వెయ్యి చేతుల బాణాసురుడు

బాణాసురుడు వెయ్యి బాహువులు కలిగిన వాడు. ఈయన బలి చక్రవర్తి కొడుకు. ప్రహ్లాదునికి ముని మనవడు. బాణాసురుడు తన తపశ్శక్తితో పరమశివుని కృపను సంపాదించి, ఆయనను మెప్పించి, తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకున్నాడు. బాణాసురుడంటే అటు స్వర్గలోకానికీ, ఇటు అసుర లోకానికీ హడలే. బాణాసురుడు ఒకసారి గర్వాంధుడై.. ‘పరమశివా! నువ్వు తప్ప నాతో యుద్ధం చేసే వారెవరూ లేరా?’ అని అడిగాడు. అతని అహానికి, మూర్ఖత్వానికి లోలోనే నవ్వుకున్న శివుడు- ‘నీ రథం మీద ఉన్న జెండా కిందపడినపుడు నిన్ను జయించే వాడు వస్తాడు’ అంటాడు.
ప్రస్తుత అసోంలోని తేజ్‍పూర్‍ నాడు బాణాసురుడి రాజధాని. అప్పట్లో దీనిని శోణాపూర్‍ లేదా శోనిట్‍పూర్‍ అని పిలిచేవారు.

బాణాసురుడి భార్య కండల. కుమార్తె పేరు ఉష. ఆమె యుక్త వయసుకు వచ్చినపుడు చాలామంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే, బాణాసురుడు వారందరినీ నిరాకరిస్తాడు.

ఉషాదేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఆమెను చిత్రలేఖనంలో అసమాన ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషాదేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి, ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. ఆ విషయాన్ని ఉష చిత్రలేఖకు చెబుతుంది. దీంతో చిత్రలేఖ తన కళా నైపుణ్యంతో భూలోకంలో ఉన్న సమస్త రాజకుమారుల చిత్తరువులను గీసి ఉషకు చూపిస్తుంది. అందులోని ఒక చిత్తరువు చూసి ‘ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు’ అని ఉష ప్రశ్నించగా, ‘ఈయన శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు’ అని చిత్రలేఖ బదులిస్తుంది.

చిత్రలేఖ తన మాయాశక్తితో బృందావనంలో ఉండే అనిరుద్ధుడిని శోణపురానికి రప్పించి, ఉషాదేవి హంస తూలికా తల్పంపై పడవేస్తుంది. ఆ రోజు నుంచి ఉషా అనిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగి తేలుతారు. ఒకరోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు బాణాసురుడికి చెబుతారు. దీంతో బాణుడు అనిరుద్ధుడిపైకి సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్దుడు వారందరినీ నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్లి నాగపాశం వదులుతాడు. ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జెండా కింద పడుతుంది. అది చూసిన బాణుడు తనను జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడతాడు. మరోపక్క బృందావనంలో అనిరుద్ధుడు కనిపించకపోయే సరికి అందరూ చింతిస్తూ ఉంటే, జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణుడు నారదుడి ద్వారా విషయాన్ని గ్రహిస్తాడు.
శ్రీకృష్ణుడు బలరామ, సాత్యకి, యదువంశ సైన్యంతో బాణుడి మీదకు యుద్ధానికి బయల్దేరుతాడు. యాదవ సైన్యం బాణుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. అయితే తన భక్తుడైన బాణుడికి ఇచ్చిన మాట ప్రకారం తన భూతప్రేత పిశాచ ప్రమధ గణాలతో యాదవులపైకి పరమశివుడు యుద్ధానికి వస్తాడు. శివుడు – కృష్ణుడి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్ధరిల్లుతుంది. ఈ యుద్ధాన్ని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు గగనతలం నుంచి వీక్షిస్తారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని కృష్ణుడు తన బ్రహ్మాస్త్రంతో నిరోధిస్తాడు. అలాగే శివుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే పర్వతాస్త్రంతో కృష్ణుడు దానిని అడ్డుకుంటాడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు ఆంధాస్త్రం సంధిస్తాడు. శివుడు ప్రయోగించిన పాశుపతం కృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారిపోతుంది. అప్పుడు కృష్ణుడు సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోతాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోతాడు. అప్పుడు బాణుడి తల్లి కోతరా జుట్టు విరబోసుకుని వివస్త్ర అయి కృష్ణుడి ముందు నిలుచుంటుంది. ఆ స్థితిలో ఆమెను చూడలేక కృష్ణుడు రథంపై నుంచి తల వెనుకకు తిప్పుకుంటాడు. వెంటనే బాణుడు పలాయన మంత్రం పఠిస్తాడు.

పరమశివుడు మూర్ఛ నుంచి తేరుకుని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. కృష్ణుడు వైష్ణవ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని కృష్ణుడు ప్రార్థించడంతో ఉపశమనం పొందుతుంది. కృష్ణుడి వైష్ణవ జ్వరం శివుడి వద్దకు వెళ్లి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉండటంతో కృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి వెయ్యి చేతుల్లో నాలుగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకల దేవతలతో తరలివచ్చి కృష్ణుడిని వేడుకొనగా, కృష్ణుడు శాంతించి, ‘ప్రహ్లాద వంశస్తులను సంహరించనని మాట ఇచ్చిన కారణంగా బాణుడిని విడిచిపెడుతున్నాను. బాణుడు శివ భక్తులలో అగ్రగణ్యుడిగా నిలుస్తాడు’ అని వరమిస్తాడు.
అనంతరం బాణుడు తన కుమార్తెకు అనిరుద్ధుడితో వివాహం జరిపిస్తాడు.

Review వెయ్యి చేతుల బాణాసురుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top