అన్నదాన ఫలము కథ

ఒక ఊరిలో ఒక రాజు. ఆ రాజుకు ఒక కొడుకు. ఆ కొడుక్కి ఏడాది వయసున్నప్పుడు వేరే రాజులు వచ్చి తన తండ్రిని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారట.! అయితే యువరాజు చిన్నవాడు కావడంతో ఆ బాలుడిని వదిలేసారట. ఒకవేళ పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ తమ మీదకి యుద్ధానికొస్తాడని భావించి.. ఆ పిల్లాడిని కూడా చంపడానికొచ్చారట. అయితే ఈ మాటలు కాస్త.. రాజు భార్యకు చెలికత్తెలు చె ప్పడంతో ఆ పిల్లాడ్ని తీసుకొని సొరంగమార్గము గుండా అడవికి వచ్చేసిందట. అడవి అవతల వున్న ఒక ఊరు చేరుకొని తాను దాసీనని అక్కడా ఇక్కడా ఎక్కడో పనిచేసుకొని తన కొడుకుని పెంచుకుంటుందట.

రోజూ పనిచేసుకుంటు ఆ పిల్లాడికి అన్నం పెట్టేది. ఆ తర్వాత తను తినే సమయానికి అమ్మా ఆకలి అని ఇంటిబయట అనడంతో వారికి ఉన్న అన్నం ఇచ్చేసి తాను గంజి, ఉప్పు తాగి పడుకునేది. అలా కాలం గడిచింది. తన కొడుకు పదహారు ఏళ్లకు వచ్చాడు. అయితే పెరిగి పెద్దయిన ఆ పిల్లాడు ఇలా అన్నాడు.. ‘అమ్మా.. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను… ఏ ఒక్కరోజు నువ్వు కడుపు నిండ అన్నం తినడమెరగవు. మరి నువ్వు తినకుండా పెడితే నీకేంటి ఫలితము? నువ్వు తినకుండా ఎందుకు పెడతున్నావు? అని అడిగాడట.
అప్పుడు అమ్మ.. ‘నాయనా… అన్నదానానికి మించిన దానమేలేదు, ఆ ఫలితము యింత… అంత… అని చెప్పడము ఎవరి వశమూ కాదు’ అని సమాధానమిచ్చిందట. ‘మరి అన్నదాన ఫలమేంటి? ఫలితమేం•ని కొడుకు అడిగాడు.
‘నేను చెప్పలేను, నువ్వు సముద్రం దగ్గరికెళ్ళు. ఆ సముద్రం గట్టున ఒక పాల మామిడి చెట్టు వుంది. ఆ చెట్టు కింద మహాఋషి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన దగ్గరికెళ్ళి అడిగితే చెబుతాడని చెప్పింది తల్లి. అన్నదాన ఫలమును.
తాను ఎలాగైనా తెలుసుకోవాలని, తల్లి దూరమని చెప్పినా వినకుండా బయల్దేరాడు. ముందుగా తన తల్లికి నమస్కరించి.. ఆశ్వీరచనాలు తీసుకొని బయల్దేరాడు. కీకారణ్యమైన అడవిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి చీక•యిపోయింది. అక్కడ ఒక కోయోడు ఈ బాలుడిని చూసాడు! ‘ఈ వేళప్పుడు ఆగకుండా ఎక్కిడికెళ్తున్నావు?’ అని అడిగితే – అన్నదాన ఫలమూ ఫలితమూ తెలుసుకోవడానికెళ్త న్నాను’ అని చెప్పాడట.
‘అయితే.. అది ఇక్కడి నుంచి ఎంత దూరమో తెలుసా.. ఇంత రాత్రి సమయంలో అడవిలో ఎలావెళ్తావు? అసలే పులులు, సింహా లెక్కువ… కూ•రమృగాలున్నాయి. అందుకని మా ఇంటికి రా, ఈ పూట వుండి తెల్లవారగానే లేసి వెళ్ళిపోదువు గాని’ అని అన్నాడు కోయోడు. ఈ పిల్లోడు దిక్కుతోచక సరేనని కోయోడి వెంట వెళ్ళాడు! అయితే కోయోడి భార్య మహా గయ్యాళి.
