ‘ఛీ ఛీ. దందా చేసుకునే సమయంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనే వాళ్లు కూడా రారు. పో’ అని కసురుకున్నాడు.
బీర్బల్‍ ఊరుకోకుండా ఏమైనా ఉంటే పెట్టాలని బతిమాలాడు.మిఠాయి వ్యాపారి తన చుట్టూ తినుబండా రాలు పెట్టుకుని కూడా, ఏమాత్రం చలించలేదు. పైగా తన సహాయకుల చేత బీర్బల్‍ను మెడ పట్టి గెంటించి వేశాడు.బీర్బల్‍, అక్బర్‍ అక్కడి నుంచి వెళ్లిపోయారు.దారిలో ఒక బండలు కొట్టే మేస్త్రీ కనిపించాడు.ఇద్దరూ అతని వద్దకు వెళ్లారు. బీర్బల్‍ మిఠాయి వ్యాపారికి చెప్పినట్టే అతనితో కూడా ‘మేం పొరుగూరి నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి ఏమైనా ఇప్పించండి’ అన్నాడు.ఆ మేస్త్రీ వెంటనే ‘అయ్యో అలాగా? నాతో రండి’ అని వారిద్దరిని తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. వాళ్లకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, ఉన్న కొంచెంలోనే అతిథులకు తగిన భోజనం తయారు చేయాలని భార్యకు పురమాయించాడు.ఆమె చక్కగా అన్నం, కూర, పచ్చడి, పులుసు రుచికరంగా తయారుచేసి అతిథులకు వడ్డించింది.భోజనం అయ్యాక, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆ మేస్త్రీ వారిద్దరికి అరుగు మీద మంచాలు వేశాడు. రెండు విసనకర్రలు ఇచ్చాడు.సుష్టుగా తిన్న అక్బర్‍, బీర్బల్‍ కాసేపు నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రానికి అతని వద్ద సెలవు తీసుకుని బయల్దేరారు. దారిలో తినడానికి ఉంటుందంటూ ఆ మేస్త్రీ మరి కొంత ఆహారం వారికి మూటకట్టి ఇచ్చాడు.ఇద్దరూ రాజసభకు చేరుకున్నారు. అప్పుడు బీర్బల్‍- ‘చూశారా ప్రభూ! మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు. బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న మేస్త్రీ హృదయం వెన్నకంటే మెత్తనిది. మనుషులు చేసే వృత్తికి వారి స్వభావానికి సంబంధం లేదని ఇప్పటికైనా అంగీకరిస్తారా’ అని అడిగాడు. అక్బర్‍ చిరునవ్వుతో బీర్బల్‍ చెప్పిన దానితో అంగీకరించాడు.ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రీకి, అతని కుటుంబానికి అక్బర్‍ చక్రవర్తి అమూల్యమైన బహుమతులు పంపించి, కృతజ్ఞత చాటుకున్నాడు.

Review మనిషి స్వభావం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top