శ్వేతసౌధం ట్రంప్

ప్రపంచ రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు విడుదలయ్యే వేళకి అందరి అంచనాలు తప్పాయి. సర్వేలన్నీ తారుమారయ్యాయి. ఎగ్జిట్‍పోల్స్, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్‍ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‍ విజయకేతనం ఎగురవేశారు. 45వ అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో పాగా వేశారు. విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న హిల్లరీకి ఫలితాలు షాకిచ్చాయి.
డోనాల్డ్ ట్రంప్‍ అనూహ్య దూకుడు అమెరికా చరిత్రనే మార్చేసింది. ఎటువంటి రాజకీయ అనుభవం లేని ట్రంప్‍ ..అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కావడం విశ్లేషకులకు అందలేదు. సంప్రదాయ సూత్రాలను పక్కనపెట్టి తనదైన శైలిలో దూసుకెళ్లిన ట్రంప్‍ వైట్‍హౌస్‍కి హీరోగా మారారు. ఎన్నికల ఆరంభంలో హిల్లరీ విక్టరీని అంచనా వేసిన మీడియా సంస్థలు కూడా అమెరికా ప్రజల తీర్పుతో బోల్తాపడ్డాయి. రిపబ్లికన్‍ అభ్యర్థిగా నామినేషన్‍ స్వీకరించిన ట్రంప్‍ ఓ దశలో చురుకైన వ్యంగ్యాస్త్రాలతో సొంత పార్టీలోనే రెబల్‍గా మారారు.
అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ ట్రంప్‍ చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. మన దేశం, మన హక్కు మన ఉద్యోగాలు అంటూ అమెరికన్లకు భరోసా కల్పించారు. అదే సమయంలో ఉగ్రవాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలు యావత్‍ ప్రపంచాన్నే తన వైపునకు తిప్పుకునేలా చేశాయి. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్‍ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా.. న్యూయార్క్ గవర్నర్‍ పదవిపై 2006,2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్‍ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు.
కొత్త అమెరికాను నిర్మిద్దాం.. అమెరికాలో ప్రతి ఒక్కరికీ అధ్యక్షుడినవుతా.. ఈ వ్యాఖ్యలే ప్రతి ఒక్క అమెరికన్‍ మనసులో నాటుకుపోయాయి. మన దేశం -మన జాబ్‍లు అనే నినాదంతో దూసుకుపోయారేమే ట్రంప్‍ తన మాటలతో అందరినీ కట్టిపడేశారు. అదే ఫార్ములాతో వైట్‍హౌస్‍లోకి ఎంటరయ్యారు. ఎన్నో విమర్శలు, అంతకు మించిన ఆరోపణలు.. అవేమీ పనిచేయలేదు.. అమెరికన్లంతా సెంటిమెంట్‍కే పడిపోయారు.. వైట్‍హౌస్‍కు వెళ్లేందుకు ట్రంప్‍కు రెడ్‍ కార్పెట్‍ పరిచారు.
ప్రచారంలో ట్రంప్‍కు వచ్చిన మార్కులకంటే విమర్శలే ఎక్కువగా ఉండేవి. అధ్యక్ష పదవిరేసులో ఉన్నా సరే ట్రంప్‍ తన దూకుడు ఎక్కడా తగ్గించలేదు. ప్రతిపక్షంపై తన మాటలతో విరుచుకుపడేవారు. ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేవారు. లింగ, జాతి, మతవిద్వేష వ్యాఖ్యలు, పరుషపదాలతో తన దూకుడు చూపించారు. చివరకు ఆ దూకుడే అమెరికన్లకు నచ్చింది. అందుకే అమెరికా ఎన్నికల్లో సంచలనం నమోదైంది. సర్వేలన్నింటినీ తలకిందులు చేస్తూ రిపబ్లికన్‍ నేత డొనాల్డ్ ట్రంప్‍కే అధ్యక్షుడిగా ఓటేసి గెలిపించారు. 70 ఏళ్ల ట్రంప్‍ గెలుపు అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
న్యూయార్క్ నుంచి వచ్చిన కోటీశ్వరుడు ట్రంప్‍.. అమెరికన్లను ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తట్టిలేపారు. తన వాక్చాతుర్యంతో వలస వ్యతిరేక విద్వేష ప్రచారంతో వారిని ఎన్నికల బంగారు గనిగా మల్చుకున్నారు. మహిళలు, వలసలు, పలు పార్టీల నేతలపై ట్రంప్‍ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలే విరుచుకుపడ్డారు కూడా.. కానీ ఎవరెన్ని అన్నా డోన్ట్ కేర్‍ అంటూ అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటూ ముందుకు వెళ్లారు. అక్షరాలా జాతి పునర్‍ నిర్మాణమే తన ధ్యేయమని చెప్పే ట్రంప్‍ ఎన్నికల్లో గెలిచాక కూడా అదే మాట అన్నారు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలనుకున్న హిల్లరీకి ఈ ఫలితాలు తీవ్ర ఆశాభంగాన్ని మిగిల్చాయి. ట్రంప్‍కు అభినందనలు తెలిపారు.
కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినప్పటికి ట్రంప్‍ అనునిత్యం కష్టపడేవారు. తండ్రి పెట్టిన రియల్‍ ఎస్టేట్‍ బిజినెస్‍లో చేరి దాన్ని ఎన్నో రెట్లు పెద్దది చేశారు. తనకంటూ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నారు. రియాలిటీ టీవీషోలు కూడా నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. దాంతో పాటు రాజకీయాల్లో ఉంటూ చివరికి దేశాధ్యక్షుడయ్యారు.
ఫ్రెడ్‍ ట్రంప్‍, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్‍ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్లో జన్మించారు. ట్రంప్‍ తండ్రి జర్మన్‍ మూలాలుకాగా, తల్లి పూర్వీకులది స్కాట్‍లాండ్‍. ఏడెనిమిది తరాల క్రిందే ట్రంప్‍ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది. ఫ్రెడ్‍ ట్రంప్‍
న్యూయార్క్ కేంద్రంగా రియల్‍ ఎస్టేట్‍ వ్యాపారం చేసేవారు. కాలక్రమంలో ‘ఎలిజబెత్‍ ట్రంప్‍ అండ్‍ సన్స్’ స్థాపించి లాభాలు గడించారు. మొండిఘటంగా ఉండే ట్రంప్‍కు క్రమశిక్షణ అలవడడానికి తండ్రి ట్రంప్‍ని సైనిక అకాడమీకి పంపారు. అప్పట్లో వియత్నాం యుద్ధం జరిగినా ట్రంప్‍ సహచరులతో పాటు వెళ్లి అందులో పాల్గనేందుకు ఉత్సాహం చూపలేదు. పెన్సిల్వేనియాలో గ్రాడ్యుయేషన్‍ తరువాత తండ్రి చేసే ఇండ్లు, స్థలాల వ్యాపారంలో ప్రవేశించారు. మొదట తండ్రి వద్దే ఒక మిలియన్‍ డాలర్లను అప్పు చేసి చిన్న స్థాయి బిజినెస్‍ ప్రారంభించారు. తండ్రి నుంచి వ్యాపార మెళకువలు నేర్చుకున్నారు. తరువాత తండ్రి కంపెనీలోనే చేరారు.
న్యూయార్క్లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్‍.. యూనివర్సిటీ ఆఫ్‍ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్‍ స్కూల్‍ నుంచి 1968లో ఎకానమిక్‍ పట్టాపుచ్చుకున్నారు. ఉరకలేసే ఉత్సాహవంతుడైన యువకుడిగా 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. వస్తూనే కంపెనీ పేరు ‘ట్రంప్‍ ఆర్గనైజేషన్‍’గా మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో పేద, మధ్యతరగతి వర్గాల కోసం పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు నిర్మించిన ట్రంప్‍.. అనతి కాలంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్‍హట్టన్‍కు మార్చేశారు. అనంతర కాలంలో లెక్కకు మించి భారీ టవర్లు, హ•టళ్లు,క్యాసినో, గోల్ఫ్ కోర్సులు నిర్మించి ‘ట్రంప్‍’ను పెద్ద బ్రాండ్‍గా మార్చేశారు. డబ్బుతో పాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న ఆయన .. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు. అయితే పార్టీ నామినేషన్‍ ఖరారు కాకముందే తన ప్రయత్నాలను విరమించుకున్నారు.
ట్రంప్‍పై బోల్డన్ని లైంగిక ఆరోపణలు వినీ వినీ అమెరికన్లు విసుగెత్తిపోయారు. ట్రంప్‍ తమపై లైంగిక దాడులు చేశారంటూ రోజుకో మహిళ, సెలబ్రిటీలు రచ్చకెక్కారు. సరిగ్గా పోలింగ్‍ ముందు ట్రంప్‍ను ఈ ఆరోపణలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో అప్పటివరకు ట్రంప్‍కు మద్దతు పలికిన మహిళలు హిల్లరీకి జేజేలు పలుకుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే అనూహ్యంగా ట్రంప్‍ను మహిళలే గెలిపించడం విశేషం..ఆయనపై వచ్చిన ఆరోపణలను ఏ మాత్రం పట్టించుకోమని తమ ఓటు తీర్పుతో తేల్చేశారు. హిల్లరీ క్లింటన్‍కు 54 శాతం మంది మహిళలు ఓటేసినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. ట్రంప్‍కు అనూహ్యంగా 42 శాతం మహిళలు ఓటేసి అధ్యక్ష పీఠమెక్కించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించగానే ట్రంప్‍ ‘అమెరికా దేశాన్ని పునర్‍ నిర్మిస్తానంటూ అమెరికన్లకు భరోసా ఇచ్చారు.

Review శ్వేతసౌధం ట్రంప్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top