తన సొమ్ము అల్లం-పరుల సొమ్ము బెల్లం

‘లోకో భిన్నరుచి:’ అని ఆర్యోక్తి. ‘జిహ్వకొక రుచి. పుర్రెకొక బుద్ధి’ అంటోంది మన తెలుగు సామెత. లోకంలో ఎన్ని నాలుకలు ఉన్నాయో అన్ని రుచులూ ఉన్నాయి. ఎన్ని పుర్రెలున్నాయో అన్ని బుద్ధులూ ఉన్నాయి. మనిషి మనిషికీ శారీరకంగానే కాకుండా మనిషి బుద్ధుల్లోనూ, నడవడికల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది.
మన సాంఘిక జీవితంలోని పలు సంఘటనలు, సన్నివేశాలు ఆయా సామెతలకు వస్తువులయ్యాయి. మన సమాజంలో అన్ని తరహా మనుష్యులు ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి బోలెడన్ని సామెతలు ఉన్నాయి.
ఉదాహరణకు డబ్బున్న వాళ్లను తీసుకుంటే, ‘ఉన్నవాడు ఊరికి పెద్ద. చచ్చినవాడు కాటికి పెద్ద’ అంటారు. లోకం తీరు ఎలాంటిదంటే ఉన్న వాడు ఉన్నవాడికే పెడతాడు. లేనివాడూ ఉన్నవాడికే పెడతాడు.
‘కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు’.. అంటే డబ్బులో పుట్టి పెరిగిన వారికి కాకరకాయ ఒక కాయా కాదు.. అదొక కూరా కాదని అర్థం.
సంపాదించిన కొద్దీ దాన్ని కాపాడుకునే భారం కూడా ఎక్కువవుతుంది. అందుకే ‘ఎంత సంపదో అంత ఆపద’ అనే సామెత పుట్టింది.
‘డబ్బు పాపిష్టిది’. అయినా కొందరికి ‘డబ్బుకి ప్రాణానికి లంకె’. కొందరు ప్రాణం పోయినా రూపాయి వదులుకోరు. కొందరు డబ్బుకిచ్చే విలువ ‘మానాని’కి ఇవ్వరు. డబ్బూ ప్రాణాల కంటే మానానికిచ్చే విలువ ఏ కొందరిలోనో ఉంటుంది. ఇలాంటి వాళ్లు ‘ప్రాణం పోయినా మానం దక్కించుకోవాల’నే ఉద్దేశంతో ఉంటారు.
డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే వైఖరి ప్రస్తుత కాలానిది. అందుకే దీన్ని ఆనాడే ఊహించి, ‘డబ్బుంటే కొండ మీది కోతి కూడా దిగి వస్తుంది’ అనే సామెతను పుట్టించారు.
సమాజంలో తమ పైసలను ఆచితూచి.. ఇతరులది ఐసాపైసాగా వెచ్చించే వాళ్లే అధికం. ఇలాంటి వాళ్లనుద్దేశించి, ‘తన సొమ్ము అల్లం పరుల సొమ్ము బెల్లం’ అనే సామెతను వాడుతుంటారు. ఇంకా ఇలాంటి వాళ్లనుద్దేశించి, ‘ఉద్దరగా వస్తే ఊరంతా నాదే’ అంటారనే సామెత కూడా ఉంది.
దారిద్య్రం మహా చెడ్డది. అందుకే ‘దారిద్య్రం ఆరో ఇంద్రియం’ అనే సామెత పుట్టింది. ‘చావు కంటే గండం లేదు.. గోచి కంటే దరిద్రం లేదు’ అని కూడా అంటారు. అలాగే, దారిద్య్రంతో బాధపడే వారిని ఉద్ధరించేందుకు ‘దరిద్రుడికి దేవుడే తోడు’ అనే సామెతను పుట్టించారు.
‘నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు’ అని కూడా అంటారు. నిత్యమూ దారిద్య్రం తాండవిస్తున్నపుడు వగచినా ఫలం లేదు కాబట్టి అలాంటి వాడు నిశ్చింతగా ఉంటాడనేది ఉద్దేశం.
ఇంకా, ‘ఎండగాచిన చోటే వెన్నెల కూడా కాసేది’, ‘కష్టపడి సుఖపడాలి’, ‘కలకాలం ఆపదలు కాపురముంటాయా?’ అనే సామెతలు డబ్బు లేక బాధపడే వారిలో భరోసా నింపుతాయి.

ఇంకా,
‘గోరుచుట్టుపై రోకలి పోటు’, ‘తగిలిన కాలికే తగులుతుంది. నొగిలిన కొంపే నొగులుతుంది’, ‘పుండున్న వేలికే పుల్ల తగులుతుంది’, ‘పుండు మీద కారం చల్లినట్టుగా..’, ‘కూటి పేద తోడు పోగొట్టుకుంటాడు’, ‘అభాగ్యుడికే ఆకలెక్కువ. నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ’, ‘దరిద్రుడికి పిల్లలెక్కువ’, ‘ఆకలి రుచెరగదు. నిద్ర సుఖమెరుగదు’, ‘పేదవాని కోపం పెదవికి చేటు’, ‘కూటికి పేద అయితే కులానికి పేదా?’, ‘కలిమి గలవాడే కులము గలవాడు’, ‘పేదవాడి పెళ్లాం వాడకెల్లా వదిన’, ‘నిర్భాగ్య దామోదరుడికి అభాగ్యపు అల్లుడే చేర వస్తాడు’.. ఇవన్నీ దారిద్య్రంతో, కష్టాలతో బాధపడే వారి గురించి తెలిపే సామెతలు.

Review తన సొమ్ము అల్లం-పరుల సొమ్ము బెల్లం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top