ధ్యాన బలం

కార్తీక పున్నమి రోజు. ఆకాశం నిర్మలంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్టు ప్రకాశిస్తోంది. జేతవనంలోని బౌద్ధారామం దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో భిక్షువులు జేతవనానికి వస్తూనే ఉన్నారు. మళ్లీ మూడు నెలల తరువాత ఆరామం భిక్షువులతో నిండుగా కళకళలాడుతోంది.
బౌద్ధ భిక్షువులకు ఆషాఢ పున్నమి నుంచి కార్తీక పున్నమి వరకు వర్షావాస కాలం. ఈ నాలుగు నెలల కాలంలో ఓ మూడు నెలలు ఆషాఢ పున్నమి నుంచి ఆశ్వయుజ పున్నమి వరకూ, లేదా శ్రావణ పున్నమి నుంచి కార్తీక పున్నమి వరకూ గల మూడు నెలల కాలంలో భిక్షువులు గ్రామాల వెంట తిరుగుతూ భిక్ష స్వీకరించకూడదు. సాధ్యమైనంత వరకు గ్రామాలకు, జనావాసాలకు దూరంగా వనాలలోనో, కొండ గుహల్లోనో ఏకాంతంగా గడపాలి. ధ్యాన సాధన పెంపొందించుకోవాలి. తమను తాము తీర్చిదిద్దుకోవాలి. ఆ మూడు మాసాల సాధన ఫలితాన్ని వచ్చాక మిగిలిన భిక్షువులతో పంచుకోవాలి. ఇక ఆనాటి నుంచి తిరిగి చారిక చేస్తూ ధమ్మ ప్రచారానికి వెళ్లిపోవాలి.

అలా వర్షావాసం గడిపి వచ్చిన వారిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు.
ఒకరు సుమేధుడు. రెండో వాడు తిష్యుడు.
ఇద్దరూ వచ్చి బుద్ధుడికి నమస్కరించారు. ఒకపక్క నిలబడ్డారు.
‘భిక్షువులారా! మీ వర్షావాసం సుఖంగా గడిచిందా? మీ సాధన చక్కగా సాగిందా?’ అని బుద్ధుడు వారిద్దరినీ అడిగాడు.
ఇద్దరూ ‘భగవాన్‍! అంతా సవ్యంగా సాగింది’ అని నమస్కరిస్తూ తలలూపారు.
అప్పుడు బుద్ధుడు ముందుగా ‘తిష్యా! వర్షావాస కాలంలో నువ్వు ఏం చేశావు?’ అని అడిగాడు.
తిష్యుడు కాస్త ముందుకు వచ్చి, ‘భగవాన్‍! నేను ఉన్నచోట వనం చాలా సుందరంగా ఉంది. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో రకరకాల తామరలు ఉన్నాయి. నా ధ్యాసనంతా తామరపూలపైనే కేంద్రీకరించాను. ఆ పూల మీద వాలే తుమ్మెదలు, రంగురంగు రెక్కల సీతాకోకచిలుకలూ వాటి ఝుంకారాలపై మనసు నిలిపాను. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపాను’ అని బదులిచ్చాడు.
‘మరి నువ్వు ఏం చేశావు సుమేధా?’ అని బుద్ధుడు రెండో శిష్యుడిని అడిగాడు.,
‘భగవాన్‍! నేను ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ధ్యానసాధన చేసి ఏకాగ్రతను, ఎరుకను సాధించాను. ధ్యానంలో మరో మెట్టుకు చేరాను’ అని తాను పొందిన స్థితిని గురించి బుద్ధుడికి చెప్పాడు సుమేధుడు.
అప్పుడు బుద్ధుడు- ‘భిక్షువులారా! భిక్షువులు ధ్యానసాధనలో బలహీనులు కాకూడదు. ధ్యానబల సంపన్నులు కావాలి. బలమైన గుర్రమే యుద్ధంలో విజయం సాధిస్తుంది. పోటీలో గెలుపొందుతుంది. భిక్షువులు కూడా అంతే. ధ్యానబల సంపన్నుడైన భిక్షువే దు:ఖ నివారణ మార్గంలో ముందుంటాడు. గొప్ప భిక్షువుగా రాణిస్తాడు. నిర్వాణ పథాన్ని పూర్తిగా దాటగలుగుతాడు. తిష్కా! ఇక నీ సమయాన్ని ఎప్పుడూ వృథా చేసుకోకు. బలాన్ని పోగొట్టుకోకు’ అని బోధించాడు.
ఆ తర్వాత వర్షావాస కాలంలో తిష్యుడు కూడా ధ్యానబలాన్ని సాధించాడు.

Review ధ్యాన బలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top