వీళ్ళిద్దరిని చూడగానే.. ‘నీకేం పని లేదా.. ఎవరినిపడితే వారిని తీసుకొస్తావు. ఇంట్లో బియ్యమెక్కడున్నాయి.. అంటూ చివాట్లు పెట్టింది. ఇదిగో అంటూ కొన్ని బియ్యం ఇచ్చి.. నువ్వే తింటావో.. లేదా ఇద్దరు కలిసి తీంటారో మీ ఇష్టం. అంటూ కోపంగా వెళ్లిపోయిందట.
అంతేకాదు ఆ పిల్ల్లాడితో నువ్వు ఇంట్లో పడుకుంటానంటే ఒప్పుకోనని తెగేసి చెప్పింది. సరేనని ఆ కోయోడు బియ్యము, తేనే, కొన్ని నీళ్లు పట్టుకొని ‘రా నాయనా మా పొలానికి వెళ్దాము అన్నాడు. దాంతో ఆ పిల్లాడు కూడా కోయోడితో కలిసి వెళ్లాడు. తనతో పాటు తెచ్చుకున్న బియ్యాన్ని అన్నం వండి.. తేనెతో కలిపి ఆ పిల్లాడికి ఇచ్చి నువ్వు తిను నాయనా అన్నాడు కోయోడు. అప్పుడు పిల్లాడు మరి నీకు అని అడిగాడు.
‘నాకొద్దయ్యా… నువ్వు తిను.., ఈ ఒక్కపూటకి నేను తినకపోతే ఏమవుతుంది? నువ్వు ఎప్పుడు బయల్దేరావో… ఎప్పుడు తిన్నావో…? మీయమ్మ అన్నమెప్పుడు పెట్టిందో? నువ్వు తినేసి పడుకో నాయనా’ అని అన్నాడు కోయోడు.
ఆ పిల్లాడిని అరప లోపలి పక్క పడుకోబెట్టాడు. పిల్లాడు తిరగబడగలడని ఒడ్డున కోయోడు పడుకున్నాడు.
అయితే, మంచి నిద్దురలో ఉన్న కోయోడు పక్కకు తిరగబోయి కింద పడిపోయాడు. కింద పడిపోయే సరికి –
అక్కడ ఎప్పటినుంచో కాచుకుకూచున్న పులొచ్చిందట.. కింద పడేసరికి టక్కున కోయోడ్ని ఎత్తుకొని వెళ్లిపోయిందట.
కోయోడు తెల్లారి ఇంటికి రాకపోయేసరికి.. అతడి భార్య పొలం వద్దకు వచ్చింది. రాత్రి పూట జరిగిన విషయాన్ని చెప్పాడు పిల్లాడు. పులి ఎత్తుకెళ్తుంటే ఆ అరుపులకు లేచి చూశాను.. కానీ ఈ అరప దిగలేకపోయాను. అని జరిగింది చెప్పాడు.
కోయోడి భార్య కోపంతో పిల్లాడిని నాలుగు తిట్టిందట. ఆ తర్వాత ఏడ్చుకుంటూ వెళ్లిందట. దాంతో తనకు ఏం చేయాలో తెలియక.. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లాడు. వెళ్తూ.. వెళ్తూ.. మళ్లీ మరో అడవిలోకి వెళ్లాడు. పొద్దుననగా బయల్దేరాడు కదా.. ఎండ బాగా ముదిరింది. దాంతో పక్కనే ఉన్న ఓ పెద్ద మామిడి చెట్టు కనబడింది. ఎండకి ఆ మామిడి చెట్టుకింద కూర్చున్నాడు పిల్లాడు.
‘అయితే… కుమారా.. ఇంత శ్రమ మీద ఎక్కడికి వెళ్తున్నావూ?’ అని చెట్టు అడిగిందట.
‘అమ్మా… అన్నదాన ఫలమూ-ఫలితము తెలుసుకోవడానికి
వెళ్తున్నాను’ అని చెప్పాడు.
‘నువ్వెళ్లే మునికి నా గురించి కూడా కొద్దిగ అడుగు నాయనా’ అని అన్నదట ఆ మామిడి చెట్టు.
‘ఏమిటి?’
‘నేను నిండా పూస్తాను. పూసినన్నీ కాయలు కాస్తాను. కాయలన్నీ పళ్ళవుతాయి. నా పండు తిన్నా చేదు విషం, నా కాయతిన్నా చేదు విషం… అన్నీ నేలపాలవుతున్నాయి. ఒక్క పండూ ఎవరూ తినరు. నేను చేసుకున్నపాపమేంటి ? ఈ మాట కాసింత గుర్తుపెట్టుకుని అడిగి, ఈ తోవ నుంచే వస్తావు కదా నాయనా… చెప్పు..’ అంది ఆ చెట్టు.
