శక్తి మాసం

నవంబరు 27, బుధవారం, మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి – డిసెంబరు 31, మంగళవారం, పుష్య శుద్ధ పంచమి వరకు

శ్రీ వికారి నామ సంవత్సరం-మార్గశిర మాసం-హేమంత రుతువు-దక్షిణాయణం.

ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబరు మాసం చివరిది. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని మార్గశిర మాసంగా వ్యవహరిస్తారు. ఇది తొమ్మిదవ నెల. ఈ మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, ‘మాసానాం మార్గశీర్షోహ:’ అని నుడివారు. ఈ వాక్యం ఈ మాసపు ఉత్క•ష్టతను చెబుతోంది. మార్గశిర మాసంలో ప్రవేశించే చలి మంటలో పడినా పోదని సామెత.

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం.. మార్గశీర్షం. కార్తిక మాసంలోని నాగుల చవితి నాడు ప్రవేశించే చలి ఇప్పటికి బాగా ప్రబలుతుంది. మార్గశిర మాసంలో విష్ణువు విశేష రీతిలో పూజలు అందుకుంటాడు. ఈ మాసం విష్ణు సంబంధమైనదే కాక, మరెన్నో విధాలుగా కూడా మహత్తయినది. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని మార్గశిర మాసంలో శుద్ధ స్కంద షష్ఠి నాడు విశేషంగా ఆరాధిస్తారు. ఇక, దత్తాత్రేయుని జయంతి దినం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ధనుర్మాసం ప్రారంభయ్యేది కూడా ఈ మాసంతోనే. ఆధ్యాత్మికంగా మార్గశిరం ఇంతలా పవిత్రమై ఉంటే, ఇక ఆరోగ్యపరంగానూ ఈ మాసంలో మన శాస్త్రకారులు పెద్దపీట వేశారు. చలి గజగజ వణికించే మాసమిది. అందుకు తగినట్టే ఆహార నియమాలను, వ్రత నిబంధనలను విధించారు. ఒకప్పుడు సంవత్సరారంభం మార్గశిర మాసంలో అవుతుండేదట. మార్గశిరం తరువాత వచ్చేది పుష్య మాసం.. ఈ రెండు మాసాలు కలిసి హేమంత రుతువు. ఈ రుతువును భాగవంత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చలి, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. ఈ మాసంలో వచ్చే విశేష తిథుల గురించి, ఆయా తిథి పక్షాలలో పాటించాల్సిన వ్రత నియమాల గురించి తెలుసుకుందాం.
మార్గశిర శుద్ధ పాడ్యమి, నవంబరు 27, బుధవారం
ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది.
మార్గశిర శుద్ధ తదియ, నవంబరు 29, శుక్రవారం
ఈ తిథి నాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ మున్నగు వ్రతాలను ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.
మార్గశిర శుద్ధ చతుర్ధి, నవంబరు 30, శనివారం
ఈ తిథి నాడు ఢుంఢి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరం గల వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.
మార్గశిర శుద్ధ పంచమి, డిసెంబరు 1, ఆదివారం
ఈ తిథి నాగపంచమిగా దక్షిణాది ప్రాంతంలో ప్రసిద్ధి. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
మార్గశిర శుద్ధ షష్ఠి, డిసెంబరు 2, సోమవారం
మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఆంధప్రదేశ్‍లో ఇది సుబ్బారాయుడి షష్ఠిగా ప్రసిద్ధి. తమిళులు దీనిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగింది.
తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారమై ఉంది. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదా వరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని వారి నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు పడతాయి. కానీ వర్షించవు. కావునే వానలు కురవని మబ్బులకు షష్ఠి మబ్బులని పేరు. సుబ్రహ్మణ్యషష్ఠితో పాటు ఇంకా ఈ తిథి నాడు చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలు కూడా ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
మార్గశిర శుద్ధ సప్తమి, డిసెంబరు 3, మంగళవారం
వివిధ మత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. ఈ తిథి సూర్యారాధనకు ఉద్ధిష్టమైనది. నీలమత పురాణంలో ఈనాడు సూర్య పూజ చేయాలని పేర్కొంటే, స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సీత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం కూడా ఉంది.
మార్గశిర శుద్ధ అష్టమి, డిసెంబరు 4, బుధవారం
ఈ తిథి కాలభైరవాష్టమి. దీనినే కాలాష్టమి అనీ అంటారు. మహేశ్వ రాష్టమి, దుర్గాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, అన్నపూర్ణాష్టమి అనే పేర్లున్నాయి.
ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహత్య విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూల నాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికి వేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’.
ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరా చార్యులు) స్తోత్రం చేసి ఉన్నారు.
మార్గశిర శుద్ధ నవమి, డిసెంబరు 5, గురువారం
ఈనాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతా మణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది.
మార్గశిర శుద్ధ దశమి, డిసెంబరు 6, శుక్రవారం
ఈనాడు ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మార్గశిర శుద్ధ ఏకాదశి, డిసెంబరు 8, ఆదివారం
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనీ అంటారు. సౌఖ్యదైకాదశీ అనే నామం కూడా ఉంది.
దీనికి మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు. భగవద్గీత ఆవిర్భావ దినం కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే అని అంటారు. అందుకే ఈనాడు గీతా జయంతి జరుపుకుంటారు.
మార్గశిర శుద్ధ ద్వాదశి, డిసెంబరు 9, సోమవారం
తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం. ఈ భూమిపై మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఇవన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. ఇక, ఈనాడు హనుమమద్‍ వ్రతం చేస్తారని కొన్ని వ్రత గ్రంథాల్లో ఉంది. ఇంకా ఈ తిథి అనేక పర్వాలకు ప్రతీతమై ఉంది. మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం వంటివి కూడా ఈనాడు ఆచరిస్తారు.
మార్గశిర శుద్ధ త్రయోదశి, డిసెంబరు 10, మంగళవారం
ఈ తిథి నాడు అనంగ త్రయోదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హను మజ్జయంతిని జరుపుతారు.
మార్గశిర శుద్ధ చతుర్దశి, డిసెంబరు 11, బుధవారం
ఈ తిథి నాడు చాంద్రాయణ వ్రతం చేయాలి. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, ఆపై గౌరిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం. దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అనీ అంటారు. శివ చతుర్దశీ శ్రావణికా మున్నగు వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని ఆ వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు శివ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనికి ముందు రోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నిరాహారి అయి ఆబోతును పూజించాలి. మర్నాడు కమలములతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
మార్గశిర శుద్ధ పూర్ణిమ, డిసెంబరు 12, గురువారం
మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడు ఇట్లాగే నోము అసంపూర్తి. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు. కాగా, ఈ పున్నమి నాడు ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం. మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతా మణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది. వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచు కుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకారకాలైనవి. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు ముగుస్తాయి.
మార్గశిర బహుళ పాడ్యమి, డిసెంబరు 13, శుక్రవారం
కశ్మీరులో ఈనాడు కొత్త సంవత్సర మహోత్సవం జరుపుకుంటారని తెలుస్తోంది. నీలమత పురాణం కశ్మీరు దేశ ప్రధాన రచన. అందులో నవ సంవత్సరోత్సవ మహోత్సవం ఈనాడు జరుపుకుంటారని ఉంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
మార్గశిర బహుళ సప్తమి, డిసెంబరు 18, బుధవారం
ఈ తిథి నాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం వంటివి ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వ్రత నియమాలతో సహా ఉంది.
మార్గశిర బహుళ అష్టమి, డిసెంబరు 19, గురువారం
కాలభైరవాష్టమి తిథి అని కూడా అంటారు. భైరవ జయంతీ వ్రతం నిర్వహించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు అనఘాష్టమీ వ్రతం అనీ, కృష్ణాష్టమీ వ్రతమని, రుక్మిణ్యష్టమీ అని, కాలాష్టమీ అని ఉంది.
మార్గశిర బహుళ నవమి, డిసెంబరు 20, శుక్రవారం
ఈ తిథి నాడు రూప నవమీ వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర బహుళ ఏకాదశి, డిసెంబరు 22, ఆదివారం
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి పర్వం. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.
మార్గశిర బహుళ ద్వాద•శి, డిసెంబరు 23, సోమవారం
చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో- ఈనాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని చెబుతోంది.
మార్గశిర బహుళ త్రయోదశి, డిసెంబరు 24, మంగళవారం
మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మార్గశిర బహుళ అమావాస్య, డిసెంబరు 26, గురువారం
బకులామావాస్య సర్వం. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి నివేదం చేసే దినం ఇదని. ఈ తిథికే మహోదధ్యమావాస్య అనీ పేరు.
పుష్య శుద్ధ విదియ, డిసెంబరు 28, శనివారం
పుష్య శుద్ధ పాడ్యమి (డిసెంబరు 27)తో పుష్య మాసారంభం. పుష్య శుద్ధ విదియ (డిసెంబరు 28) తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించే విష్ణు వ్రతానికి ఈనాడే శ్రీకారం చుడతారు.
పుష్య శుద్ధ పంచమి, డిసెంబరు 31, మంగళవారం
ఈ తిథి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి.

