‘అనంత’శ్రేయస్సు మీ సొంతం

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. సెప్టెంబరు 23, భాద్రపద శుద్ధ చతుర్దశి ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ సందర్భంగా..

వతాలలో ప్రశస్తమైనది అనంత పద్మనాభ వ్రతం. ఇది ఏటా భాద్రపద శుద్ధ చతుర్దశి తిథి (సెప్టెంబరు 23, 2018) నాడు వస్తుంది. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో, వ్రత మహిమ ఏమిటో తెలుసుకుందాం.
అరణ్యవాసం చేస్తున్న పాండవులు ఏ వ్రతం చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయో చెప్పాలని శ్రీకృష్ణుడిని కోరారు. కృష్ణుడు వారికి అనంత పద్మనాభ వ్రతాన్ని ఉపదేశించాడు. ఆయన చెప్పిన ప్రకారం..
సుమంతుడనే బ్రాహ్మణుడు తన కుమార్తె అయిన ‘శీల’ను కుండిన ముని పరంపరకు చెందిన కౌండిన్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పగింతలప్పుడు సారె పెట్టలేక- కాస్తంత సత్తుపిండిని మాత్రం కుమార్తెకు ఇచ్చి పంపిం చాడా తండ్రి. నవ వధూవరులు బండిలో ప్రయాణ మయ్యారు. మధ్య దారిలో కౌండిన్యుడు మధ్యాహ్నిక క్రియల నిమిత్తం బండిని ఆపించి, నదిలో స్నానానికి వెళ్లాడు. ఆ సమయానికి అదే నదీ తీరంలో ఎర్రని వస్త్రాలు కట్టుకున్న కొందరు పూజ చేయడాన్ని శీల చూసింది. వారి వద్దకు వెళ్లి- ‘అదేమి పూజ?’ అని అడిగింది. వారు ‘అనంత వ్రత’మని బదులిచ్చారు. శీల కూడా ఆ వ్రతం చేయాలని ఉత్సాహపడి, అక్కడి వారి సహాయంతో వ్రతాన్ని ఆచరించి తోరం కట్టుకుని, తన వద్ద ఉన్న సత్తు పిండినే బ్రాహ్మణుడికి వాయన దానమిచ్చింది. అంతలో స్నానం చేసి వచ్చిన కౌండిన్యుడు భార్యతో కలిసి ఆ వ్రతగత్తెలు పెట్టిన భోజనాన్ని చేసి తిరుగు ప్రయాణ మయ్యాడు.
శీల వ్రతం చేసిన కారణంగా అనంతుడు కరుణించి వారింట సిరిసంపదలు కురిపించాడు. భార్యాభర్తలు సుఖంగా ఉంటున్నారు. ఒకనాడు శీల చేతికి ఉన్న తోరం కౌండిన్యుడి కంటపడింది.
‘అది ఏమిటి?’ అని భార్యను ప్రశ్నించాడు.
‘అనంతుడి తోరం’ అని భార్య బదులివ్వగానే, ‘నాకు ముప్పయి మూడు కోట్ల మంది దేవతల పేర్లూ తెలుసు. అనంతుడు ఎవరు? ఎప్పుడూ ఈ పేరు వినలేదే?!’ అని కౌండిన్యుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
‘అనంతుడు అంటే అనంత పద్మనాభ స్వామి. సాక్షాత్తూ విష్ణుమూర్తే ఆయన’ అని శీల చెప్పింది.
కౌండిన్యుడు ‘అయినా నాకు అనంతుడెవరో తెలియదు’ అంటూ ఆమె చేతికి ఉన్న తోరాన్ని తెంపి నిప్పుల్లోకి విసిరాడు. భక్తురాలైన శీల చటుక్కున దానిని తీసి పాలకుండలో దాచింది.
కౌండిన్యుడి అహంకారం పట్ల కోపితుడైన అనంతుడు ఆగ్రహించి, అతని సంపదను హరించాడు. పశువులను దొంగలు అపహ రించుకుపోయారు. ఇల్లు కూలిపోయింది. బంధు వులు విరోధులయ్యారు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండకుండా మాయమై పోయాయి. అంత టితో కౌండిన్యుడు పశ్చాతాప్తుడై, అనంతునిపై భక్తి కలిగి ఆయన దర్శనం కోసం అడవులలో పడి తిరగసాగాడు. దారిలో అతనికి ఒక పక్షయినా వాలక, ఒక పురుగైనా పట్టక విరగకాసి ఉన్న మామిడిచెట్టు కనిపించింది. కౌండిన్యుడు ఆ చెట్టుని అనంతుడి గురించి అడగగా ‘నాకు తెలియదు’ అని చెప్పింది.
