ఉగాది నేలంతా వెలుగుల కాంతి

ఉగాది మనకు కొత్త సంవత్సర వేడుక. ఉగాది వెనుక ఎన్నో పురాణగాథలు ఉన్నాయి. దేశ విదేశాల ముచ్చట్లు ఉన్నాయి. ఎన్నో వింత సంగతులు ఉన్నాయి. వాటి గురించి అవలోకనం.

భరతఖండం పుణ్యభూమి. ఈ నేల అణువణువూ ఆధ్యాత్మికతతో నిండి ఉంది. అంతేకాదు.. అది చుట్టుపక్కల దేశాలకూ వ్యాపించింది.
ఉగాది విశేషాల్లోకి వెళ్తే.. బ్రహ్మ అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునేనని అంటారు. సృష్టికర్త మొదట రోజుల్ని, వారాలను, నెలలను, సంవత్సరాలను ఏర్పాటు చేశాడట. కాలాన్ని సృష్టించాక గ్రహాలను, నీటిని, వృక్షాలను, ఆ తరువాత జీవరాశులను.. ఇలా ఒక్కొక్కటిగా రూపొందించాడని అంటారు. ఇక, ఉగాదితో ముడిపడిన పుణ్యభూముల గురించి తెలుసుకుందాం.
తమిళనాడులోని శ్రీరంగం ఆలయం వెనుక ఉగాదితో ముడిపడిన కథ ఉంది. విష్ణుమూర్తి నాభిలో నుంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టి బాధ్యత తీసుకున్న బ్రహ్మదేవుడు తనతో పాటు ఉండాలని విష్ణువును కోరతాడు. తాను ఉండలేనని తన విగ్రహాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకు ఇస్తాడు. దానిని పూజిస్తూ సృష్టి పూర్తి చేసిన తరువాత విగ్రహాన్ని సూర్యుడికి ఇస్తే, ఆయన మనువుకు, ఆయన తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇస్తాడు. తరువాత శ్రీరాముడు కూడా అదే విగ్రహాన్ని ఆరాధించి చివరికి విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు విష్ణువు విగ్రహాన్ని పొరపాటున నేలపై పెడతాడు. ఇది జరిగింది ఉగాది రోజే నట. విగ్రహం స్థిరంగా అక్కడే ఉండిపోతుంది. ఆ విగ్రహమే శ్రీరంగం లోని రంగనాథస్వామి అని ప్రతీతి.
తమిళ ప్రజలకు ఏప్రిల్ మధ్యలో కొత్త సంవత్సరం ప్రారంభమవు తుంది.
‘పుతండు’గా పిలిచే ఈ పండుగనే శ్రీలంక ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడో వింత ఆచారం ఉంది. తీగలకు బన్నులను వేలాడదీస్తారు. వాటిని తినాలని పోటీ పడే వారి చేతులు వెనక్కి కట్టేస్తారు. కేవలం నోటితోనే ఆ బన్నులను కొరుక్కు తినాలి.
థాయ్లాండ్ ప్రజలు ఉగాది పండుగ సమయంలోనే ‘సోంక్రన్’ పేరుతో వేడుక చేసుకుంటారు. ఇది వాళ్లకు నూతన సంవత్సరం ఆరంభ దినం. ఈ వేడుకలు భలే తమాషాగా ఉంటాయి. ప్రజలందరూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. అంతేకాదు, ఏనుగులు కూడా వీధుల్లో తిరుగుతూ తొండాల్లో నీళ్లు పట్టుకుని జనాలపై జల్లులు కురిపిస్తాయి.
మన ఉగాది నేపాల్ దేశ ప్రజలకూ కొత్త సంవత్సర పండుగే. అక్కడ ఈ పర్వాన్ని ‘బిక్రమ్ సంతాబ్’గా పిలుస్తారు. భక్తపూర్లో ఈ సందర్భంగా బిస్కెట్ జాతర జరుగుతుంది. ఇందులో జరిగే రథోత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడతారు.
మహారాష్ట్రీయులు ఉగాదిని గుడిపడ్వాగా నిర్వహించుకుంటారు. పురాణాల ప్రకారం.. ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని మన మాదిరిగానే మహారాష్ట్రీయుల నమ్మకం కూడా. ఈ రోజు నుంచే సత్యయుగం ప్రారంభమైందని విశ్వసిస్తారు. ఉగాది నాడు మహిళలు ఉదయాన్నే లేచి, రంగులతో ఇంటి ముంగిళ్లను ముగ్గులతో నింపుతారు. ఇవి ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులను తొలగించి, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయని నమ్ముతారు. గుడి పడ్వా అలంకరణలో భాగంగా ఇంటిని రంగురంగుల పూలతో అలంకరిస్తారు.
ఇంకా తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖీగానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్గానూ జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం అన్నిచోట్లా తప్పనిసరి విధి. సిక్కుల వైశాఖీ ఉగాది పండుగకే వన్నె తెచ్చేంత వైభవంగా జరుగుతుంది.

Review ఉగాది నేలంతా వెలుగుల కాంతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top