మంగళప్రద మాసం

ఆగస్టు 31, శనివారం, భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి-సెప్టెంబరు 28, శనివారం, భాద్రపద బహుళ అమావాస్య వరకు

శ్రీ వికారి నామ సంవత్సరం-భాద్రపద మాసం- వర్ష రుతువు-దక్షిణాయనం

తె•లుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం ఇది సెప్టెంబరు నెల. తొమ్మిదవది. ఆబాల గోపాలానికి అత్యంత ప్రియమైన దేవుడు వినాయకుడు వినాయక చవితి పేరిట విశేష పూజలందుకునేది ఈ మాసంలోనే. మరెన్నో ప్రతాలు ఈ నెలలో పలకరిస్తాయి. ఆషాఢంలో అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయే ఆడపిల్లలు మళ్లీ భద్రపదం.

భాద్రపద మాసంలో గృహ నిర్మాణం ఆరంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది. వినాయక చవితితో పాటు ఉండ్రాళ్ల తద్ది ఈ మాసంలోనే వస్తుంది. ఈనాడు ఉయ్యాలలూగడం యువతులకు ఎంతో మురిపెం. భాద్రపదంలో వచ్చే పర్వాల్లో ఆయా దేవతలకు నివేదించే ప్రధాన నైవేద్యం ఉండ్రాళ్లు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. సెప్టెంబరు నెలలో ఉండే వాతావరణం రీత్యా ఉండ్రాళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వినాయకుడికీ ఇవంటే ఎంతో ప్రీతి. ఇక, భాద్రపద మాసంలో వచ్చే పర్వాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.

భాద్రపద శుద్ధ పాడ్యమి, ఆగస్టు 31, శనివారం

భాద్రపద మాసం ఈ తిథితోనే ఆరంభమవుతుంది. వివిధ వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఏ దేవతనూ పూజించేది లేదు. కానీ, ఈనాడు ఆడపడుచులు ఆడిపాడటం సంప్రదాయం. ఈనాడు పడుచులు తెల్లవారు జామున లేచి, తలంటి పోసుకుంటారు. పిండి వంటలు వండుతారు. భోజనా నంతరం విలాసంగా పొద్దుబుచ్చుతారు. సాయంకాలం తిరిగి పిండి వంటలతో భోజనం చేస్తారు. పడకకు చేరే లోపుగా ప్రతి వారు జొన్న కంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలని నియమం. ఈ పర్వం పేరేమిటో, దానికి సంబంధించిన నేపథ్యమేమిటో స్పష్టత లేదు. కాగా, భద్రచతుష్టయ వ్రతం, మృగశీర్షా వ్రతం వంటివి ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ విదియ, సెప్టెంబరు 1, ఆదివారం

ఈ తిథి కల్కి జయంతి దినంగా ప్రసిద్ధి. అలాగే, ముస్లింల మొహర్రం మాసం ఈ రోజు నుంచే ఆరంభమవుతుంది.

భాద్రపద శుద్ధ తదియ, సెప్టెంబరు 1, ఆదివారం

ఈనాడు హరితాళిక వ్రతం ఆచరిస్తారు. తెలుగు నాట పదహారు కుడుముల తద్దిగా ఇది ప్రసిద్ధి. సౌభాగ్యవంతమైన స్త్రీలు, కన్యలు ఆచరించే వ్రత పర్వమిది. ఈ వ్రతం ఆచరించే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందిందని పురాణగాథ. ఈనాటి పూజకు అరటి స్తంభాలతో మండపం నిర్మించి, వివిధ వర్ణాల పట్టుబట్టలతో, తోరణాలతో దానిని అలంకరించాలి. పూజ తరువాత ఉపవాసం ఉండాలి. ఉత్తర భారతదేశంలోనే ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉనికిలో ఉంది. ఈ తిథి నాడు మన తెలుగు రాష్ట్రాలలో పదహారు (16) కుడుముల తద్ది పర్వాన్ని జరుపుకుంటారు. ఇది నోము. పూర్వం ఓ రాజ కుమార్తె ఈ నోము సరిగా పరిసమాప్తి చేయలేదు. దీంతో మరుసటి జన్మలో ఆమె పేదరాలై పుట్టింది. ఈతి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి అడవికి వెళ్లగా, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై గతజన్మలో 16 కుడుముల తద్ది సరిగా ఆచరించని ఫలితంగానే ఈ కష్టాలు కలిగాయని చెబుతారు. అప్పుడు ఆ యువతికి పార్వతి స్వయంగా ఈ వ్రతాచరణ గురించి చెప్పింది. భాద్రపదంలో ఇది చాలా విశేషమైన తిథి. ఈనాడు పదహారు కుడుముల తద్దితో పాటుగా, హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తారు. ఉత్కల దేశంలో గౌరీ తృతీయ పేరిట నోము ఆచరిస్తారు. ఇంకా ఈనాడు కాంచన గౌరీ పూజ, ఉమా పూజ, కోటీశ్వరీ వ్రతం, అనంత తృతీయా వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే వరాహ జయంతి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ పంచమి, సెప్టెంబరు 3, మంగళవారం