అలాగే అన్నాడు పిల్లాడు.
అలాగే వెళ్ళగా.. వెళ్ళగా.. వెళ్ళగా… మరికొంత దూరమెళ్లే సరికి ఒక పాము కనబడింది.
ఆ పాము ఇలా అంది.. ‘నాయినా ఎక్కడికి వెళ్త్తున్నావు?’
‘అన్నదాన ఫలమూ-ఫలితము గురించి అడగడానికెళ్తున్నాను’ అని చెప్పాడు పిల్లాడు.
‘నాయనా నా శరీరంలో శక్తి లేదు. నేను తిరిగి., నా ఆహారం నేను సంపాదించుకోలేక పోతన్నాను. నేను చేసిన పాపమేమిటో కొద్దిగా కనుక్కొని చెబుతావా ? అని అడిగిందట.
అలాగే అన్నాడట ఈ పిల్లాడు.
మళ్ళీ కొంత దూరం వెళ్ళగా… వెళ్ళగా దారిలో ఒక బాపనయ్య కనబడ్డాడట. అతనికి వేద వేదాంగాలు వచ్చునట
ఆ పండితునికి! ‘నాయనా ఇంత చిన్న వయసులో ఈ కీకారణ్య మైన అడివిలోన ఒంటరిగా ప్రయాణం చేస్తన్నావు, ఎక్కడి వరకయ్యా’ అని అడిగాడట.. అప్పుడు ఈ పిల్లాడు.. ఇదీవిషయం అంటు చెప్పాడట.
‘మంచిది నాయనా, అయితే నువ్వు నా గురించి కూడా ఒక విషయం అడిగి వస్తావా అని అడిగాడు?’
‘ఏమిటి’?
‘నాకు వేద వేదాంగాల పాండిత్యం తెలుసు. కాని నేను చేసుకున్న కర్మ ఏమిటో కానీ.. నన్నెవ్వరూ పిలవరు.. ఎక్కడికెళ్లినా పని దొరకదు. ఎన్ని దేశాలు తిరిగినా మూడు సెరుల ముష్టేగాని.. మరొక దారి లేదు.. నా కర్మ ఫలమేమిటో అడిగిరా నాయనా’ అన్నాడట బాపనయ్యా.
అలాగేనన్నాడట ఈ పిల్లాడు
ఇంకా ముందుకు వెళ్ళగా – వెళ్ళగా – వెళ్ళగా – సముద్రం వచ్చింది. ఆ ఒడ్డున ఒక చెట్టుంది. ఆ చెట్టు కింద మహాముని తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సులో వున్న మునిని కదపకూడదని సముద్రంలో కలుస్తున్న ఏరులో కొన్ని నీళ్లు తాగాడు. ఎప్పటికో ముని కళ్ళు తెరిచినాడట.
‘ఎవరు బాబూ నువ్వు? ఎప్పుడొచ్చావు?’ అని అడిగాడు. అప్పుడు ఈ బాలుడు మునికి నమస్కరించి ఎప్పుడు వచ్చిందీ చెప్పాడట. దీక్షలో వున్నారు కదా తమ దర్శనభాగ్యం కోసం వేచి యున్నాను అని అన్నాడు.
ఎందుకొచ్చావు?’
‘మీ దగ్గరికే వచ్చాను. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి’ అన్నాడు ఈ పిల్లాడు.
‘ఏమిటి?’
‘చిన్నప్పుడు మా రాజ్యం పోవడం అవన్నీ మీరు ఎరిగినవే. మీకు నేను చెప్పనవసరం లేదు. మాయమ్మ ఏడిళ్ళలోన పాచిపని చేసి ఇన్నో అన్నో గింజలు తెచ్చి వండి నాకింత అన్నం పెట్టి – ఇంతలో ఎవరైనా ఆకలని వస్తే వాళ్ళకి పెట్టేసేది. ఎందుకోసం నువ్వు తినవు?’ అంటే.. నాయనా అన్నదాన ఫలము చెప్పడానికి అలవికాదు, అంది. అది తెలుసుకోవడానికే మీ దగ్గరి కొచ్చాను’ అన్నాడట పిల్ల్లాడు.
