అల్లం – బెల్లం

రమణ తరగతిలో ఎంతో చురుకైన విద్యార్థి. అతని మార్కులను, ప్రతిభను చూసి రమణ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ ఎప్పుడూ మురిసి పోతుండేది. రమణ విషయంలో ఒక బెంగ వుండేది. అదేమిటంటే రమణ ఎప్పుడూ ఇంటిలోని వంట గది లోకి దొంగచాటుగా వెళ్ళి, బెల్లం డబ్బా ఖాళీ చేసేవాడు. నిర్మలమ్మ ఈ విషయంలో రమణ మందలించినా, రమణ అలవాటులో పెద్దగా మార్పు రాలేదు.
ఒకరోజు నిర్మలమ్మకు, రమణ చదువుకునే స్కూలు టీచరు కనబడింది. నిర్మలమ్మ టీచరుకు రమణ విషయమంతా వినిపించింది. ఏదో విధంగా ఆ అలవాటు పోగొట్టే మార్గం చెప్పుమని ప్రాధేయపడింది. అప్పుడు స్కూలు టీచరు, నిర్మలమ్మకు ఒక చిన్న చిట్కా చెప్పింది.
ఒకరోజు రమణను, తన తరగతి మిత్రులను, టీచరును ఇంటికి ఆహ్వానించమని నిర్మలమ్మను పురమాయించింది. సాయంత్రం రమణ, తరగతి మిత్రులు, టీచరూ అందరు రాగానే నిర్మలమ్మ రమణను వంటగదిలో వున్న బత్తాయిపళ్ళు, తినుబండారాలు తెచ్చి, మిత్రులందరికీ పంచమని చెప్పింది. అలా పంచిన తర్వాత, అలవాటు ప్రకారం రమణ మెల్లగా వంటగదిలోకి వెళ్ళాడు. రమణను గమనించిన టీచరు, రమణను బయటికి పిలిచింది. వంటగదిలో వున్న బెల్లం డబ్బా తీయబోతుండగా, టీచరు పిలుపు విన్నాడు. డబ్బాలో చేయిపెట్టి, చేతి కందినది నోట్లో గబుక్కున వేసుకొని, బయటి గదిలోనికి పరుగెత్తుకుని వచ్చాడు. కానీ, నిర్మలమ్మ టీచరు చెప్పిన చిట్కా ప్రకారం, అంతకు ముందే బెల్లం డబ్బాలో అల్లం ముక్కలు వేసి ఉంచింది. రమణ నోటి లోని అల్లం ముక్కల కొరకడం వల్ల ఒక్కసారిగా కారమయి, కన్నీళ్ళు ఉబికి వచ్చాయి. తరగతి మిత్రులందరి ముందు టీచర్‍ ‘‘రమణా! ఏమయింది? ఎందుకేడుస్తున్నావు?’’ అనడంతో, ఏమి చెప్పలేక, అల్లమును మింగలేక, ఏడుస్తూ, బయట ఉమ్మేసి వచ్చాడు. ఆ తర్వాత ఈ అలవాటు తగ్గిపోయింది.

Review అల్లం – బెల్లం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top