మనసంతా శివం శివం

ఐదు అక్షరాల మంత్రం.. దాన్ని జపించాలంటే ఉండాలి అదృష్టం.. అదే శివ పంచాక్షరీ మంత్రం. ‘ఓం నమ:శివాయ’ అనే ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి స్తోత్రాన్ని రచించారు జగద్గురువు ఆదిశంకరులు. ఈ పంచాక్షరీ మంత్రం పఠిస్తూ ఉంటే సాక్షాత్తూ శివుడే ఆయా రూపాల్లో మన ఎదుట సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతుంది.

ఓం నాగేంద్రహాయార త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై ‘న’ కారాయ నమ: శివాయ ।। 1 ।।

సాక్షాత్తూ ఆ నాగేంద్రుడినే హారంగా కలిగిన త్రినేత్రుడు, భస్మమే ఆచ్ఛాదనగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు, ఏ రకమైన మలినమూ సోకని శుద్ధుడు, అటువంటి శివుడికి వందనం.

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మౌ ‘మ’కారాయ నమ:శివాయ ।। 2 ।।

మందాకిని నదీ జలాలతో, చందన లేపంతోనూ పూజింపబడేవాడు, నందీశ్వరాధి ప్రమథగణాలకు నాయకుడు, అతి సాధారణమైన మందార పుష్పం మొదలుకుని అనేకానేక పుష్పాలతో పూజింపబడేవాడు అయిన శివుడికి నమస్కారం.

శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై ‘శి’కారాయ నమ:శివాయ ।। 3 ।।

సూర్యుడు ఎలాగైతే కమలాన్ని వికసింపచేస్తాడో.. శివుడు తనపై చూపే అనురాగానికి, భక్తుల పట్ల చూపే మహిమకూ పొంగిపోయే గౌరీదేవి ముఖం నీ వల్లనే వికసిస్తుంది. (సాధారణంగా చాలామంది కమలం పువ్వు రాత్రి పూట వికసిస్తుందని భావిస్తారు. నిజానికి రాత్రిళ్లు వికసించే కమలం మనం రోజూ చూసేది కాదు. హిమాలయాల పర్వత సానువుల్లో అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం అనే పుష్పం. మామూలు కమలం సూర్యుడి కిరణాలు సోకే వికసిస్తుంది). దక్షుడంతటి వాడి అహంకారాన్నే తుంచగలిగిన నిన్ను పూజిస్తే మాలోని అహంకారం సైతం భస్మీపటలం అయిపోతుంది. అటువంటి గరళకంఠుడు, తన జెండా మీద వృషభాన్ని గుర్తుగా కలిగిన వాడు అయిన పరమశివుడికి వందనం.

వశిష్ఠ కుంభోద్వవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై ‘వ’కారాయ నమ:శివాయ ।। 4 ।।

వశిష్ఠుడు, అగస్త్యుడు (ఈయన కుండలో పుట్టాడు. కాబట్టి ఈయనను కుంభోద్భవుడు అని కూడా అంటారు) గౌతముడు వంటి గొప్ప మునీంద్రులతోనూ, దేవతలతోనూ పూజింపబడే వాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్నిని మూడు నేత్రాలుగా కలిగిన వాడు అయిన ఆ శివునికి వందనం.

యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై ‘య’కారాయ నమ:శివాయ ।। 5 ।।

కోరికలను తీర్చే యక్షునిలా కనిపించే, దుష్టులను దండించే శూలాన్ని ధరించే, ఆ జటాధరునికి, దిగంబరునికి, దివ్య పురుషునికీ వందనం.

పంచాక్షరమిదం పుణ్యం య:పఠేచ్ఛివ సన్నిధౌస
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

శివసన్నిధిలో ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి శివలోక ప్రాప్తితో పాటు, అక్కడి పారవశ్యం కూడా దక్కుతుంది. మనసులో శివుడి రూపాన్ని నింపుకున్నా కూడా ఆ హృదయం శివ సన్నిధే అవుతుంది. కాబట్టి మనసారా ఈ పంచాక్షరిని పఠిస్తే ఈ ప్రపంచమే శివలోకమవుతుంది.

Review మనసంతా శివం శివం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top