రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు..

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు
యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే
।।పల్లవి।।
లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు
అంకె సుగ్రీవు గిష్కింధ కంపినయట్టు
వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు
వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే
।।రామ।।
ఘన కిరీటము దేను గరుడని నంపినట్టు
అనుగుగపుల నిండ్ల కంపినట్టు
వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు
నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే
।।రామ।।
పెండిలికి బరుషల బిలువగ నంపినట్టు
అండనే ముందర గంత కంపినయట్టు
వెండియు శ్రీవేంకటేశ వేంట వచ్చి మరలితి
వుండ(డు?) చోట నుంచి నన్ను వూడిగాన కంపవే
।।రామ।।

అవతారిక:
ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవూ నీవు అక్కడ క్షేమంగా ప్రజలను ఏలుకోండయ్యా! ఇక్కడ ఈ కలియుగంలో మీరేం చేస్తారు? మీ మీ చోట్లకి (అయోధ్యకు, ద్వారకకు) పదరే.. అని అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో చమత్కరిస్తున్నారు. మీకు అక్కడకు పోయి, నన్ను మాత్రం వేంకటాద్రికీ, శేషాద్రికీ శ్రీవేంకటేశ్వరునికి వూడిగం చేయమని కాస్త అనుగ్రహంతో పంపండయ్యా! విభీషణుడినీ, సుగ్రీవుడినీ, హనుమంతుడినీ, గరుత్మంతుడినీ, ఉద్ధవుడినీ, వానరసేననూ యెక్కడెక్కడికో పంపారు కదా! అట్లాగే నన్ను కూడా తిరుమలలో ఉండరాదా అని పంపించండి అంటున్నారు. ‘అండనే ముందుర కంత కంపినయట్లు’ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కీర్తన యొక్క మొత్తం భావ వివరణ తెలుసుకోవాల్సిందే.

భావ వివరణ:
ఓ శ్రీరామా! శ్రీకృష్ణా! నీవున్‍ అందే రాజ్యమేలుచుండుదువు (నీవూ నీవూ అక్కడే ప్రజారంజకముగా రాజ్యమేలుచుందురు). ఇక్కడ యేమిసేసేవు? నీ ఇరవుకు (మీ మీ స్థానాలకు) నీవు అయోధ్యకు, నీవు ద్వారకకు పదవే (వెడలుడయ్యా!).

లంకలో విభీషణడి వద్దకు లక్ష్మణుడిని పంపి పట్టాభిషిక్తుడిని చేయించినట్లున్నూ, సుగ్రీవుడికి కిష్కింద నేలుటకు పంపినట్టున్నూ, వాయునందనుడైన హనుమంతుడిని సంజీవని తెచ్చుటకు పంపినట్లున్నూ, మమ్మల్ని కూడా వేంకటాద్రి పొంత నుంచి (దాపున నుండుటకు) నియోగించరాదా ప్రభూ!.

నీ కిరీటమును తెమ్మని ఆనాడు గరుత్మంతుడిని పంపినట్లున్నూ, పట్టాభిషేకానంతరము అయోధ్య నుంచి వానరసేనను తిరిగి కిష్కింధకు పంపివేసినట్లున్నూ, వేదన చెందుచున్న గోపికల వద్దకు ఓదార్చి హితబోధ చేసిరమ్మని నందవ్రజమునకు ఉద్ధవుడిని పంపించినట్లున్నూ, అనుపు శేషాద్రి నుంచి (శేషాద్రినుండమని ఆనతీయుచూ) నన్ను కూడా పంపించరాదా తండ్రీ!.

నీ పెండ్లి పద్మావతితో జరుగుతుంది చూచుటకు విచ్చేయుడని పరుషలను (నీ భక్తులను) పిలువనంపినట్లున్నూ, అండనే కంతకు అంపినట్లు ముందరే నన్ను కూడా పంపించు స్వామీ!. (పెండ్లిలో ఉప్పు, పప్పు, బియ్యమూ ఒక పెట్టెలో పెట్టి తీసికొనిపోయి మగపెండ్లి వారికి అందిస్తారు. ఆ పనికి ఆంతరంగికులను నియోగిస్తారు. దాన్ని కంతకు పంపడం అంటారు). వెండియు (మరియు) ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు వేటకు వెళ్తే తిరుమలను చూసుకోవడానికి నీ వూడిగపు వాడిగా నన్ను వుంచుకోరాదా తండ్రీ!.
(లలిత రాగ కీర్తన)

Review రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top