మెరుపు మెరుపే.. దీపం దీపమే…

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
రాఘవా స్వస్తి రావణా స్వస్తి
లోకంలో కొందరు అమాయకులు ఉంటారు. అందరూ బాగుండాలని వీరు కోరుకుంటారు. ‘పాప పుణ్యాలు దేవుడికెరుక! నేను మాత్రం ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరూ బాగుండాలనే కోరుకుంటాను’ అని అంటుంటారు. ఎదుటి వ్యక్తి రాముడిలాంటి వాడైనా సరే, రావణుడిలాంటి వాడైనా సరే.. వారికి శుభం కలగాలని, వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. సజ్జన దుర్జన భేదాలు లేకుండా ఇలాంటి తటస్థ వ్యాఖ్యలు చేసే వారిని, తటస్థ వైఖరిని అవలంబించే వారిని ఎద్దేవా చేయడానికి పై జాతీయాన్ని ఉదహరిస్తుంటారు.

మెరుపు దీపమవుతుందా?
ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉరుములు ఉరమడంతో పాటు మెరుపులు మెరుస్తూ ఉంటాయి మెరుపులో కాంతి కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉన్నా.. వాటి కాంతి ఉండేది క్షణకాలమే. దీపాలకు మించిన వెలుతులు వెదజల్లినా మెరుపులు ఎప్పుడూ దీపాలకు ప్రత్యామ్నాయం కాలేవు. దీపాలు ఇచ్చే వెలుగు నిలకడగాఉంటుంది. క్షణికమైన ఆనందాలేవీ దీర్ఘకాల ప్రయోజనాలను ఇవ్వలేవు. జీవితాన్ని సంతోషభరితం చేయలేవు. క్షణిక సుఖాలకు వెంపర్లాడే వాళ్లకు హితవు చెప్పడానికి సాధారణంగా ఈ జాతీయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు.

నేలరాయి నెత్తికెత్తుకోవడం
అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకునే వారిని విమర్శించడానికి వ్యంగ్యంగా ఈ జాతీయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. వెనకటికి ఒక అతి తెలివిపరుడు ఉండేవాడు. పని మీద ఒకసారి పొరుగూరికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా తోవలో ఒక బండరాయి కనిపించింది. దాని మానాన దానిని వదిలేయకుండా, ఆ బండరాతిని కష్టపడి నెత్తి మీదకు ఎత్తుకున్నాడు.. దారి పొడవునా దాని బరువును పంటి బిగువున భరిస్తూ ఊళ్లోకి వచ్చాడు. దీనివల్ల అతగాడు సాధించినది ఏమిటంటే- ఏమీ లేదు. అనవసర మార్గాయాసం తప్ప. కొందరు అనవసరమైన పనులు నెత్తిన వేసుకుని నానా అవస్థలూ పడుతుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

అత్తలేని కోడలుత్తమురాలు
కోడలు లేని అత్త గుణవంతురాలు
కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? ఇక ఆమె ఏం చేసినా గొప్పే. అత్త లేని ఇంట మంచి పేరు తెచ్చుకోవడం కోడలికి బహు సులువు. అదే విధంగా కోడలిని ఆరళ్లు పెట్టని అత్తలూ అరుదే. కోడలు కాపురానికి రానంత వరకు అత్తలందరూ గుణవంతురాళ్లే. కోడలు వస్తే కానీ అత్తల గుణం బయటపడదు. అత్తలేని కోడల్నీ, కోడలు లేని అత్తని ఎవరైనా మెచ్చుకుంటే ఆ అదృష్టానికి నోచుకోని కొందరు అక్కసు వెళ్లబుచ్చుతూ ఈ సామెతను వాడతారు.

Review మెరుపు మెరుపే.. దీపం దీపమే….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top