పుణ్యభూమి

మానవుడు..శివుడు
శివుడికి భక్త సులభుడని పేరు. ఆయన రూపం, ఆకారం కూడా హంగూ ఆర్బాటాలు లేకుండా ఉంటాయి. ప్రధానంగా శివాలయాల్లో లింగాకారంలోనే శివుడు దర్శనం ఇస్తుంటాడు కదా. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి అనే గ్రామంలో ఉన్న శివుడి ఆలయంలో శివుడు మానవాకారంలోనే ఉండటం విశేషం. మహా శివరాత్రి, కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రికి అయితే ఇక్కడ నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ అగ్నిగుండం కోరిన కోరికలు తీరుస్తుందని అంటారు. తాము పండిరచిన ధాన్యం, దూపం ఈ గుండంలో వేస్తే పరమశివుడు సంతుష్డుడై భక్తుల కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం. అలాగే, పంటలు బాగా పండి మంచి దిగుబడులు వస్తాయట. దీర్ఘకాలిక రోగాలు కూడా నయం అవుతాయని అంటారు.
ఇక, ఇక్కడి ప్రధాన విశేషం` శివుడు లింగాకారంలోనే కదా.. ఎక్కడైనా దర్శనమిచ్చేది. కానీ, ఇక్కడ మాత్రం మానవ రూపంలో దర్శనమిస్తాడు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి రెండో రోజున అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు. భక్తులు ఈ అగ్నిగుండంలో ధూపం వేసి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. అలాగే, మహా శివరాత్రి సందర్భంగా దీక్షలు చేపట్టే భక్తులు అగ్నిగుండాల రోజునే ఇక్కడకు వచ్చి దీక్షలు విరమిస్తారు.
అయితే, ఇక్కడ శివుడు మానవ రూపంలో వెలియడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
ఒకప్పుడు హేమావతి గ్రామంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందట. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టాయట. వీటి తాకిడితో గ్రామ జనం అల్లాడిపోయారట. శివుడికి భక్తిశ్రద్ధలతో పూజించి, ఎప్పటికీ తమ ఊళ్లోనే ఉండిపోయి, తమను కంటికి రెప్పలా కాపాడాలని చేసిన భక్తిపూర్వక వినతిని మన్నించి, శివుడు వాళ్లలో ఒకడిగా ఉంటూ ఆ ఊరి జనాన్ని అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్నాడట.
అనంతరపురంలోని ఈ గ్రామానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.

Review పుణ్యభూమి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top