పూర్వకాలంలో అమరావతిలో ఒక గొప్ప కళాకేంద్రం ఉండేది.
దేశదేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించే వారు.
అక్కడి విద్యార్థులు అందరిలోనూ రత్నఘోషుడనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగే వాడు.
అవి చూసిన వాళ్లందరూ, ‘ఇతడు ముందుముందు గొప్ప చిత్రకారుడు అవుతాడు. దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు’ అని అనుకునే వారు.
ఆ కళాకేంద్రంలోనే జయప్రభ, చందప్రభ అని మరిద్దరు పిల్లవాళ్లు కూడా చిత్రకళ నేర్చుకునే వారు.
అందరూ రత్నఘోషుడిని ప్రశంసించడం చూసి ఈ ఇద్దరికీ రకరకాల భావాలు కలిగేవి.
జయప్రభ వట్టి కుళ్లుమోతు. ఎన్నాళ్లు నేర్చినప్పటికీ రేఖలు గీయడమే సరిగా చేతనైంది కాదు. ఇక బొమ్మలు వేసే నేర్పు ఎక్కడిది? వాటికి రంగులు పులిమేదేమిటి? వెయ్యి జన్మలెత్తినా రత్నఘోషుని సమీపాన ఉండటానికే తనకు అర్హత లేదనే నిశ్చయానికి వచ్చేశాడు.
దీంతో రత్నఘోషుడిపై జయప్రభకు అసూయ మొదలైంది. ఈ ఓర్చలేనితనం క్రమంగా ఈర్ష్యగా మారింది. అతనిపై లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి, అతని కీర్తిని, గొప్పదనాన్ని రూపుమాపాలని మనసులోనే సంకల్పించుకున్నాడు.
నాటి నుంచీ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే.. రత్నఘోషుడి ప్రసక్తి తీసుకుని వచ్చి, ‘వాడి కళా కౌశలం ఏమిటో నాకు తెలుసునయ్యా! ఆ చిత్తరువు వాడికి మేష్టారే వేసిపెట్టాడు. లేకపోతే అంత పసందుగా వేయగలడేం? వాడి ముఖం’ అని అనేవాడు.
‘మళ్లీ ఇంకొక బొమ్మ వేయమనండి చూద్దాం’ అని సవాలు విసిరేవాడు.
ఇకపోతే, రెండవ వాడైన చందప్రభ చిత్తవృత్తి వేరు. ఇతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు. ఏనాడైతే రత్నఘోషుడి బొమ్మలను చూశాడో, అప్పటి నుంచి అతడిని తన గురువుగా భావించుకున్నాడు. గురువు గారి చిత్తరువులను ఎవరైనా ప్రశంసించినపుడు చందప్రభకు ఆనందంతో ఒళ్లు పులకించేది.
‘ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువు అంతటి వాడిని కాగలనా? అంతటి చక్కటి బొమ్మలు వేయగలుగుతానా? ఆయనను పొగిడినట్టే నన్నూ లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా?’ అని ఈ మోస్తరుగా అతడు లోలోన ఉవ్విళ్లూరుతుండే వాడు.
జయప్రభ తన గురువుకు వ్యతిరేకంగా చేసే దుష్ప్రచారాన్ని భరించలేక, చందప్రభ ఎంతగానో చింతించేవాడు.
చందప్రభ రత్నఘోషుడి చిత్తరువులనే మనసులో పెట్టుకుని, అతి దీక్షతో పని చేయసాగాడు. నిద్రలో కూడా అతడికి అదే తపన కలిగేది.
‘అబ్బా! రత్నఘోషుడి బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసమున్నదో! అతనిలాగా సరిగా నేను ఎప్పటికి బొమ్మలు వేయగలనో!’ అని తపించిపోయేవాడు.
కొద్దికాలం కృషి చేయగానే అతని బొమ్మలు రత్నఘోషుని బొమ్మలకు సమీపానికి రాసాగాయి. ఇద్దరి బొమ్మలకూ చాలా పోలికలు కనబడేవి. నలుగురూ అదే విషయాన్ని చెప్పేవారు. దీంతో ‘నేనూ త్వరలో రత్నఘోషుడినైపోతాను’ అని లోలోన సంబరపడేవాడు.
ఇలా ఉండగా, ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చితప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు ఖండాంతరాల నుంచి పేరుమోసిన చిత్రకారులు తమ తమ చిత్రాలను పంపించారు. ఈ ప్రదర్శన కోసం రత్నఘోషుడు కూడా ఒక చిత్తరువు రూపొందించాడు. అంతా పూర్తయింది. ఇంక తైలంతో మెరుగు పెట్టడమే తరువాయి.. రత్నఘోషుడు చిత్రించిన చిత్రాలన్నిటిలో ఇదే మేటి చిత్రం. బహుమతి కూడా అతనికే వస్తుందని లోకం కోడై కూసింది.
రత్నఘోషునికి ఇంతటి కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్నుకుట్టింది. తనకు ఎలానూ ఊరూపేరూ లేదు. స్నేహితుడికి ఖ్యాతి రావడం సహించలేడు. అందుకని అసూయాగ్రస్తుడైన జయప్రభ.. రత్నఘోషుడు ఆదమరిచి ఉండగా రాత్రికి రాత్రి అతనింటికి వెళ్లాడు. మాయోపాయం చూపి వెంట తెచ్చుకున్న ద్రావకాన్ని తీసి రత్నఘోషుడి చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపాడు. ఇదేమీ తెలియని రత్నఘోషుడు తన చిత్రానికి మెరుగులు దిద్ది అద్భుతంగా ముగించాడు.
మరునాడు ప్రదర్శనశాల కిటకిటలాడుతోంది. రత్నఘోషుడికే బహుమతి వస్తుందని ప్రజలంతా ఏనాడో నిశ్చయించుకుని, ఆ తరుణం కోసం కుతూహలంతో వేచి చూడసాగారు.
పరీక్షాధికారులు మొదట రత్నఘోషుని బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంగా తొలగించారు.