ఇంకొంచెం ముందుకు వెళ్లాక మోకాలి లోతున ఏపుగా పెరిగిన గడ్డిలో అటూఇటూ మసులుతూ కూడా పరకైనా ఎంగిలి పడని ఆవుదూడల్ని చూశాడు. కౌండిన్యుడు వాటిని కూడా అనంతుడి గురించి అడిగాడు. అవి కూడా తెలియదని బదులిచ్చాయి.
మరికొంచెం ముందుకు వెళ్లి సుశోభితాలై, ఒకదాంట్లోంచి మరొక దాంట్లోకి నీళ్లు పారుతున్న రెండు చెరువులనూ, వాటి వెనక ఉన్న ఒక గాడిదనూ, ఏనుగునూ చూసి అనంతుడి గురించి కౌండిన్యుడు విచారించాడు. అవి కూడా ఆయ నెవరో తమకు తెలియదని చెప్పాయి.
అలా కనిపించిన ప్రతి దానినీ అడుగుతూ, ‘తెలియ’దనే జవాబు విని హతాశుడవుతూ కౌండిన్యుడు ఒకానొకచోట చతికిలబడిపోయాడు. అప్పుడు అనంతుడు అతని పట్ల దయ కలిగిన వాడై, ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషంలో అక్కడకు వచ్చాడు.
‘ఓ బ్రాహ్మణుడా! నాతో వస్తే నీకు అనంతుడిని చూపిస్తాను’ అని కౌండిన్యుడితో అన్నాడు.
కౌండిన్యుడు అతని వెంట వెళ్లాడు. ఆ వృద్ధుడు అతనిని దేవతా స్త్త్రీలతో కూడుకుని ఉన్న తన నివాసానికి తీసుకెళ్లాడు. ఆ నివాసపు లోపలి భాగానికి వెళ్లిన తర్వాత ఆ వృద్ధుడు శంఖచక్రగదా పద్మధారీ, పీతాంబరవాసీ, మణిహార కిరీట కుండల శోభితుడూ, గరుడ సేవితుడూ, శ్రేష్ఠమైన సింహాసనం మీద కూర్చున్న వాడూ అయిన అనంత పద్మనాభస్వామిగా మారిపోయి- కౌండిన్యుడికి దర్శనమిచ్చాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూసి, కౌండిన్యుడు భక్తి పారవశ్యంలో మునిగి ‘హే వైకుంఠా! శ్రీవత్స పదలాంచనా! గోవిందా! జనార్ధనా! నారాయణా! యజ్ఞపురుషా! సుజనసంరక్షకా! నీ నామ స్మరణ మాత్రం చేతనే నా పాపాలన్నీ నశించిపోయాయి. ప్రళయమనే బడబాగ్నులతోనూ, మోహాలనే దీవులతోనూ నిండి ఉన్న జనన మరణ సంసార సముద్రాన తెప్పవై భక్తుల్ని గట్టెక్కించే వాడా! సృష్టి స్థితి లయ కారకుడా! నీ దర్శనంతో నా జన్మ సార్థకమైంది. ఇంక ఈ జీవితంలో నిన్ను మరు వను. నీ నామ స్మరణ విడువను’ అని ప్రార్థించాడు.
ఆ ప్రార్థనకు ఆనందించిన అనంతుడు అతనికి బతికినంత కాలం భోగభాగ్యాలనూ, వాటి వినియోగం విషయంలో ధర్మబుద్ధినీ, చరమ దశలో మోక్షాన్నీ వరంగా అనుగ్రహించాడు. అనంతరం కౌండిన్యుడు తనకు మార్గమధ్యంలో ఎదురైన మామిడిచెట్టు వగైరాల గురించి కౌండిన్యుడు అనంతుడిని ప్రశ్నించగా, ఆయన ఇలా బదులిచ్చాడు.
‘పూర్వజన్మలో తాను విద్యావంతుడై ఉండీ కూడా ఆశ్రయించిన వారికి అక్షరం ముక్క నేర్పని పండితుడై, ఫలించి కూడా ఎవరికీ పనికిరాని మామిడిచెట్టు అయ్యాడు. తనకెంత సంపద ఉన్నా ఇతరులకు మెతుకైనా విదల్చని పిసినారి ధనవంతులైన తండ్రీ కొడుకులే ఈ జన్మలో గడ్డిని తినడానికి నోరులేని ఆవుదూడలుగా పుట్టారు. చవిటి నేలను బ్రాహ్మణులకు దానమిచ్చిన వాడు వృషభమై మసలుతున్నాడు. ఆ చెరువులు రెండూ ధర్మాధర్మాలు. పరనింద చేసిన వాడు గాడిద. పరుల సొత్తును అమ్ముకొని తిన్నవాడు ఏనుగు. నిన్నిక్కడకు తెచ్చిన వృద్ధ బ్రాహ్మణుడిని నేనే’ అని కౌండిన్యుడి సందేహాలను తీర్చాడు అనంత పద్మ నాభస్వామి.
