సిగ్గూ.. ఎగ్గూ లేదా?!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.

ఊడే పంటి కింద రాయి పడ్డట్టు
అసలే కష్టాలలో ఉన్నపుడు దానికి తోడు మరిన్ని కష్టాలు వచ్చిపడి భరించలేని స్థితి ఎదురైన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఊడిపోబోయే పన్ను చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆ బాధను ఎలాగో ఒకలాగా భరిస్తూ ఆకలిని చల్లార్చుకోవడం కోసం ఆహారం తినడానికి ప్రయత్నిస్తే ఆ ఊడే పంటి కిందే రాయి పడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. అంతే బాధను రెట్టించిన కష్టకాలంలో పొందడం అనే విషయాన్ని గురించి తెలిపేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం జరుగుతుంటుంది.

వడ్డీ వేగానికి వడి గుర్రాలు కూడా ఆగవన్నట్టు
వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకునేంతలోనే మళ్లీ నెల తిరిగి రావడం, తిన్నా తినకపోయినా అప్పుల వాళ్లకు వడ్డీ కట్టడం జరుగుతుంటుంది. వడ్డీ కట్టే రోజు ఎంతో వేగంగా వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ వేగం ఎలాంటిదంటే బాగా వడిగా పరుగెత్తే గుర్రపు వేగం కన్నా ఎక్కువ వేగంగా ఉంటుందన్న భావన ఈ జాతీయం పుట్టుకకు వేదికైంది. వడ్డీ వేగానికి వడి గుర్రాలు కూడా ఆగవన్నట్టు కనిపిస్తోంది. మొన్నే కదా వడ్డీ కట్టాం.. మళ్లీ అంతలోనే కట్టాల్సిన రోజు రానే వచ్చిందే అని రుణగ్రస్తులు చింతించే సందర్భంగా ఇటువంటి భావన కలుగుతుందన్న మాట.

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు..
కొంతమంది అప్పగించిన పనిని సమయానికి ముగించకుండానే ఆ పని ముగించేసినట్టు చెబుతుంటారు. నిక్కచ్చిగా నిలదీసి అడిగితే తప్పించుకోవడానికి ఏవేవో కారణాలను, సాకులను చూపుతుంటారు. అలాంటి వారిని గురించి లేదా అటువంటి పరిస్థితులను గురించి తెలియ చెప్పాల్సి వచ్చినపుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఒక వ్యక్తికి అన్నం వండే పనిని అప్పగించారట. అన్నం వండుతానని ఒప్పుకున్న మనిషి వంట అయిందా అని అడిగితే అయింది అని చెప్పాడు. తీరా ఏది అని అడిగితే ఎండబెట్టిన వడ్లు సరిగా ఆరలేదని, అందుకే వాటిని దంచలేదని, ఆ కారణం చేతనే అన్నం వండటానికి కావాల్సిన బియ్యం రాలేదని, వంట సమయానికి కాకపోవడానికి కారణం అదేనని, తన తప్పేమీ లేదని చెప్పాడట. ఈ ఘటన ఆధారంగానే పని చెయ్యకుండా చేశామని చెప్పి తప్పించుకుని తిరుగుతూ, వంకలు చెప్పే వారిని గురించి ‘వంట అయింది కానీ వండ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు’ అనే జాతీయాన్ని వాడుతుంటారు.

మొండికి సిగ్గులేదు.. మొరటుకు ఎగ్గులేదు
మానవ మనస్తత్వాలను విశ్లేషించే జాతీయాలలో ఇదీ ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారు ఎగ్గును లెక్క చేయరు. ఎగ్గు అంటే కీడు అని అర్థం. మొరటుగా ఆలోచించే వారు తమకు కీడు కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారన్నది పై పలుకుబడి యొక్క భావన. ఆ భావనల ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ‘మొండికి సిగ్గు లేదు. మొరటుకు ఎగ్గు లేదన్నట్టుంది నీ ప్రవర్తన. దాన్ని మార్చుకోవడం మంచిది’ అని హితవు చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు.

Review సిగ్గూ.. ఎగ్గూ లేదా?!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top