పేరు గొప్ప ఊరు దిబ్బ

హైదరాబాద్‍ దక్కనీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠాలను నేర్పే ఆ సామెతలివిగో..
ఊచీ దుఖాన్‍ పీకా పక్వాన్‍
ఇక్కడ దుఖాన్‍ అంటే హోటల్‍ అని అర్థం. గొప్ప హోటలే కానీ, అక్కడివన్నీ చప్పటి వంటలు అని పై సామెతకు భావం. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెత ఒకటి ఉంది కదా! దానికి ఇది చాలా దగ్గర సామెత అన్న మాట. కొన్ని దుకాణాలకు సురుచి అని, రుచి అని ప్రసిద్ధమైన వంటకాల రుచులకు ప్రసిద్ధి అని వాటి గొప్పదనాన్ని చాటుకునేలా బోర్డులు తగిలిస్తారు. విపరీతమైన ప్రచారం సాగిస్తారు. అది నమ్మి ఆ హోటల్‍కు వెళ్తే.. అక్కడి వంటకాలు రుచి చూస్తే ఆశించిన స్థాయిలో ఉండవు. అటువంటి సందర్భంలో నిట్టూరుస్తూ మనసులో అనుకునే మాటే.. ‘ఊచీ దుఖాన్‍.. పీకా పక్వాన్‍’. పేరు చూసి నమ్మి మోసపోయాం.. ఇంకెప్పుడూ ఆ హోటల్‍కు వెళ్లకూడదు’ అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
ఏక్‍ మియీన్‍ మే దో తల్వార్‍
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అనేది తెలుగులో చాలా ప్రసిద్ధి పొందిన సామెత. అటువంటిదే ఉర్దూలోని ‘ఏక్‍ మియీన్‍ మే దో తల్వార్‍’ సామెత కూడా. పరస్పర వ్యతిరేక భావాలు గల ఇద్దరు వ్యక్తులను కలిపి ఒకచోట ఉంచలేం. ఒకవేళ ఉంచితే తమ తమ అభిప్రాయాలే గొప్పవనే తలంపుతో వాగ్వాదానికి దిగు తుంటారు. ఇటువంటి వ్యక్తులను ఇద్దరికి కలిపి ఏదైనా పని అప్పగిస్తే.. ఆ పని కావడం సంగతి దేవుడెరుగు.. వీళ్లిద్దరూ మాత్రం కొట్టుకుంటారు. ఒకరి మాట మరొకరు వినరు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు వ్యతిరేకిస్తారు. ఇటువంటి వాళ్లతో పనేం అవుతుంది. అందుకే అటువంటి సందర్భాలు ఎదురైనపుడు ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.
ఏక్‍ హాత్‍ సే తాలీ నహీ బజ్తీ
ఒక చేత్తో చప్పట్లు కొట్టగలమా? తప్పు రెండు వైపులా ఉంటేనే తగాదా వస్తుందనే అర్థంలో పై సామెతను ఉప యోగిస్తుంటారు. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు వాడాల్సిందే. అలాగే ఒక తగాదా వచ్చిందంటే రెండు వైపులా తేడా ఉందనే అర్థం. అలాగే ఒక మంచి పని చేయాలన్నా కొంతమంది చేతులు కలిపి ముందుకు రావాలి. అప్పుడే ఆయా పనులు విజయవంతం అవుతాయి. ఒకరి కంటే ఎక్కువ మంది చేయాల్సిన పనుల గురించి ప్రస్తావించే సందర్భంలోనూ, అలాగే, ఇద్దరు వ్యక్తులు తగాదా పడే సందర్భంలోనూ ఈ సామెతను ఎక్కువగా వాడుతుంటారు.
ఆప్‍ బలేతో జగ్‍ బలా
‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది దీనికి సరిపోయే తెలుగు సామెత. ఒకాయన పనిపై ఏదో ఊరికి వెళ్లాడట. ఈ ఊరి వాళ్లంతా మంచోళ్లేనా? అని దారిలో ఎదురుపడిన ఓ ఆసామిని అడిగాడట. ‘ముందు నువ్వు ఎలాంటోడివో చెప్పు. ఆ తరువాత మా ఊరోళ్లు ఎటువంటి వాళ్లో చెబుతాను’ అన్నాడట ఆ ఆసామి. మంచోళ్లు, చెడ్డోళ్లు అంటూ వేర్వేరుగా ఉండే ఊళ్లుండవు. అందరూ అన్ని రకాల వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారు. మన నడవడిక, మన మాటతీరు బాగుంటే మనతో బాగుంటారు. మనం తేడాగా ఉంటే వాళ్లూ మన పట్ల తేడాగానే ఉంటారు. అంటే, మన ప్రవర్తనను బట్టే ఎదుటి వారి స్పందన ఉంటుంది అనే అర్థాన్ని ఇస్తుంది ఈ సామెత.

Review పేరు గొప్ప ఊరు దిబ్బ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top