మనిషికి ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు. అంతకుమించిన ఐశ్వర్యం లేదు. కానీ, మనిషి జీవితంలో ఆనందం కోసమంటూ విషాదాన్ని సృష్టించుకుంటున్నాడు. మానవ జీవితాల్లో ఇదో పెద్ద విషాదం. ఆనందం అంటే ఏమిటి? అదెక్కడ దొరుకుతుంది?..వీటికి సమాధానాలను నేడు ‘గూగుల్’లో సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజమైన ఆనందం మన మనసులోనే ఉంటుంది. ఆ విషయాన్ని కనుగొనడమే అసలైన ఆనందం. జీవితంలో ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు. జీవితంలో అష్టైశ్వర్యాలున్నా.. అందులో ఒకటైన ఆనందం లేకపోతే మిగతావన్నీ వృథానే. అందుకనే ఆనందాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఇది ఉంటే మాత్రం మిగతావన్నీ రాణిస్తాయి. అటువంటి ఆనందాన్ని పొందాలంటే జీవితాన్ని ఆధ్యాత్మిక వనం చేసుకోవాలి. ఓ సినీ కవి- ‘లేనిది కోరేవు.. ఉన్నది వగచేవు’ అని చెప్పినట్టు మనమంతా ఉన్న వాటి పట్ల చులకన భావంతో ఉన్నాం. లేని వాటి కోసం అర్రులు చాస్తూ భ్రమల్లో బతుకుతున్నాం. జీవం లేని వాటిని ప్రేమిస్తున్నాం. ప్రాణంతో ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇలా చేస్తే ఆనందం దక్కుతుందా? లేని దాని కోసం వెంపర్లాడటమే ఆనందమనే మాయలో పడి కొట్టుమిట్టాడుతూ దానిని జీవన విధానంగా మార్చుకుంటున్నాం. ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం చిన్నబుచ్చుకుంటున్నాం.
ప్రతి ఒక్కరు జీవితంలో కోరుకునేదేమిటి?
సమాధానం: ఆనందంగా జీవించడం.
ఆనందంగా ఉండాలంటే కావాల్సింది ఏమిటి?
సమాధానం: ఆరోగ్యం.
మనం మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కలిగి ఉంటే మన ఆలోచనలు బాగుంటాయి. మన చేతలు బాగుంటాయి. మనం చేసే ప్రతి పనీ మంచి ఫలితాన్నీ, ఆనందాన్నీ ఇవ్వాలని ఆశిస్తాం. అది సహజమే. కానీ చేసే కర్మను బట్టే ఫలితం ఉంటుంది. కొన్ని తాత్కాలికమైన స్వల్పకాలిక ఆనందాలను ఇస్తాయి. అయితే, ఒక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తుంది. అదేమిటో తెలుసుకుంటే జీవితం ఆరోగ్యానందాల కలబోత అవుతుంది.
‘వేదాంత పంచదశి’ అనే గ్రంథంలో మూడు రకాలైన ఆనందాలను గురించి వివరించారు.
1. విషయానందం.
2. విద్యానందం.
3. బ్రహ్మానందం.
ఈ మూడింటిలోనూ మళ్లీ బ్రహ్మానందం శ్రేష్ఠమైనది. ఇది శాశ్వతమైనదని ఇతిహాసాలు, పురాణాలు, భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి.
విషయానందం కొంతకాలమే..
సిరి సంపదలు, భోగాలు, దాంపత్యం, బంధాలు, మమకారాలు, సుఖసంతోషాలు.. ఇవన్నీ విషయానందం ఇచ్చే అంశాలు. ఇవన్నీ మన జీవన దశలో వివిధ కాలాల్లో ఉంటూ వివిధ కాలాల్లో క్రమేపీ కనుమరుగవుతుంటాయి. ఒడిదుడుకుల జీవన గమనంలో ఆటుపోట్లకు గురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విషయవాంఛలు సైతం వెగటుగా అనిపిస్తాయి.
విద్యానందమూ పరిస్థితులకు లోబడేదే..
ఇక, రెండోదైన విద్యానందం అనేది జ్ఞానాభిలాష మూలంగా కలుగుతుంది. ఇది గౌరవాన్ని పెంచుతుంది. మనిషిని రాజపూజితునిగా చేస్తుంది. అహంకారం, పరిస్థితుల స్థితిగతులు ఈ ఆనందాన్ని తుంచివేయవచ్చు. కాబట్టి విద్యానందం పొందాలనుకునే వారు పరిస్థితుల విషయంలో జాగరూకులై ఉండాలి.
బహ్మానందమే శాశ్వతం..
మూడోదైన బ్రహ్మానందం- ఆత్మకు సంబంధించిన జ్ఞానం. ఈ సకల సృష్టిలో ఏది సత్యమై, నిత్యమై వెలుగొందుతూ, చైతన్యవంతంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది ఈ చరాచర జగత్తుకు మూలమో, జీవుల పుట్టుక, మరణాలకు కారణహేతువో- ఆ బ్రహ్మాండమైన వెలుగును భగవత్ స్వరూపంగా గ్రహించగలిగేదే బ్రహ్మజ్ఞానం. ఇలా గ్రహించగలిగే జ్ఞానం ఇచ్చేదే అఖండమైన బ్రహ్మానందం. అది శాశ్వతానందాన్ని చేకూరుస్తుంది. ఇక దానికి తుది అంటూ లేదు. నిజమైన ఆనందాన్ని కోరుకునే వారు బ్రహ్మానందాన్ని మాత్రమే కోరుకోవాలి. అదొక్కటి మాత్రమే శాశ్వతానందాన్ని కలిగించేది అని తెలుసుకోవాలి.
Review బహ్మ్రానందం.