ఏ పూలు తేవాలి నీ పూజకు?

శివుడి గురించి ఏమని చెప్పాలి? ఆయనను ఏ పూలతో పూజించాలి? సాధారణంగా మారేడు దళాలతో పూజంటే శివుడికి అమితమైన ప్రీతి అని అంటారు. మారేడు పత్రిని శివలింగంపై ఉంచితే చాలు.. ఆ కామధేనువే ఇంటి పశువుగా వశమవుతుందట. మరి, మారేడు తప్ప వేరే ఏ పూలు, పత్రాలతో శివుడిని పూజించవచ్చు?, వేటికి ఏ ఫలితం కలుగుతుంది?..
శివుడికి పుష్ప పూజ.. నియమాలు
శివధర్మ సంగ్రహం, శివ రహస్య ఖండం, లింగ పురాణం, కార్తీక మహాత్మ్యం.. ఈ గ్రంథాల్లో శివుడికి ఇష్టమైన పువ్వుల గురించి వివ రంగా ఉంది. వాటిలో పేర్కొన్న ప్రకారం..
శివుడిని పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం దక్కుతుంది.
కనీసం ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాసప్రాప్తి.
శివుడి పూజకు వాడే పూలు వాడిపోకుండా ఉండాలి.
కీటకాలు కొరికిన పువ్వులు శివ పూజకు పనికిరావు.
ఇతరుల పూదోట నుంచి రహస్యంగా తెంచి తెచ్చిన పూలతోనూ శివుడిని పూజించకూడదు.
శివపూజకు అరణ్యంలో పూచిన పూలను వినియోగిస్తే మంచి ఫలితం, ప్రాముఖ్యత ఉంటుంది.
పది సుగంధ పుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయినవైనా సరే) శివలింగాన్ని పూజిస్తే శత సహస్ర నామాలతో పూజించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.
ఫుష్పం లేదా ఫలం దైవానికి నివేదిస్తున్నప్పుడు దాని ముఖం బోర్లాపడి ఉండకూడదు. అలా ఉంటే దు:ఖం కలుగుతుంది.
పుష్పాలను లేదా పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు.
ఉమ్మెత్త, కడిమి, మల్లె పువ్వులను శివుడికి రాత్రివేళ సమర్పించాలి. జాజి పూలతో వేకువజామున, గన్నేరు, మిగతా అన్ని పూలతో అన్ని వేళలా పూజించవచ్చు.
ఏ నెలలో ఏ పుష్పాలతో శివపూజ చేయాలి?
చైత్ర మాసంలో శివుడిని నృత్యగీతాలతో సేవిస్తూ దర్భ పూలతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది.
వైశాఖ మాసంలో శివుడిని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది.
జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకించి తామరపూలతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది
ఆషాఢ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమలతో కూడిన పూలతో అర్చించిన వారికి బ్రహ్మలోక పథం లభిస్తుంది.
శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుడిని పూజించిన వారికి వేయి గోదానాల ఫలం లభిస్తుంది.
భాద్రపద మాసంలో శివుడిని ఉత్తరేణి పూజలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపథం చేరతారు.
ఆశ్వయుజ మాసంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపథాన్ని చేరతారు.
కార్తీక మాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించిన వారు శివపథాన్ని దర్శించుకుంటారు.
మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించిన వారు ముల్లోకాలను దాటి తామున్న చోటికే తిరిగి రాగలరు.
పుష్య మాసంలో శివుని ఉమ్మెత్త పూజలతో పూజించిన వారు పరమ పదాన్ని పొందుతారు.
మాఘ మాసంలో శివుడిని బిల్వదళాలతో అర్చించిన వారు సూర్యుడు, చంద్రుడు ఉన్న విమానంలో పరమపదానికి వెళ్తారు.
ఫాల్గుణ మాసంలో శివుడి సుగంధ జలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించిన వారికి ఇంద్రుని సింహాసనంలో అర్థభాగం దక్కుతుంది.
శివుడికి ఇష్టమైన పువ్వులు
గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ, అశోక, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబీ, నెమ్మి, ఉత్త రేణి, తామర, జాజి, చెంగల్వ, సంపెంగ, వట్టివేరు, నందివర్ధనం, నాగకేసరం, పొన్న, పచ్చగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమ, కుంకుమపువ్వు, ఎర్రకలువ, నీలిపూలు శివ పూజకు ప్రశస్తం. పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో పూజించినా ఆనం దంతో స్వీకరిస్తానని పరమశివుడు సాక్షాత్తూ ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం.