అయితే ముని.., ‘సరే నాయనా, నేను విబూది ఇస్తాను, కోసల దేశం వెళ్ళు ఆ దేశం నువ్వెళ్లే తోవలే వుంది. అడవి పక్కనే ఉంది. ఆ కోసల దేశం రాజుకు పిల్లలు లేరు. నొయ్యరాని నోములు నోసారు. చెయ్యరాని పూజలు చేసారు. రాజ్యం ధర్మం మీద నడుపుతున్నాడు. అయినా సంతానం లేదు. ఈ విబూది, నీళ్ళు కలిపి రాణికివ్వు. ఇప్పుటివాళ్లకు తొమ్మిది నెలలు. అప్పటోళ్లకు తొమ్మిది గడియలు. రాణీకీ విబూది నీళ్లిస్తే ప్రసవమవుతుంది. ఆ బిడ్డ నేలన పడకుండ బంగారు పళ్ళెంలోన అరిటాకు వేసి… ఆబిడ్డని నేల పడకుండా బొడ్డు కొయ్యకుండా ఆ పళ్ళెంలో వేసి నీకు తెచ్చి చూపించమను. ఆ రాజ దంపతులు సంతానహీనులు కాబట్టి నువ్వెలా చెప్తే అలా వింటారు. మరి… ఆ శిశువుతో నువ్వు మాట్లాడావంటే – నీకు అన్నదాన ఫలితము చెబుతుంది. అది చెప్పడం నా వశమూ కాదు’ అన్నాడట. ఎవరు? ఇంకెవరు.. ఆ మహాముని!
ముని విబూది ప్లొమిచ్చాడు. అయ్యా ఇది నేలపై పెట్టకు అని జాగ్రత్త్తలు చెప్పాడు పిల్ల్లాడికి.
అయితే స్వామి మరికొన్ని ప్రశ్నలున్నాయి, అడగనా?’ అన్నాడట ఈ పిల్ల్లాడు.
‘అడుగయ్యా’ అన్నాడట మహాముని.
‘వస్తున్న తోవల బ్రాహ్మణుడు కలిసినాడు. అతను వేద పండితుడట. అతని పొట్టకే ఎక్కడికెళ్ళినా జరుగుబడి లేదు.
అతను చేసిన కర్మ ఫలము కనుగొని రమ్మన్నారు స్వామి’ అని ఈ పిల్ల్లాడు చెప్పాడు.
‘అతను వేద పండితుడే కాదనను, కానీ అతను ఎవరికైన ఒక అక్షరం చెప్పితే వాళ్ళు బతికి బాగుపడిపోతారేమో… ఎవరికొక మంత్రం చెపితే వాళ్ళెక్కడ తనని మించిపోతారో అని మర్మముండడం వలన అతని పాండిత్యం పనికిరానిదయ్యింది, అందుకే అది పొట్టకూటికీ పనికిరాలేదు. అని ముని చెప్పాడట. చెప్పి, పాండిత్యం పదిమందికి పంచిపెడితే – ప్రజల్లో ఒకడయి పొట్ట నిండుతుంది’ అని కూడా చెప్పాడు.!
అయితే ఈ పాము సంగతి అడిగాడట. ఆ పాము ఏ వయసులో వున్నా దాని తలమీద మణి వుంది, ఆ మణి తీసి ఎవరికయినా ఇచ్చినట్లయితే, బుర్ర బరువు తీరి తేలికయి తిరుగాడి ఆ పాము ఆహారం సంపాదించుకోగలదు’ అని చెప్పాడట ముని.
ఆ తర్వాత చెట్టు చేదు ఫలాల గురించి చెప్పాడు. పువ్వు పూసి కాయలు కాసినా- కాయలు చేదు, పండ్లు విషము ఎందుకని?’ అని అడిగాడట ఈ పిల్లాడు.
‘దానికి కారణం ఏమీ లేదు. ఆ చెట్టు మొదులున ఏడు గోలేల ధనమది దాచుకుంది. ఆ ధనం వల్ల ఆ కాయా-పండూ విష మయ్యాయి. మరి… ఆ ధనము తీసి ఎవరికయినా పంచిపెట్టినట్లయితే -చేదు పోయి కాయా తింటారు, పండూ తింటారు.’ అని ముని చెప్పాడట.