ఏమున్నది? బీటలు వారి, మచ్చలు తేలిన వట్టి రంగులు తప్ప బొమ్మా లేదూ.. ఆకారమూ లేదు.
‘అబ్బే! ఇది రత్నఘోషుని చిత్తరువు కాదు’ అన్నారు అందరూ. పరీక్షాధికారులు కూడా అదే అన్నారు.
రత్నఘోషుడు వచ్చాడు. తన బొమ్మను చూసుకున్నాడు. ‘నేటితో నా పని సరి..’ అంటూ కుప్పకూలిపోయాడు.
అంతలో చందప్రభ కంగారుగా అక్కడకు వచ్చాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు.
‘ఇదేమిటి? ఇది రత్నఘోషుడు చిత్రించిన బొమ్మే. కానీ ఇలా మారిపోయిందేమిటి?, కపటం.. మాయ, మోసం! ఆయన ఈ బొమ్మ వేయడాన్ని నేను కళ్లారా చూశాను. అదిగో అంత లలితమైన రేఖలు వేయగల దివ్యహస్తం ఈ దేశంలో మరెక్కడ ఉన్నది? ఏదో దారుణం జరిగింది’ అని చందప్రభ గగ్గోలు పెట్టాడు.
‘నిజం నిలకడ మీద తెలియకపోదు. అధికారులు ఏం జరిగిందో కనుక్కోవాలి. చర్య తీసుకోవాలి’ అంటూ అనేక విధాల వాపోయాడు.
అధికారులు కూడా రత్నఘోషుడికి జరిగిన అనుభవాన్ని తలుచుకుని బాధపడ్డారు. ఎవరో కుట్ర చేసి అతడి చిత్తరువును చెడగొట్టారని అనుమానించారు. అయితేనేం.. ఆ స్థితిలోకి మారిన అతని బొమ్మకు బహుమానం ఇవ్వలేమని తేల్చారు.
అనంతరం పరీక్షాధికారులు హాలులోని మిగతా బొమ్మలను కూడా పరిశీలించారు. అందులో ఒక్కటి మాత్రం వారికి నచ్చింది. అది ఎవరు గీశారని ఆరా తీయగా, చందప్రభ వేసినదని తేలింది. అతనికి బహుమతి ఇచ్చారు.
చందప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నఘోషుడి వద్దకు తీసుకుని వెళ్లి, ‘మిత్రమా! నీ కౌశలం ఎటువంటిదో నాకు తెలుసు. లోకానికి తెలుసు. పరీక్షాధికారులకు తెలుసు. కానీ ఏం చేయగలం? దారుణం జరిగింది. అలా జరగని పక్షమందు నీ పేరు ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతటా మారుమోగిపోయేది కదా! ఈ బహుమతి నీదే కానీ నాది కాదు. నేను తీసుకోవడానికి నాకు అర్హత లేదు. కనుక నువ్వే తీసుకో. నీ సరసన నేను రెండవ వానిగా ఉండటాన్నే గౌరవంగా భావిస్తాను. నిన్ను మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నేర్పు చేత, సాధన చేతనే నీ అంతటి వాడిని అవుతాను కానీ, ఇటువంటి తుచ్ఛపు పనుల వల్ల మాత్రం కాదు. ఈ బహుమతి నీకు దక్కకుండా చేయడానికి ఎవరో చేసిన పని వల్లనే నాకీ బహుమతి వచ్చింది కానీ, నిజంగా నీ ప్రతిభకు మించి నేను ప్రతిభ కనబరిచినందుకు కాదు..’ అంటూ చందప్రభ తన హృదయ వేదనను వెల్లడించాడు.
చందప్రభ ఆవేదన పరీక్షాధికారులను కదిలించింది.
‘ఈసారి రెండు బహుమతులను నిర్ణయిస్తున్నాము. చిత్తరువుకు బహుమతి పొందడానికి రత్నఘోషుడే అర్హుడైతే, సౌశీల్యానికి బహుమతి పొందడానికి చందప్రభ అర్హుడు’ అని చెప్పి ఇద్దరికీ చెరి ఒక బహుమానమూ ఇచ్చి సన్మానించారు.
తన బొమ్మ దెబ్బతిన్నా.. అప్పటి వరకూ రత్నఘోషుడు చిత్రకళకు చేసిన సేవను పరీక్షాధికారులు, ప్రజలు వేనోళ్ల కీర్తించారు. కాబట్టి తగిన బహుమానానికి అర్హుడేనని కొనియాడారు.
రత్నఘోషుడి కీర్తిని ఒక్క దెబ్బతో దెబ్బతీశానని సంతోషపడుతూ అక్కడే తచ్చాడుతూ తిరుగుతున్న జయప్రభ.. రత్నఘోషుడికి పురస్కారం దక్కడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మరింత అసూయాగ్రస్తుడై అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయాడు.
అసూయాపరులు తాత్కాలికంగా నెగ్గినా.. చివరకు వారికి మిగిలేది నిరాశే!.

























































































































































































































































































































































































































Review అనగనగా.. కథ.