శివపూజకు పనికిరాని పువ్వులు
మొగలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన, బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, వేప, వెలగ, గురివింద.. ఈ పువ్వులు, వీటి పత్రాలు శివ పూజకు పనికిరావని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
వేయి పూల కంటే..ఏది ఉత్తమం?
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాల కంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపూల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపూల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పూల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం.
వేయి తుమ్మి పూల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణి పూల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం.
వేయి దర్భ పూల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్ఠం.
వేయి జమ్మి పూల కంటే ఒక నల్లకలువ ఉత్తమం.
నల్లకలువ.. పొగడ పువ్వు.. బిల్వ పత్రాలు
శివపూజకు పువ్వులన్నింటిలో నల్ల కలువ పువ్వు ఉత్తమోత్తమమైనది. శివుడికి వేయి నల్ల కలువ పూల మాలను అల్లి సమర్పించిన వారు శివునితో సమానమైన పరాక్రమం గలవారై వందల, వేల కోట్ల కల్పాల పాటు నిత్య కైలాసంలో నివసిస్తారని అంటారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే వారు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందు తారు.
శివుడికి ఇష్టమైన పూలలో పొగడ పూలు కూడా ఉన్నాయి. శివుడిని రోజూ ఒక పొగడ పువ్వుతో అర్చించే భక్తులు వేయి ఆవులను దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. నెలపాటు పొగడ పూలతో పూజించిన వారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండు నెలల పాటు పూజించిన వారు యజ్ఞం చేసిన ఫలాన్ని, మూడు నెలల పాటు పొగడ పూలతో పూజించిన వారు బ్రహ్మలోక ప్రాప్తి, నాలుగు నెలలు పూజించిన వారికి కార్యసిద్ధి, ఐదు నెలలు పూజించిన వారికి యోగసిద్ధి, ఆరు నెలలు పూజించిన వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతాయి.
సాధారణంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బిల్వ (మారేడు) పత్రాలు. లింగ పురాణం ప్రకారం.. జమ్మి, గుంట గలగర, అడ్డరసం, అశోక పత్రాలు, తమాలం, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీటికలువ, మెట్ట కలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను, పత్రాలను కూడా శివపూజలో వాడచ్చు.
శివుడికి ఏ పూలతో పూజకు ఏ ఫలితం?
శివుడిని రోజూ జిల్లేడు పూలతో అర్చించే వారు బంగారాన్ని దానం చేసినంత ఫలాన్ని పొందుతారు.
ధనం కావాలనుకునే వారు శివుడిని గన్నేరు పూలతో పూజించాలి.
మోక్షం కావాలంటే ఉమ్మెత్త పూలతో, సుఖశాంతుల కోసం నల్లకలువలతో శివుడిని పూజించాలి.
చక్రవర్తిత్వం కోసం తెల్ల తామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్ర తామరలతో శివుడికి అర్చించాలి.
నాగకేసరం, కేసరి పుష్పాలతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరు తాయి.
గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజించిన వారికి మంత్రసిద్ధి కలుగుతుంది.
గులాబీ పూలతో లాభసిద్ధి, దంతి, పత్తి పూలతో సౌభాగ్యం కలుగుతాయి.
కోరుకున్న కన్యను పొందాలంటే శివుడిని సన్నజాజి పూలతో పూజించాలి.
సంతానం కావాలనుకునే వారు శివుడిని మొల్ల పూలతో అర్చించాలి.
దర్భపూలతో ఆరోగ్యం, రేల పూలతో ధనం, తుమ్మి పూలతో వశీకరణం, కమిడి పూలతో శత్రుజయం కలుగుతాయి.
బిల్వ దళ పూజ దారిద్య్రాన్ని తొలగిస్తుంది.
శివుడిని మరువంతో పూజిస్తే సుఖం, లొద్దుగ పూలతో పూజిస్తే గోసంపద కలుగుతాయి.
మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్ వృద్ధి.

Review ఏ పూలు తేవాలి నీ పూజకు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top