అనంతరం ఇంటికి చేరిన కౌండిన్యుడు అనంత వ్రతాన్ని ఆచరించి చివరిదశ లో సకుటుంబంగా నక్షత్ర స్థాయిని చేరి, ఈనాటికీ నక్షత్ర మండలంలో మనకు ద్యోతకమవుతున్నాడు.
ఇదీ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన అనంత పద్మనాభస్వామి వ్రత కథ. కృష్ణుడు పాండవులతో ఇంకా ఇలా చెప్పాడు.
‘ధర్మరాజా! లోపాముద్ర సమేతంగా అగస్త్యుడీ వ్రతాన్ని ఆచరించి లోకాన వ్యాపింప చేశాడు. సగర, భరత, దిలీప, హరిశ్చంద్ర, జనకాది రాజు లంతా తమ తమ ధర్మపత్నులతో సహా ఈ వ్రతాన్ని ఆచరించి తరించారని బోధించాడు.
అయితే, కాలాంతరాన, యుగ ధర్మం రీత్యా పురుషులంతా సంసార వ్యవహారాలలో మునిగి తేలడంతో ఈ వ్రతాన్ని ప్రస్తుతం స్త్రీలు ఆచ రించడం ఆచారంగా మారింది. తమ యొక్క, తమ భర్తల యొక్క, పుత్రుల యొక్క, ప్రియుల యొక్క శ్రేయస్సును కోరి ఈ వ్రతాన్ని ఆచరిస్తు న్నారు. ఈ వ్రతాన్ని ఆచరించలేని స్త్రీలు- భక్తి పూర్వకంగా ఈ కథను విన్నా, చదివినా కూడా కష్టాలు దూరై – ఇష్టప్రాప్తి అయి చిరకాలం సుఖిస్తారు.
వ్రతాచరణ ఇలా..
అనంత పద్మనాభ వ్రతాన్ని పద్నాలు (14) సంవత్సరాల పాటు ఆచరించాలి. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చతుర్ధశి నాడు నదీ స్నానం చేసి నదీ తీరంలోనే ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజా స్థలాన్ని గోమయంతో అలికించి సర్వతోభద్ర మండలం చేసి, దుద్దుతో కూడిన అష్టదళపద్మాన్ని నిర్మించి, దాని చుట్టూ తెల్ల బియ్యం పిండితోనూ, పంచవన్నెలతోనూ ముగ్గులు పెట్టించి, మండలానికి కుడి వైపు కలశం పెట్టాలి. కలశం ముందు- 14 ముడులు కలిగిన తోరాన్ని కుంకుమలో తడిపి ఉంచాలి. మధ్యలో దర్భలతో చేసిన అనంతుడి ప్రతిమను ప్రతిష్ఠించాలి. అది ఏడు పడగల శేషువు మీద శయనిస్తున్నట్టు ఉండాలి. పచ్చని కన్నులుండాలి. నాలుగు చేతులుండాలి. కుడివైపు పై చేతిలో శంఖం, కింది చేతిలో పద్మం, ఎడమ వైపు ఎగువ చేతిలో చక్రం, దిగువ చేతిలో గద ఉండాలి. కలశ, మండల, ప్రతిమలు.. మూడింటా స్వామిని పూజించాలి. 14 రకాల ఉపచారాల ప్రకారం పూజించి, 14 రకాల నైవేద్యాలు ఉంచాలి. ఐదు పదుల (7,500 గ్రాములు) గోధుమపిండితో తగినంత బెల్లం 28 అతిరసాలు (అరిసెలు) చేసి అందులో సగం (14) బ్రాహ్మణునికి వాయనంగా దానమిచ్చి, తక్కినవి తాము బంధుసమేతంగా భుజించాలి. అనంతరం పూజలో పెట్టిన తోరం తీసి కట్టుకోవాలి. పూజలో అన్నీ 14 సంఖ్యలోనే ఉండాలి. పైన చెప్పిన విధంగా 14 ఏళ్ల పాటు స్వామిని పూజించాక ఉద్యాపన చేసుకోవాలి. అది కూడా వ్రతం మాదిరే ఆచరించాలి. ఉద్యాపనాన్ని సంకల్పించుకోవాలి.

Review ‘అనంత’శ్రేయస్సు మీ సొంతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top