మహత్తయినది.. మార్గశిర గురువార

మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు పవిత్రమైనవని ప్రతీతి. ప్రత్యేకించి మార్గశిర గురువారం తిరుపతిలో మహా మహనీయమై ఉంది. ఈనాటి సాయంకాలం స్వామికి గొప్ప పూలంగి సేవ నిర్వహిస్తారు. స్వామికి అలంకారంగా ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేసి, కేవలం పుష్పాల తోనే శ్రీవారిని అలంకరిస్తారు.
మరో విధంగా కూడా మార్గశిర మాసంలోని గురువారాలు ఉద్ధిష్టమై ఉన్నాయి. సాధారణంగా లక్ష్మీపూజలు, లక్ష్మీ ఆరాధాన శుక్రవారం చేస్తుంటారు. కానీ, మార్గశిరంలోని గురువారాల్లో లక్ష్మీదేవిని ఆరా ధించడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొత్తగా వివాహమైన పడుచులు ఏ కారణం చేతనైనా శ్రావణ శుక్రవారం నోములు చేయలేకపోతే మార్గశిరంలోని లక్ష్మీవారాలు నోచడం ఆనవాయితీ

సంక్రాంతికి శ్రీకారం.

ధనుస్సంక్రమణం మార్గశిర మాసంలోనే. ఈ నెలలోనే ధనుస్సు పడతారు. దీన్నే ధనుర్మాసం అంటారు. ఇది సంక్రాంతికి ఆరంభ సూచిక. ఈ సమయంలో తెలుగు నాట మహిళలు ఉదయాన్నే లేస్తారు. ముంగిళ్లు తుడిచి కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో ముద్దలు చేసి ఉంచుతారు. వాటికి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు. వాటిని పూజిస్తారు. శ్రీ భాగవతంలో ధనుర్మాస వ్రత ప్రస్తావన ఉంది. ధనుస్సంక్రమణం నాటి నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పెద్ద పండుగ నాడు రథం ముగ్గుతో సాగనంపుతారు. ధనుస్సంక్రమణం నాటి నుంచే హరిదాసులు తెల్లవారుజామునే ఇంటింటికీ హరికీర్తనలు ఆలపిస్తూ తిరుగుతారు

Review శక్తి మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top