ప్రకృతిపై పగబట్టిన మనిషి

ఒకరోజు నీరు, గాలి, చెట్లు, జంతువులు, పక్షులు, భూమి అన్నీ కలిసి సమావేశం అయ్యాయి.
నీరు: అయ్యో దేవుడా! కడుపు నిండా స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. మానవుడు చెత్త, రసాయనాలు, ఎన్నో మృతదేహాలను నాలో పారబోస్తున్నాడు. కంపు భరించలేక క్షణ క్షణం చచ్చిపోతున్నాను.
గాలి: ఇంకా నువ్వు నయం అక్కా! నేనైతే హాయిగా ఊపిరి పీల్చుకుని చాలా కాలం అయ్యింది. రకరకాల విష వాయువులతో నిండి నా ఊపిరితిత్తులన్నీ పాడైపోయాయి.
జంతువులు (పక్షులు): మీరు చాలా నయం. వాస్తవానికి మాంసాహారి అయిన మానవుడు, మాలో ఎవరినీ వదలడం లేదు. అన్నింటినీ తినేస్తున్నాడు. ప్రతి రోజూ మాకు దినదినగండంగానే ఉంది. ఏ రోజు ఎవరి వంతు వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.
చెట్టు: మా విషయం అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఈ భూమ్మీద ఉన్న మనిషి ఎప్పుడు మమ్మల్ని పెంచుతాడో, ఎప్పుడు తుంచుతాడో (నరికేస్తాడో) అర్థం కావడం లేదు. అనుక్షణం భయమే. మాలో ఎవరికీ పట్టుమని పది సంవత్సరాలైనా జీవించిన చరిత్రే లేదు.
భూమి: మీరంతా ఎంతకొంత నయం. మానవుడు నాపైనే పుడుతూ నాపైనే మరణిస్తూ కాస్తయినా కనికరం లేకుండా నా ఒళ్లంతా తూట్లు పొడుస్తున్నాడు. పేలుళ్లు జరుపుతున్నాడు. నా స్వరూపమే మార్చేస్తున్నాడు. కొండలు తొలిచేస్తున్నాడు. లోయలు పూడ్చేస్తున్నాడు. నా ముఖమంతా ప్లాస్టిక్‍తో కప్పేస్తున్నాడు.
ఇలా ఎవరి బాధలు వారు చెప్పుకున్నాక.. చివరిగా అన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే-
‘సరే.. మనందరినీ అష్టకష్టాలు పెడుతున్న ఈ దుష్ట మానవుడి చేష్టలకు అంతం లేదా? మనమంతా ఏం చేద్దామో చెప్పండి’.
‘మన చేతుల్లో ఉన్నది ఒక్కటే. అది- భగవంతుడిని ప్రార్థించడం. ఏం చేయాలో మనల్ని పుట్టించిన ఆయననే అడుగుదాం’ అని భూమి మిగతా అందరికీ సలహా ఇచ్చింది.

భూమి, గాలి, నీరు, పక్షులు, జంతువులు, చెట్లు అన్నీ కలిసి భగవంతుడిని తమను కాపాడాలని ప్రార్థించాయి.
వెంటనే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
‘బిడ్డలారా! బాధపడకండి. ఏ ప్రయోజనం ఆశించకుండా మానవుడికి మీరంతా ఎంతో మేలు చేశారు. మితిమీరిన మానవుడు మారతాడని నేను కూడా ఎంతో కాలం నుంచి చూస్తున్నాను. కానీ, ఎంతకీ మారడని ఇప్పటికి అర్థమైంది. అందుకే మన విలువ తెలిసేందుకే ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి ఒక ఉత్పాతాన్ని సృష్టిస్తుంటాను. ఈసారి వైరస్‍ను సృష్టించాను. ఈ దెబ్బకు మనిషికి చెట్ల విలువ, స్వచ్ఛమైన గాలి, నీరు విలువ, ఆహార నియమాల విలువ తెలిసి వచ్చింది. ప్లాస్టిక్‍తో కలిగే అనర్థాలపై అవగాహన కలిగింది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి’ అని చెప్పి భగవంతుడు అదృశ్యమయ్యాడు.
ఇప్పటికైనా మనిషి మారతాడో.. లేదోనని అనుకుంటూ భూమి, నీరు, గాలి, పక్షులు, జంతువులు, చెట్లు తమ తమ స్థానాలకు వెళ్లిపోయాయి.

భారం దించే కృష్ణుడు
గోకులంలో ఒకామె బావి వద్ద నీళ్లు తోడుతోంది. కుండ నిండగానే, ఎవరైనా వచ్చి ఆ కుండ తన తల మీద ఎత్తి పెడతారేమోనని అటూఇటూ చూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కృష్ణుడు కనిపించాడు.ఆమె ‘కృష్ణా.. కృష్ణా’ అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళ్లిపోయాడు.
వీడికేమైంది అనుకుంటూ ఆమె ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకుని ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు.
‘రా కుండ దించి పెడతాను’ అన్నాడు కృష్ణుడు.
ఆమె ఆశ్చర్యంతో అడిగింది-
‘అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించుతాను అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు కృష్ణా!’.
‘నేను భారం దించే వాడిని. భారం ఎక్కించడం నా పని కాదు’ అని కృష్ణుడు నవ్వుతూ అని వెళ్లిపోయాడు.

Review ప్రకృతిపై పగబట్టిన మనిషి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top