ఈ పిల్లాడు మునికి నమస్కారం చేసాడు. ఆ ముని కూడా దీవించాడు. ఇక ముని దగ్గర సెలవు తీసుకొని బయల్దేరాడు పిల్లాడు.
తిరిగి రాగా రాగా రాగా – బ్రాహ్మణుడు కలిసాడట. ‘అయ్యా నా గురించి అడిగావా?’ అన్నాడట. అక్కడ ముని చెప్పిన విషయాలన్నీ ఇక్కడ బ్రాహ్మణుడికి చెప్పి ‘పాండిత్యం పదిమందికీ పంచితే – ప్రజల్లో ఒకడివయి పొట్ట నిండుతుంది’ అని మార్గం కూడా చెప్పాడు.
బ్రాహ్మణుడు గ్రహించి ‘నీతోనే మొదలెడతానయ్యా’ అని ఈ పిల్లాడికి పాండిత్యం విద్య నేర్పించినాడట. నేర్చుకున్నాక ఈ పిల్లాడు మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడట.
అలా రాగా….రాగా….రాగా…పాము కనబడింది. దోషమేమిటని అడిగింది. ముని చెప్పినవన్నీ చెప్పాడు. ‘నీ తల మీద మణి భారం తొలగించుకుంటే…. ఎవరికైనా ఇస్తే నువ్వు తిరగ్గలవట’ అని మార్గం చెప్పాడ•ట.
పాము గ్రహించి – ‘ఎవరికో నామణి ఇస్తే ఏముంది? నాకింత సాయం చేసావు. నువ్వే తీసుకో’ అని ఆ మణిని తీసి ఇచ్చేసిందట.
ఆ తర్వాత బ్రాహ్మణుడిచ్చిన వేదాల విద్యలు, పాము ఇచ్చిన మణిని పట్టుకొని ఈ మామిడి చెట్టు దగ్గరికొచ్చాడట. ముని చెప్పినవన్నీ ఆ మామిడిచెట్టుకు చెప్పాడట. చెప్పి ‘నీ మొదల్నవున్న ఏడు గోలేల ధనము చేతే నీ కాయ పండూ చేదై విషమవుతున్నాయట, ఆ దాసిన ధనం గాని నువ్వెవరికయినా పంచి పెట్టినట్లయితే నీ పళ్ళూ కాయలూ అందరూ తింటారు’ అని మార్గం చెప్పాడు పిల్లాడు.
చెట్టు గ్రహించి, ‘నాయనా నా కింత మేలు చేసావు కాబట్టి, ఆ ధనము నువ్వే తీసుకో’ అని ఇచ్చేసిందట.
ఆ ఏడు గోలేల ధనమూ పట్టుకుని అలాగే రాగా – రాగా – రాగా – రాగా అడవి పక్కనున్న కోసల రాజ్యమొచ్చాడు పిల్లాడు. రాజు దగ్గరి కెళ్ళాడట. రాజు దగ్గరకెళ్ళబోతే ద్వారపాలకులు అడ్డుకున్నారట. ‘రాజుగారికి సంతానప్రాప్తి కలిగించడానికి వచ్చాను.’ అని ఈ పిల్లాడు చెప్పాడట. ‘అది కాని పని’ అన్నారట ద్వార పాలకులు. ఎందరెందరో రాజవైద్యులే చేతులెత్తేసినారని చెప్పారట. చెప్పి ‘నీ వయసెంత?’ నువ్వెంత?’ అని కూడా అన్నారట.
రాజుకి ఈ విషయం తెలిసి లోనికి పంపించమన్నాడట. రాజు కూడా ఈ పిల్లాడ్ని చూసి అనుమానించాడట. తనకొక్క అవకాశమివ్వ మని కోరాడట ఈ పిల్లవాడు. అలాగే సంతానం కలగకపోతే నచ్చిన శిక్ష వేసుకోమనీ అన్నాడట. అలాగే మీకు సంతానం కలిగినప్పుడు నాకొక చిన్న షరతు ఉంది.. ఆ షరతు ప్రకారం మీరు చెయ్యాలి అని అన్నాడట. ‘‘ఏమిటి’’..