ఈ తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి. ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతాన్ని గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట.
విదర్భ దేశంలో ఉత్తంగుడు అనే బ్రాహ్మణుడి భార్య సుశీల మిక్కిలి పతివ్రత. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కొడుకు వేద పండితుడు. కూతురు బాల వితంతువు అయ్యింది. ఈ కష్టంతో ఉత్తంగుడు గంగా తీరవాసి అయి బ్రహ్మచారులకు వేదం చెబుతుండే వాడు. కూతురు అతనికి సపర్యలు చేస్తుండేది.
ఒకనాడు బాలిక శరీరం నుంచి పురుగులు పడ్డాయి. వాటిని చూసి భయంతో ఆమె స్ప•హ తప్పి పడిపోయింది. అప్పుడు తల్లి ఆమెను తండ్రికి చూపగా, అతను దివ్యదృష్టితో ఆమె పూర్వజన్మలో బ్రాహ్మణ బాలిక అయి ఉండి, రజస్వల అయిన నాడే ఇంట్లోని వస్తువులు ముట్టుకున్నట్టు గ్రహించాడు. అంతేకాక, నాడు ఆమె రుషి పంచమి వ్రతాన్ని ఆచరించే వారిని చూసి నవ్వింది. అందుకు ఆమె శరీరం క్రిమిగ్రస్తమైంది. రుషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తే ఈ దోషం పోతుంది. ఈ వ్రతాచరణ వల్ల రజస్వలగా ఉండి అజ్ఞాతంగా చేసే తప్పుల్ని పోగొట్టుకోవచ్చని అంటారు.
ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం.

భాద్రపద శుద్ధ షష్ఠి, సెప్టెంబరు 4, బుధవారం

ఈనాడు సూర్యపూజ చేయాలని ప్రముఖ వ్రత గ్రంథమైన పురుషార్థ చింతామణిలో ఉంది. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది. ఈనాడు స్కంద (కుమారస్వామి) దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది.

భాద్రపద శుద్ధ సప్తమి, సెప్టెంబరు 5, గురువారం

ఈనాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలి. దీనినే ఆముక్తాభరణ వ్రతం అనీ అంటారు. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వంలో రాశారు. ఇంకా చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని ఉంది.

భాద్రపద శుద్ధ అష్టమి, సెప్టెంబరు 6, శుక్రవారం

భాద్రపద శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిథి. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా పూజించాలి.

భాద్రపద శుద్ధ నవమి, సెప్టెంబరు 7, శనివారం

పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా ఈ తిథిని భావించే సంప్రదాయం ఉంది. పుణ్య స్త్రీల భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం శ్రాద్ధాలు పెడతారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభంలో రాశారు. ఈ తిథి కేదార వ్రత దినం కూడా.

భాద్రపద శుద్ధ దశమి, సెప్టెంబరు 8, ఆదివారం

ఈ తిథి నాడు దశావతారాలను పూజించాలని అంటారు. ఈ కారణంగానే దీనికి దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త అనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు. దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు. ఈనాటి నుంచి క్షీర వ్రతం ఆరంభమవుతుంది.

భాద్రపద శుద్ధ ఏకాదశి, సెప్టెంబరు 9, సోమవారం

ఈ ఏకాదశిని వామన ఏకాదశిగానూ వ్యవహరిస్తారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి ఈ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలు అవుతుంది. ఈ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి అని పేరు వచ్చింది.

ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సాయంత్రం వేళలో జరుగుతాయి. అలాగే, ఈనాడు కటదానోత్సవం అనే వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. కటము అంటే చాప. కటకారుడు అంటే చాపలు అల్లేవాడు. అంటే ఈనాడు చాప దానం చేయాలి.

భాద్రపద శుద్ధ ద్వాదశి, సెప్టెంబరు 10, మంగళ•వారం

ఈనాడు వామన జయంతి అని అంటారు. అలాగే కల్కి ద్వాదశి దినం కూడా. తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవం ఈనాటి నుంచే ప్రారంభం. అలాగే, ముస్లింల మొహర్రం ఈనాడే.

భాద్రపద శుద్ధ త్రయోదశి, సెప్టెంబరు 11, బుధవారం

భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఈనాడు మొదలుకుని మూడు రోజులు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ చతుర్దశి, సెప్టెంబరు 12, గురువారం

ఈనాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించాలి. ఈ తిథి నాడు చేసే పూజా కార్యక్రమాన్ని అనంత వ్రతమని అంటారు. అనంతుడు అంటే త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనది. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యం. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది. మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు.

