నీలోనే ఆనందం

జీవిత సత్యం తెలుసుకోవడమే ఆనందానికి మూలం. కొండ అడ్డు వచ్చిందని నది తన ప్రవాహాన్ని అక్కడితో ఆపేయదు. నది తన పక్క మార్గం వెతుక్కుని మరీ ముందుకు సాగిపోతుంది. ఉలితో చెక్కితేనే కఠిన శిలలైనా సుందర శిల్పాలుగా మారేది. వెదురు కర్ర అయినా, దాన్ని మురళిగా మారిస్తే ఆనందరవళిని వినిపిస్తుంది. ఆ మధుర గానం ఏకంగా శ్రీకృష్ణ పరమాత్ముడినే పరవశింప చేస్తుంది. ఆ మధుర గానం లోకాలను ఓలలాడిస్తుంది. కష్టాలకు ఎదురొడ్డి, కాలానికి ఎదురీదే వారే విజేతలుగా నిలుస్తారు. సమాజమూ అటువంటి వారినే గౌరవిస్తుంది. వారికి అది గొప్ప గుర్తింపును, ఆనందాన్ని ఇస్తుంది

ఒకసారి ఒక మదపుటేనుగును ఎవరో ఉసిగొల్పారు. అది రౌద్రంతో ఊగిపోతూ గౌతమబుద్ధుని వైపు దూసుకుని వెళ్లింది. అక్కడ ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. అది ఆయనను తొక్కి చంపివేస్తుందేమోనని అక్కడ ఉన్న వారంతా భయపడ్డారు. ఆశ్చర్యంగా ఆ మదపుటేనుగు బుద్ధుడిని చూడగానే, చప్పున ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లింది. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారినందనిరీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆనందం, ఆశ్చర్యం కలగలిసి వారిని ఉద్విగ్నతతో ముంచెత్తింది. అక్కడే ఉన్న ఆనందుడు అనే శిష్యుడు బుద్ధుడితో ఇలా అన్నాడు-

‘ఏనుగు మిమ్మల్ని చూడగానే ఎందుకలా పాదాల మీద మోకరిల్లింది?’
అప్పుడు బుద్ధుడు ఆనందుడికి ఇలా బదులిచ్చాడు.

‘ఒకనాడు అడవి కాలిపోతోంది. ఆ మంటల వేడికి తాళలేక మృగాలు, ఇతర జంతువులు పారిపోవడం మొదలుపెట్టాయి. ఒక ఏనుగు పరుగు తీయడానికి సిద్ధపడి కాలు పైకి లేపింది. అంతలోనే దాని పాదం కిందకు ఒక కుందేలు పరుగున వెళ్లి దూరింది. మంటల నుంచి అక్కడ రక్షణ పొందాలనేది ఆ కుందేలు ఉద్దేశం. అప్పుడు ఆ ఏనుగు ఆ కుందేలు ఉద్దేశాన్ని గ్రహించి, తన పాదాన్ని కిందకు దించకుండా అలాగే ఉంచేసింది. తన కాలును కదపకుండా, ఏమాత్రం కదలకుండా అలాగే నిల్చుండి పోయింది. చివరకు ఆ ఏనుగు అలాగే మంటల్లో కాలి బూడిదైపోయింది. అంతలో దాని పాదం పక్కనుంచి కుందేలు వెళ్లిపోయింది. అలా కుందేలు ప్రాణాలను ఏనుగు కాపాడింది. ముందు జన్మలోని ఆ ఏనుగే ఇప్పటి నేను. మదబలంతో ఇంత క్రితం ఊగిపోయిన ఈ ఏనుగే అప్పటి కుందేలు. అంటే, అప్పట్లో నేను చేసిన సాయానికి ఇప్పుడు ఇలా కృతజ్ఞత తెలుపు కుంది’ అని బుద్ధుడు ఆనందుడికి వివరించాడు.

ఎవరూ పూర్తిగా చెడ్డవారు కానీ, ఎవరూ పూర్తిగా మంచి వారు కానీ లేని లోకమిది. ఆయా సమయ సందర్భాల్లో వారిలో కలిగే భావనలు, ఆలోచనల స్థాయిని బట్టే మంచిచెడులు ఆధారపడి ఉంటాయి. మనలోని ఆనందాన్ని ఇటువంటి మంచిచెడుల ఆధారంగా నిర్మించుకోకూడదు. ఆనందం అనేది స్వాభావికంగా ఉండాలి. మనం సంతోషంగా లేకపోవడానికి కారణం తెలుసుకోనంత వరకు చీకటిలోనే ఉండిపోతాం. అజ్ఞానంతో ఉన్నంత కాలం జీవితంలోకి వెలుగు రాదు. జీవితానికి అర్థం తెలియ చేసే విలువైన పుస్తకాల్ని మనిషి బాగా చదవాలి. మంచి మాటలు వినిపించే సత్సంగాలకు వెళ్లాలి. ఆధ్యాత్మిక బోధనల్ని శ్రద్ధగా చదవాలి, వినాలి. ప్రతి పనినీ దైవంగా భావించి చేయాలి. ఆనందమయ జీవితానికి ఆ ఎరుకే పునాది. మనిషి ప్రతి క్షణాన్నీ ధ్యానంతో సద్వినియోగం చేసుకున్నప్పుడు ఆ పయనంలోని అణువణువూ జీవనోత్సాహమే నిండిపోతుంది.

Review నీలోనే ఆనందం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top