వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాది

ఇది శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది. సుఖ దు:ఖాల కలనేత అయిన జీవిత ప్రయాణంలో మరో మజి లీగా ఈ నవ వసంతాన్ని ఆహ్వా నిద్దాం. తెలుగు సంవత్సరాల పేర్లను పరిశీలిస్తే.. మనకు ఒక విషయం అర్థ మవుతుంది. కొన్ని పేర్లు శుభసూచకం గానూ, మరికొన్ని అశుభమైనవిగానూ, కొన్ని తటస్థంగానూ అనిపిస్తాయి.
మనిషి జీవితం కూడా ఈ మూడింటి మిశ్రమం. ఆరు రుచుల ఉగాది పచ్చడిలోనే కాదు.. అరవై తెలుగు సంవత్సరాల పేర్లలో కూడా జీవితాన్ని మంచిచెడుల సంగమంగా స్వీకరించే అవగాహనను కల్పించారు మన పూర్వీకులు. నిజానికి ఈ రోజున పంచాంగ శ్రవణం మాదిరిగా వ్యక్తిత్వ వికాస పాఠాల బోధన జరగాలేమో. మనిషిని మానసికంగా బలంగా తయారు చేసి స్థితప్రజ్ఞత దిశగా అడుగులు వేయించడమే ఉగాది ఆంతర్యం. తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన ఈ ఉగాది మీద ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగిన పాట ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. ఆ లోటు ఎప్పుడు తీరుతుందో? ఇక, పద్యాల్లో అయితే ఉగాది మీద అనేకం ఉన్నాయి. అయితే, పాటగా పాడుకోదగిన ఛందస్సులో ‘లయగ్రాహి’ అనే వృత్తం ఒకటి. ప్రతి పాదంలోనూ నాలుగు యతి స్థానాలు ఉండటం దీని ప్రత్యేకత. పదాలు సరిగ్గా విడగొట్టుకుని రాసుకుంటే పాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ ఛందస్సులో ఉగాది మీద ప్రముఖ సినీ గీత రచయిత సిరాశ్రీ రాసుకున్న పద్యమిది.
అచ్చమగు వేడుకగ పచ్చనగు వేదికగ
వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాదీ
మెచ్చగనె కోకిలలు హెచ్చగనె రాగములు
విచ్చగనె ఉల్లములు వచ్చెను ఉగాదీ
పచ్చివగు మామిడులు గిచ్చగనె నాలుకలు
గుచ్చగనె కోరికలు వచ్చెను ఉగాదీ
చిచ్చుగల భాస్కరుడు యిచ్చెనుగ దీవెనలు
తెచ్చెనుగ చైత్రమును వచ్చెను ఉగాదీ
ఉగాదిపై సిరాశ్రీ రాసుకున్న మరో పద్యమిది.
ఉండునని సంపదలు పండగనె పుణ్యములు
మెండుగనె చాటునది పండుగ ఉగాదీ
దండలుగ బంధములు దండిగనె గంథములు
గుండెలలో నింపుకొను పండుగ ఉగాదీ
భాండమున వంటను వండగనె ఇంపుగనె
నిండుగనె వచ్చునది పండుగ ఉగాదీ
అంగయగు దైవముకు దండములు పెట్టగనె
కుండలలో పచ్చడుల పండుగ ఉగాదీ
మరో చలనచిత్ర గీత, మాటల రచయిత కృష్ణకాంత్ (కె.కె.) ఉగాదిపై రాసిన మరో పద్య మిది.
మామిడాకు వేపపువ్వు తెంపుకొచ్చిన జ్ఞాపకాలు
పసుపుదారం పచ్చనాకు కలిపి కట్టే కంకణాలు
చుక్కనీరు ముట్టకుండా నోటనేది పెట్టకుండా
పచ్చడున్నా మట్టికుండా షట్రుచులు మరవకుండా
గుర్తులున్నాయి గుండెనిండా చేదుచేదని గునుగుతూనే
పరుగుపరుగున తాగుతూనే ఎండాకాలం వచ్చే వర్షం
రాకతోనే తెచ్చే హర్షం కోకిలమ్మకు ఎందుకిష్టం చైత్రమాసపు వాసనంటే..
మావికొమ్మకు ఎందుకిష్టం కొమ్మనిండుగా కాసేనంటే
నాకు కూడా అందుకిష్టం ఈ ఉగాది పండగంటే
నాకు కూడా అందుకిష్టం ఈ ఉగాది పండగంటే.

Review వెచ్చనగు వీచికగ వచ్చెను ఉగాది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top