అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు

అవధానం` ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, మధ్యలో పృచ్ఛకులు అడిగితే అప్రస్తుత ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ, ఆశువుగా పద్యాలు చెబుతూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ అవధాని ఆధ్యంతం నవ్వులు పూయిస్తారు. ఇన్ని ప్రశ్నలను, చమత్కార పూరణలను, అప్రస్తుత ప్రశ్నలను ఏకకాలంలో ఎదుర్కొంటూ అవధాని చేసే సాహితీ విన్యాసం ఎంతైనా గొప్పది.
ఒక అవధానంలో కొందరు పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అడిగిన ప్రశ్నలకు అవధాని ఎంత చమత్కారంగా, ఎంత హాస్యోక్తంగా సమాధానాలు చెప్పారో మీరూ చదివి నవ్వుకోండి.
పృచ్ఛకుడు: కాలి పట్టాలకు, రైలు పట్టాలకు అనుబంధం ఏమిటి?
అవధాని: రైలు పట్టాల మీద ఉంటుంది. కాలి మీద పట్టాలుంటాయి.
పృచ్ఛకుడు:కనలేని స్త్రీమూర్తి ఎవరు?
అవధాని: న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవత. ఆమె కళ్లకు గంతలు కట్టి ఉంటారు కనుక ఆమె ఏమీ చూడలేదు.
పృచ్ఛకుడు: సోమవారాన్ని ‘మండే’ అనెందుకు అంటారు?
అవధాని: ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాం కదా! సోమవారం పొద్దున్నే పనికెళ్లాలంటే ఒళ్లు మండుతుంది కదా! అందుకని ‘మండే’ అంటారు.
పృచ్ఛకుడు: ఒక పిల్లవాడు ఇంటి నుంచి పారిపోతే ‘కనిపించుట లేదు’ అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?
అవధాని: ‘కని.. పెంచుట’ లేదని!
పృచ్ఛకుడు: ఈ రోజుల్లో పిల్లలు తల్లిని హెడ్‌కుక్‌గా చూస్తున్నారు. మరి, తండ్రిని ఎలా చూస్తున్నారు?
అవధాని: ఏటీఎంలాగా..
పృచ్ఛకుడు: సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేం చేస్తారు.
అవధాని: పాలిచ్చేవైతే అవధానం అయ్యాక ఇంటికి తోలుకెళ్తా.
పృచ్ఛకుడు: మనిషికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది?
అవధాని: పబ్లి‘సిటీ’.
పృచ్ఛకుడు: క్రికెట్‌ ప్లేయర్‌కు, అవధానికి సామ్యం ఉందా?
అవధాని: వాళ్లు వరల్డ్‌ ప్లేకి వెళ్తారు. మేం వర్డ్స్‌ ప్లేకి వెళ్తాం.
పృచ్చకుడు: ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నాడు వేమన. ఇప్పుడు మీరేమంటారు?
అవధాని: ‘పురుషులందు పుణ్య పురుషులు ఏరయా?’ అంటాను.
పృచ్ఛకుడు: దేవుడి గుడికి తాళం వెయ్యరా?
అవధాని: భజన జరిగే చోట తాళం వేయడం తప్పనిసరి.
పృచ్ఛకుడు: అద్దం ముందు ఆడవారికి, మైకు ముందున్న అమాత్యులకి తేడా ఏమిటి?
అవధాని: ఏం తేడా లేదు. ఇద్దరికీ సమయమే తెలియదు.
పృచ్ఛకుడు:: తుద G తుద R తుట్టతుద, కడ G కడR కట్టకడ అవుతుంది కదా! మరి, అరటి G అరటిR ఏమవుతుంది?
అవధాని: అర టీ G అర టీR ఫుల్‌ టీ అవుతుంది.

Review అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top