మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు..

‘‘మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదానిని కొట్టినట్టు’’

వెనకటికి ఒకాయన సాము గరిడీ విద్యలు నేర్చాడట. ఆ విద్యను చూపి అందరి మీదా జబర్దస్తీ చేసేవాడట. అతని పహిల్వాన్‍ చేష్టలకు ఆ ఊరు ఊరంతా భయపడేదట. జనులు తనను చూసి భయపడటంతో అతగాడు మరింత రెచ్చిపోయి అందరిపై పెత్తనం చెలాయించేవాడట. అతగాడెంతో మొనగాడన్నట్టు ఆ ఊరివాళ్లంతా అతనికి వంగి వంగి దండాలు పెట్టే వారట. ఏ ఆపద వచ్చినా, కష్టమొచ్చినా అతనికే చెప్పుకునే వారట. అయితే అయ్యవారికి అంత ‘సన్నివేశము’ లేదు. ఏదో కాస్త కండలు చూపి పైపై ఆర్బాటం చేయటమే తప్ప నిజానికి అతనికి ఏమాత్రం వస్తాదుతనం లేదు. ఒకనాడు ఊళ్లో దొంగలు పడ్డారు. అందరికంటే ముందు ఈ వస్తాదు గారే తలుపులు వేసుకుని దాక్కున్నారు. అందరూ ఇది చూసి అయ్యో.. ఇదా నీ మగతనం అని నోళ్లు నొక్కుకున్నారు. ఒకరోజు ఊళ్లో ఒక ముసలావిడ ఇదే విషయమై దారిన వెళ్తున్న వస్తాదు గారిని ప్రశ్నించిందట. దీంతో ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొచ్చిన ఆ వస్తాదు.. పట్టరాని కోపంతో వృద్ధురాలు అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. ఇది చూసిన వారంతా.. దొంగలు, దుర్మార్గుల్ని ఏం చేయలేడు కానీ, బలహీనులపై ప్రతాపం చూపుతున్నాడంటూ తిరగబడ్డారు. అటువంటి వ్యక్తిని ఉద్దేశించే పై సామెత పుట్టింది.. ‘మూడు నెలలు సాము విద్య నేర్చి.. చివరకు ముసలిదాన్ని కొట్టాడు’ అని ఎవరైనా అధికుల మని, అధికారం చాటుకునే వారి గురించి దెప్పి పొడిచే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

‘‘అనగా అనగా రాగం…. తినగా తినగా రోగం’’

ఏదైనా అతి చేస్తే గతి చెడుతుంది. అయితే, కొన్ని విషయాల్లో చేసే అతి సాధన ఫలిస్తుంది. ఉదాహరణకు నిరంతరం ఏదో ఒక కూనిరాగం తీస్తేనో, రాగాలు వల్లె వేస్తేనో.. పాటలు పాడటం వస్తుంది. అలా అని మిగతా విషయాలకు ఇది వర్తించదు. ఉదాహరణకు ఉంది కదాని తింటూ కూర్చుంటే ఆరోగ్యం మాట దేవుడెరుగు.. లేనిపోని రోగాలు పుట్టుకొస్తాయి. ఆహారంలో మితం పాటించాలనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. దైనందిన జీవితంలో ఆహారాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. బాగుందని జిహ్వ చాపల్యం తీరే వరకు తింటూ కూర్చుంటే చివరకు జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం కలుగుతుంది. ఏదైనా ఏది ఎంత వరకు చేయాలో అంత వరకే చేయాలనే వికాసాన్ని ఈ సామెత కలిగిస్తుంది. అభ్యాసం చేస్తే కొత్త కొత్త విషయాలు తెలిసి వస్తాయి. తింటూ కూర్చుంటే ఏం వస్తుంది? కొండలైనా కరిగిపోతాయి.. లేదా రోగాలైనా అంటుకుంటాయి. ఆ విషయాన్నే ఎంతో యుక్తిగా చెబుతుందీ సామెత. అంటే మనం నేర్చుకోదగిన విషయాలపై ఎంత కృషి చేస్తే అంతగా ఫలిస్తుంది. అదే బతకడం కోసమని మితం లేకుండా అతిగా తింటే వందేళ్లు బతకడం కాదు కదా.. ఆయుష్షు అర్థంతరం అవుతుంది.

Review మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top