అప్పుడు చెప్పాడట. ‘నేను మందిస్తాను. మందు స్వీకరించి సంతానం కలిగిన తర్వాతే – ఆ బిడ్డ నేలపడకుండా బంగారు పళ్ళెంలో అరిటాకు వేసి ఆ బిడ్డని అందులో వుంచి బొడ్డు కొయ్యకుండా నా దగ్గరికి తెచ్చి చూపిస్తే నేను ఆ బిడ్డతోటి మూడు మాటలు మాట్లాడ తాను. అదే చాలు నాకు., అదే నా షరతు. సంతానం కలగనప్పుడు నా శిరసు తీసి మీకోట గుమ్మాన కట్టుకోండి.’ అని పిల్లాడు అన్నాడట.
రాజు అందుకు ఒప్పుకున్నాడట.
పండితులూ, ఆస్థాన వైద్యులు వచ్చారట. తక్షణ ముహూర్తమే మంచిదన్నారట.
ఈ పిల్లాడు రొండు లోటాలతో (గ్లాసులు) నీళ్ళు తెప్పించాడట. ఒక లోటాలో నీళ్ళు, మరో లోటా ఖాళీ చేసి అందులో విబూది వేసాడు. విబూధిలో నీళ్ళు పోసి కలిపాడు. ఆ రాణీగారిని పిలవమన్నాడు. రాణీ గారు వచ్చింది. ‘ఈ ద్రవాన్ని నేలన దించక ఇష్టదైవాన్ని తలచుకొని తాగు’ అన్నాడు. ఈ పిల్లాడు చెప్పినట్టుగానే చేసారు. తొమ్మది ఘడియల్లో రాణికి ప్రసవ సమయం వచ్చినట్టుగా నొప్పులు మొదలయ్యాయి. చెలికత్తెలు తీసుకెళ్తుంటే తన షరతు గుర్తు చేసి, జాగ్రత్తలు చెప్పాడు. చెలికత్తెలూ బంగారం పళ్ళెంలో అరిటాకు వేసి పట్టుకున్నారు. ఆ బిడ్డకు బొడ్డు కొయ్యకుండా తెచ్చి చిన్నవాడికి చూపించారు.
అప్పుడు ఆ పసికందుని అడిగాడట. ‘అన్నదానఫలమూ ఫలితమూ ఏమిటి?’ అప్పుడు ఆ శిశువు చెప్పిందట?!
‘నాయనా నువ్వు వస్తున్నప్పుడు కోయవాడినైన నేను.., నీకు సేరడు బియ్యం వండి అన్నం పెట్టి – దోసిడు తేనిచ్చి – పడుకోడానికి జాగ ఇచ్చి – పులికడుపులో పడ్డాను, ఆ పుణ్యం వల్ల ఇదిగో ఇప్పుడీ రాజు కడుపున పుట్టాను. మీ అమ్మ రోజూ చేస్తుంది. ఆ దానధర్మానికి మామూలు మనిషిగా పుట్టదు, ఏ దేవతై పుడుతుంది. అన్నదాన ఫలము చెప్పడానికి నాకూ వశము కాదు… ఎవరికి వాళ్ళే గ్రహించవలసింది’ శిశువు చెప్పిన తర్వాత – ఆ శిశువును తీసుకెళ్ళి బొడ్డు కోసి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకోమని చెప్పాడట.
అక్కడి నుంచి బయల్దేరాడట చిన్నవాడు. రాజుగారి దగ్గర సెలవు తీసుకోబోతే ‘నువ్వెవరు? ఏంటి?’ అని అడిగినాడట. తన తండ్రి రాజ్యం కోల్పోవడం దగ్గర్నుంచి – తన తల్లి ప్రాణభయంతో తనని ఎత్తుకొచ్చి మరో ఉళ్ళో పనిచేసుకొని – అన్నదానం చెయ్యడం – ఆ ఫలము తెలుసుకోవడానికి తాను బయల్దేరిన వరకు అన్నీ చెప్పాడట. ‘నీ రాజ్యం నీకు దక్కించడానికి నా సైన్యంతో నేను నీకు సాయం చేస్తానయ్యా…’ అని కృత్ఞతతో రాజ్యానికి వచ్చి, రాజ్యాన్ని గెలుచుకొని ఈ చిన్నవాడికి పట్టాభిషేకం చేసాడట ఆ రాజు.
ఈ చిన్నవాడు తల్లితో దాన ధర్మాలు చేసుకుంటూ ఆకలి లేని రాజ్యం కోసం ప్రయత్నించాడట!

Review అన్నదాన ఫలము కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top