భాద్రపద శుద్ధ పూర్ణిమ, సెప్టెంబరు 14, శనివారం

భాద్రపద శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా విశేషమైనది. ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు.
ఈనాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది. భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది.

ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది. నైష్కిఉలకు పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు.

భాద్రపద బహుళ విదియ, సెప్టెంబరు 16, సోమవారం

భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. దీని తరువాతి రోజు తదియ. ఇది ఉండ్రాళ్ల తద్ది. కొన్ని పండుగలకు పూర్వ దినాలను భోగి అనడం వాడుకలో ఉంది. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను భోగి అని వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుజామున గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.

భాద్రపద బహుళ చవితి, సెప్టెంబరు 18, బుధవారం

ఈనాడు దికాల్ప పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది.

భాద్రపద బహుళ పంచమి, సెప్టెంబరు 19, గురువారం

ఈ తిథి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తిపరచాలని అంటారు. అలాగే, రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసేదిగా ఉంది. మొదట స్నానం చేసి మట్టితో వేదిక చేయాలి. దానిని పేడతో అలకాలి. పువ్వులతో అలంకరించాలి. దర్భలు పరిచి దాని మీద గంధం ఉంచాలి. పువ్వులు ఉంచాలి. ధూపం వేయాలి. దీపం ఉంచాలి. సప్తరుషి పూజ చేయాలి. అర్ఘ్యదానం ఇవ్వాలి. దున్నకుండా, నాటకుండా పండిన శ్యామాక ధాన్యంతో బియ్యం చేసి వండి నైవేద్యం పెట్టి తాను ఆ అన్నమే తినాలి. ఇలా చేస్తే సప్తర్షుల అనుగ్రహం కలుగుతుందని అంటారు.

భాద్రపద బహుళ అష్టమి, సెప్టెంబరు 22, ఆదివారం

ఈ తిథి నాడు జీమూత వాహనుడిని పూజిస్తారు. అశోకాష్టమీ వ్రతం ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడు దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద బహుళ నవమి, సెప్టెంబరు 23, సోమవారం

భాద్రపద బహుళ పంచమి తిథి నాడు నీరాజన నవమి పర్వమని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీపూజాధికాలు చేయాలని అందులో వివరించారు.

భాద్రపద బహుళ ఏకాదశి, సెప్టెంబరు 25, బుధవారం

ఈ ఏకాదశిని ఇందిరైకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలో దీనిని ‘ఇంద్రైకాదశి’గా పేర్కొన్నారు. ఇంద్రసేనుడనే వాడు ఈనాడు యమలోకంలో యాతనలు పడసాగాడు. అదే సమయంలో భూలోకంలో అతని కొడుకు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా యమలోకం నుంచి ఇంద్ర సేనుడు స్వర్గలోకానికి వెళ్లాడని పురాణకథ.

భాద్రపద బహుళ త్రయోదశి, సెప్టెంబరు 27, శుక్రవారం

భాద్రపద బహుళ త్రయోదశి తిథి కలియుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. ద్వాపర యుగాది అని తిథి తత్వంలోనూ, చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది. భాద్రపద కృష్ణ త్రయోదశి కలియుగాది దినం. ఈ యుగమున ఒక పాలు మాత్రమే ధర్మం నడుస్తుంది. కొంతకాలానికి అది కూడా నశిస్తుంది. అధర్మమే నడుస్తుంది. భగవంతుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులై ఉంటారు. దీనిని అయోమయ యుగమని కూడా అంటారు. ఈ యుగమున ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 మానవ సంవత్సరాలు.

భాద్రపద బహుళ చతుర్దశి, సెప్టెంబరు 27, శుక్రవారం

భాద్రపద బహుళ త్రయోదశి నాడే చతుర్దశి తిథి కూడా ప్రవేశిస్తోంది. ఈనాడు మాసశివరాత్రి. ఈనాటి ఉపవాసం వలన శివలోకప్రాప్తి అని తిథి తత్వం చెబుతోంది. స్మ•తి కౌస్తుభంలో ‘శస్త్రాదిహితన్యైకోదిఇష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు.

భాద్రపద బహుళ అమావాస్య, సెప్టెంబరు 28, శనివారం

ఈనాడు మహాలయ అవామాస్య. పితృకామావాస్యగా ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. పితృ దేవతల సంతృప్తి కోసం తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు. అలాగే, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, సెప్టెంబరు 29, ఆదివారం

ఈ రోజు నుంచి ఆశ్వయుజ మాసం ఆరంభమవుతుంది. అలాగే, ఈ తిథి నుంచే దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. దేవీ నవరాత్రుల పూజలు ఈ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. అలాగే, ఈ తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని పేర్కొన్నారు. కాగా, ఈనాటి నుంచే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభవుతాయి.

Review మంగళప్రద మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top