అమాయకుడికి అక్షింతలు ఇస్తే?

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.

‘‘కంటికి ఇంపైతే నోటికీ ఇంపే’’

మనం తినే ఆహార పదార్థాం ఏదైనా ముందుగా నోటి కంటే కూడా కంటికి చూడ్డానికి బాగుండాలి. అంటే శుచిగా, శుభ్రంగా ఉండాలి. కంటికి నచ్చితే ఆపై తింటే నోటికీ రుచిగా ఉంటుంది. అసలు చూడ్డానికే బాగుండకపోతే.. అదెంత రుచికరమైనప్పటికీ నోట్లో పెట్టకుండానే బయటకు పారవేస్తారు. అంటే ఆహార పదార్థాం ఎంత గొప్పదని కాదు.. అది కంటికి ఎంత గొప్పగా కనిపిస్తుందనేదే ముఖ్యం. దానిని బట్టే ఆ పదార్థానికి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. చూడ్డానికి చీదరగా ఉన్న వస్తువులను తినడానికి సహజంగానే రుచించదు కదా! ఈ క్రమంలోనే ‘కంటికి ఇంపైతే నోటికీ ఇంపే’ అనే సామెత పుట్టుకొచ్చింది. ఆహార పదార్థం స్వభావం ‘రుచి’ అయినప్పటికీ.. అది ముందుగా కంటికి రుచించాలి. అంటే కంటికి నచ్చాలి. దానిని బట్టే ఆ ఆహార పదార్థంపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కంటికి నచ్చితే ‘అరే.. చూడ్డానికి బాగుందే.. దీన్ని రుచి చూడాలి’ అనే బుద్ధి పుడుతుంది. అదే, బాగా లేకపోతే.. తినడానికి మనస్కరించదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఆహార పదార్థాన్ని అందంగా అలంకరించినంత మాత్రాన సరిపోదు. చూడ్డానికి అందంగా ఉన్న ఆహార పదార్థాలన్నీ రుచికరం అని కాదు. కంటికి ఇంపు కలిగించడం అంటే ఇక్కడ అర్థం- ఆ పదార్థం శుచిగా, శుభ్రంగా ఉండాలని. ఆహార పదార్థాలు శుచిగా, శుభ్రంగా ఉండటం అన్నిటి కంటే ముఖ్యం. వాటిని బట్టే ఆ పదార్థాలకు రుచి ఏర్పడుతుంది. ఇక్కడ ఇంపుగా అంటే శుచిగా, శుభ్రంగా ఉండాలని అర్థం. ఈ రెండు లక్షణాలు లేని పదార్థాలు ఎంత తిన్నా ఫలితం, ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆహార పదార్థాలను శుచిగా, శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. అలా ఉండటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లనే ఆరోగ్యం కానీ, అనారోగ్యం కానీ కలుగుతాయి. ఆరోగ్యకరంగా ఉండటం ఆహార పదార్థాల ముఖ్య లక్షణం అని తెలియ చెప్పే క్రమంలోనే మన పెద్దలు ఈ సామెతను సృష్టించారు.

‘అమాయకుడికి అక్షింతలు ఇస్తే అవతలికి వెళ్లి నోట్లో వేసుకున్నాడట’’

ఇది హాస్యోక్తమైన సామెత. అమాయకులను సరదాగా ఆట పట్టించే సందర్భాలలో ఈ సామెతను పల్లెల్లో బాగా ఉపయోగిస్తుంటారు. అలాగే, సమయం, సందర్భాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉద్దేశించి కూడా ఈ సామెతను వాడుతుంటారు. కొందరికి లౌక్యం తెలియదు. నలుగురిలో ఎలా వ్యవహరించాలో తెలియదు. అలాగే, కొన్ని ఉద్దేశాల్లోని పరమార్థమేమిటో కూడా వారికి తెలియదు. అటువంటి వారు ఆ ఉద్దేశాలకు విరుద్ధమైన పనులు చేస్తుంటారు. అటు వంటిదే ‘అమాయకుడికి అక్షింతలు ఇస్తే అవతలికి వెళ్లి నోట్లో వేసుకున్నా’డనే సామెత. అక్షింతలను శుభకార్యాలు, వధూవరులను ఆశీర్వదించే నిమిత్తం ఇస్తారు. వీటిని వధూవరుల తలపై చల్లి ఆశీర్వదించాల్సింది పోయి వాటిని భగవంతుని ప్రసాదంగా నోట్లోకి తీసుకోవడం అమాయకత్వమే అవుతుంది. అక్షింతలను ఎందుకు ఇస్తారో, ఏయే సందర్భాలలో ఇస్తారో, వాటితో ఏం చేయాలో కనీసం తెలియని వారు ఇలాగే చేస్తారు. మన ఆచారాలు, సంప్రదాయాల పట్ల కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేని వారిని ఉద్దేశించి ఈ సామెత పుట్టింది.

Review అమాయకుడికి అక్షింతలు ఇస్తే?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top