కాణిపాక వినాయకుడూ- ప్రమాణాల దేవుడూ

ఆ బావిలోని రాయి వినాయకుని ఆకారంలో కనిపించింది. వెంటనే ప్రజలు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలు కొట్టగా కొట్టగా.. వాటి నుంచి వచ్చిన నీళ్లు బావి నుంచి పొంగిపొరలాయి. అలా ఆ నీటితో ఒకటిన్నర ఎకరాల నేల తడిచింది. అప్పట్లో.. అంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం ఒకటిన్నర ఎకరా నేలను ‘కాణి’ అని పిలిచే వారు. కొబ్బరినీరు పారిన ప్రాంతం కాబట్టి ‘కాణిపాకం’ అయ్యింది. అప్పటి నుంచి ఆ ఊరికి ఆ పేరే స్థిరపడిపోయింది.
సత్య ప్రమాణాల దేవుడు
‘కాణిపాకం వినాయకునిపై ఒట్టు’ అంటే చాలు అది సత్యప్రమాణం. ఆ దేవుడంటే అంత విశ్వాసం. అందుకే ఆయన సత్య ప్రమాణాల దేవుడిగా తరతరాలుగా వెలుగొందుతున్నాడు. వక్రతుండం.. మహాకాయం.. కోటి సూర్యుల ప్రభలతో ప్రకాశించే కాణిపా కం వినాయకుడు భక్తకోటికి కొంగుబంగారమై విలసిల్లుతున్నాడు. విఘ్నేశ్వరుడు స్వయంభువుగా అవతరించిన క్షేత్రమిది. వినాయక క్షేత్రాలలో ఇది అత్యంత ప్రాశస్త్యమైనది.
కాణిపాకం వినాయక క్షేత్రం జిల్లా కేంద్రం చిత్తూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాల మండలం బాహుదా నదీ తీరంలో ఉంది. స్వయంభువుగా వెలసిన ఈ వినాయకుడిది వెయ్యేళ్ల చరిత్ర. చోళ రాజుల పాలనలో కాణిపాకం గ్రామాన్ని విహారపురం అని పిలిచేవారు. పూర్వం ఈ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు అంధత్వం, మరొకరు మూగ, ఇంకొకరు చెవిటితనంతో బాధపడేవారు. వారికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగుచేసుకుంటూ జీవనం సాగిం చేవారు. బావిలోని నీటిని ఏతాలతో తోడి పంటలు పండించుకొనే వారు. కొన్నాళ్లకు బావిలోని నీరు పూర్తి గా అడుగంటిపోయింది. ఉన్న కాస్త నీటిని తోడే యత్నంలో ఏతానికి ఒక రాయి తగిలింది. ఆ రాయి నుంచి రక్తం ధారగా వచ్చి వాళ్ల శరీరాలపై పడింది. దీంతో వాళ్ల వైకల్యాలు మాయమై ముగ్గురు అన్నదమ్ములు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇది తెలిసి చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. బావిలోని రాయిని పరిశీలించగా అది విఘ్నేశ్వరుడి ఆకారంలో కనిపించింది. వెంటనే పూజలు ప్రారంభించి కొబ్బరికాయలు కొట్టసాగారు. అలా కొట్టిన నీళ్లతో బావి నిండిపోయి పైకంటూ పొరలి వచ్చి పక్కన ఉన్న ఒకటిన్నర ఎకరాబి నేల మేర పారింది. ఎకరాన్నర నేల (కాణి) కొబ్బరి నీళ్లు పారినందున ఆ ప్రాంతం కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది.
మహిమాన్విత దైవం..
కాణిపాకం వినాయకుని దర్శించుకునేందుకు శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు కాలినడకన బయల్దేరారు. కాలి నడకన రావటంతో బాగా అలసి పోయిన లిఖితుడికి ఆకలి వేసింది. ఎదురుగా కనిపించిన మామిడిచెట్టు నుంచి పండుకోసుకుని తిందామని అన్న శంఖుడిని అడిగాడు. అనుమతి లేకుండా పరుల సొమ్ము ముట్టుకోరాదని అన్న వాదించాడు. అయినా ఆకలికి ఆగలేక లిఖితుడు పండుకోసుకుని తిన్నాడు. దీంతో శంఖుడు అతనిని రాజు వద్దకు తీసుకువెళ్లి తగిన శిక్ష విధించమని కోరాడు. దానికి రాజు లిఖితుడి రెండు చేతులూ ఖండించాలని ఆజ్ఞాపించాడు. ఏదో చిన్న శిక్షతో పోతుందనుకున్నది ఊహించని శిక్షపడటంతో శంఖుడు తమ్ముడిని వెంటబెట్టు కుని కాణిపాకం వచ్చాడు. వినాయకుని ఎదుట నిలబడి జరిగింది చెప్పి రక్షించాలని వేడుకున్నాడట. వెంటనే లిఖితుడికి రెండు చేతులూ వచ్చాయి. అప్పట్నుంచి కాణిపాకం వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగా తెలుగునాట వినుతికెక్కాడు.
ఏటేటా పెరుగుతున్న మూర్తి
సజీవమూర్తిగా వెలిసిన స్వామి విగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. స్వామికి యాభై సంవత్సరాల క్రితం చేసిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదు. కాలానుగుణంగా విగ్రహానికి తొడిగే వెండికవచాల పరిమాణాలు మారుతుండటమే ఇందుకు నిదర్శనం. స్వామి ఆవిర్భవించినప్పుడు కనిపించని ••జ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
వైభవంగా బ్రహ్మత్సవాలు
వినాయక చవితి రోజున ప్రారంభమయ్యే కాణిపాకం గణనాథుని బ్రహ్మత్సవాలు 21 రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. స్వామిని హంస, నెమలి, మూషిక, శేష, వృషభం, గజ, అశ్వ, నంది, రావణబ్రహ్మ, సూర్యప్రభ, చందప్రభ, కామధేను, యాళి, కల్పవృక్ష వాహనాలపై ఊరేగిస్తారు. రథోత్సవం, పల్లకి సేవ, తెప్పోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే వీరాంజనేయ స్వామి, మణికంఠేశ్వరస్వామి, వరదరాజ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడకు వెళ్లటానికి చిత్తూరు నుంచి ప్రతి పావుగంటకు, తిరుపతి నుంచి ప్రతి అర గంటకు బస్సు సౌకర్యం ఉంది. ఇక, ప్రైవేటు వాహనాలు సైతం నిరంతరం అందుబాటులో ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజధాను ల నుంచి కూడా ఇక్కడికి విరివిగా బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. ఈ మహిమాన్విత సత్య ప్రమాణాల దైవాన్ని దర్శించుకోవడం ఆధ్యాత్మికపరులు తప్పనిసరి విధిగా భావిస్తారు. •

Review కాణిపాక వినాయకుడూ- ప్రమాణాల దేవుడూ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top